'గృహం' రివ్యూ

Friday,November 17,2017 - 12:02 by Z_CLU

నటీ నటులు : సిద్దార్థ్ , ఆండ్రియా, అనిషా విక్టర్, అతుల్ కులకర్ణి,సురేష్ తదితరులు

మ్యూజిక్ : గిరీష్

సినిమాటోగ్రాఫర్ : శ్రేయాష్ క్రిష్ణ

కథా సహకారం : సిద్దార్థ్

నిర్మాణం : ఇటాకీ ఎంటర్ టైన్ మెంట్స్ ,వయోకమ్-18 ప్రొడక్షన్స్

నిర్మాత : సిద్దార్థ్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : మిలింద్ రావు

 

సిద్దార్థ్ హీరోగా మిలింద్ రావు డైరెక్షన్ లో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘గృహం’ ఈ రోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ జోనర్ టచ్ చేసిన సిద్దార్థ్ ఈ సినిమాతో ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం .

 

కథ :

బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గా జీవితాన్ని గడిపే క్రిష్(సిద్దార్థ్) తన భార్య లక్ష్మి(ఆండ్రియా)తో కలిసి ఊరికి దూరంగా ఉండే ఓ గృహంలో నివసిస్తాడు. ఆ ఇంటి పక్కన ఉండే జెస్సి(అనిషా విక్టర్) అనే అమ్మాయికి దెయ్యం పడుతుంది. అయితే ఆ ఇంట్లో ఉండే దెయ్యం క్రిష్ ఇంట్లోకి వస్తుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది.. అసలు ఆ గృహంలో ఎన్ని దెయ్యాలున్నాయి..చివరికి క్రిష్… డాక్టర్ ప్రసాద్(సురేష్) ఓ మాంత్రికుడి సాయంతో ఆ గృహంలో ఉన్న దెయ్యాన్ని ఎలా బయటికి పంపించాడు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ మూవీ చేసిన సిద్దార్థ్ క్రిష్ అనే క్యారెక్టర్ తో మరో సారి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. సినిమాలో సిద్దార్థ్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనిషా విక్టర్ గురించే. మొదటి సినిమా అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. నిజానికి అనిషా పెర్ఫార్మెన్స్ చూసి ఆమెకు ఇదే మొదటి సినిమా అంటే నమ్మలేం. ఆండ్రియా తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు ప్లస్ అయింది. ఇక అతుల్ కులకర్ణి, సురేష్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను సూపర్ హిట్ చేశాడు మ్యూజిక్ డైరక్టర్ గిరీష్. కొన్నిచోట్ల కేవలం సైలెన్స్ తోనే భయపెట్టాడు. రీ-రికార్డింగ్ పరంగా ఈ సినిమాలో చాలా ప్రయోగాలు కనిపించాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి.

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణంపోసింది. ఫ్రేమింగ్, లైటింగ్ పర్ ఫెక్ట్ గా సింక్ అయింది. ఒకటికి రెండు సార్లు రిహార్సల్స్ చేసిమరీ ఫ్రేమ్స్ ఫిక్స్ చేసుకున్నారనే విషయం తెలుస్తోంది. ఫ్రేమింగ్ కు తోడు కలర్ ప్యాలెట్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంటితో పాటు చాలా యాంబియన్స్ ను గ్రీన్ కలర్ లో చూపించడం. టోటల్ గా బ్లూ కలర్ లేకుండా టిల్ట్ వాడడం మూవీకి ఓ కొత్త లుక్ తెచ్చింది.

ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. రిలీజ్ కు ముందు సిద్దార్థ్ చెప్పినట్టు చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ అవసరం లేకుండా యాంబియన్స్ సీన్ ను వివరించేస్తుంటాయి. దీనికి కారణం ఆర్ట్ వర్క్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌండ్ ఎడిటింగ్ తో పాటు వీడియో ఎడిటింగ్  చాలా బాగుంది. సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్ టెక్నీకల్ గా ది బెస్ట్ అనిపించుకున్నారు. ఎటాకీ, వయకామ్ తో కలిసి కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాడు సిద్దార్థ్.

జీ సినిమాలు సమీక్ష :

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో స్టార్ హీరో ఇమేజ్ అందుకున్న సిద్దార్థ్ ఆ తర్వాత తెలుగులో ఆ రేంజ్ హిట్స్ అందుకోలేకపోయాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న సిద్ధూ, ఫైనల్ గా ఇప్పటివరకూ తను నటించని హారర్ జానర్ లో ఓ ప్రయోగం చేశాడు. తమిళ్ లో ‘అవళ్’, హిందీ లో ‘ది హౌస్ నెక్స్ట్ డోర్’,తెలుగులో ‘గృహం’ పేరుతో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులకు తనలోని మరో కోణాన్ని చూపించి మెస్మరైజ్ చేశాడు.

ఇప్పటివరకూ లవర్ బాయ్ గా కనిపించి ఎంటర్టైన్ చేసిన సిద్దార్థ్ ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగున్నర ఏళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేసిన దర్శకుడు మిలింద్ కొన్ని ఊహించని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో భయపెట్టాడు. నిజానికి ఒక ఆత్మతో మనుషులు పడే ఇబ్బందులతో కూడిన రొటీన్ స్టోరీ అయినప్పటికీ సిద్దార్థ్ రచన సహకారంతో ఇంటరెస్టింగ్ & గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశాడు దర్శకుడు మిలింద్. ముఖ్యంగా సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్ లో తెరకెక్కించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించాడు.

సిద్దార్థ్ , అనిషా పెర్ఫార్మెన్స్, అక్కడక్కడ ఊహించని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్, సిద్దార్థ్-ఆండ్రియా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ఫుల్ లెంగ్త్ హారర్ థ్రిల్లర్ ఈమధ్య కాలంలో తెలుగులో రాలేదు. గృహం సినిమా చూడాలంటే నిజంగానే ధైర్యం కావాలి. హారర్ కోరుకునే ప్రేక్షకులకు గృహం సినిమా పిచ్చిగా నచ్చుతుంది.

 

రేటింగ్ : 3/5