గౌతమ్ నంద రివ్యూ

Friday,July 28,2017 - 02:00 by Z_CLU

నటీనటులు : గోపీచంద్, హన్సిక, క్యాథరీన్

మ్యూజిక్ : తమన్

సినిమాటోగ్రఫీ : ఎస్.సౌందర్ రాజన్

ఎడిటింగ్ : గౌతమ్ రాజు

ఫైట్స్ : రామ్-లక్ష్మణ్

ఆర్ట్ డైరక్టర్ : బ్రహ్మ కడలి

నిర్మాతలు : జె.భగవాన్-జె.పుల్లారావు

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంపత్ నంది

విడుదల తేదీ : జులై 28, 2017

హీరో కాదు, కథను నమ్మి ఈ సినిమా తీశానన్నాడు దర్శకుడు సంపత్ నంది. అటు గోపీచంద్ కూడా చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చేశానని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలనంటూ ప్రకటించాడు. మరి వీళ్లిద్దరి నమ్మకం నిజమైందా.. థియేటర్లలోకొచ్చిన గౌతమ్ నంద క్లిక్ అయ్యాడా.. హేవే లుక్..

కథ

గౌతమ్ ఘట్టమనేని ఓ ధనవంతుడు. విలాసాలే అతడి జీవితం. అలాంటి వ్యక్తి జీవితంలో అనుకోని మార్పులు ఎదురవుతాయి. తనను తాను మనిషిగా మారే క్రమంలో ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారతాడు గౌతమ్. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిది..? గౌతమ్ తో నందాకు ఉన్న సంబంధం ఏంటి అనేది బ్యాలెన్స్ కథ.

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా ఈ సినిమాను రిచ్ గా తీర్చిదిద్దిన దర్శకుడ్ని అభినందించి తీరాలి. ఓ మిలియనీర్ కథకు అదే స్థాయిలో ఖర్చు పెట్టాలి. పైగా ఆ ఖర్చు తెరపై కనిపించాలి. ఈ విషయంలో దర్శకుడు సంపత్ నంది, సినిమాటోగ్రఫర్ సౌందర రాజన్ సక్సెస్ అయ్యారు. నిర్మాతలు భగవాన్, పుల్లారావు పెట్టిన ఖర్చుకు పైసా వసూల్ అనిపించారు. వీళ్ల తర్వాత ప్రత్యేకంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ గురించి చెప్పుకోవాలి. 2 పాటలు ఇదివరకే విన్నట్టు అనిపించినప్పటికీ.. సెకెండాఫ్ లో తన రీ-రికార్డింగ్ తో సినిమాకు ప్రాణంపోశాడు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. టెక్నికల్ టీం అంతా మంచి కో-ఆర్డినేషన్ తో పనిచేసింది.

నటీనటుల పనితీరు

గోపీచంద్ కు ఈ కథ నూటికి నూరు శాతం ఫిట్ అయింది. గోపీచంద్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకోలేదని సంపత్ నంది చెబుతున్నప్పటికీ.. ఈ స్టోరీ మాత్రం గోపీచంద్ కే కరెక్ట్. ఓ వైపు గౌతమ్ అనే రిచ్ కిడ్ గా, మరోవైపు నంద అనే స్లమ్ కుర్రాడిగా గోపీచంద్ బ్యాలెన్స్ డ్ గా నటించాడు. హీరోయిన్లు హన్సిక, క్యాథరీన్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. చంద్రమోహన్ మరోసారి తన సీనియారిటీ చూపిస్తే, మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు.

జీ సినిమాలు సమీక్ష

గౌతమ్ నంద సినిమా ఫస్ట్ లుక్ తోనే ఎట్రాక్ట్ చేసింది. మోస్ట్ స్టయిలిష్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కిందనే విషయాన్ని చెప్పేసింది. తర్వాత వచ్చిన ట్రయిలర్ ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. ఇప్పుడు సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. గౌతమ్ ఘట్టమనేని పాత్రను మోస్ట్ స్టయిలిష్ గా చూపించాడు దర్శకుడు సంపత్ నంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త గోపీచంద్ ను ఆవిష్కరించాడు. ధనం మూలం ఇదం జగత్ అనే కాన్సెప్ట్ చుట్టూనే ఈ కథను అల్లుకున్నాడు దర్శకుడు.

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ నుంచి కథనం, డైలాగ్స్ వరకు అన్నీ తానై నడిపించాడు సంపత్ నంది. చెప్పాల్సిన పాయింట్ ను స్ట్రయిట్ గా చెప్పడానికి అక్కడక్కడ తడబడినప్పటికీ కీలకమైన సస్పెన్స్ ను రివీల్ చేసే సన్నివేశంలో తన టాలెంట్ చూపించాడు. చాలా రోజుల తర్వాత గోపీచంద్ ను నెగెటివ్ షేడ్స్ లో చూపించిన క్రెడిట్ సంపత్ నందికి దక్కుతుంది. కాకపోతే గౌతమ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.

హీరోయిన్లు హన్సిక, క్యాథరీన్ తమ గ్లామర్ లుక్స్ తో బాగానే ఎట్రాక్ట్ చేశారు. హన్సిక చూడ్డానికి బాగుంది. క్యాథరీన్ కు మరోసారి మంచి క్యారెక్టర్ పడింది. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని మార్కులు కొట్టేసింది. మ్యూజిక్ డైరక్టర్ తమన్ 2 పాటలతో ఆకట్టుకున్నాడు. గోపీచంద్ తన యాక్టింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. గౌతమ్ గా.. నందాగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో మెప్పించాడు. కామెడీ కోసం వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తిని పెట్టుకున్నప్పటికీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు.

కథ, గోపీచంద్ లుక్, హీరో క్యారెక్టర్ లో ట్విస్ట్, హీరోయిన్ అందాలు, రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముందే ఊహించే విధంగా సాగే స్క్రీన్ ప్లే, మధ్యమధ్యలో బోర్ కొట్టించే సన్నివేశాలు, కామెడీ పండకపోవడం, లవ్ ట్రాక్ ను సరిగ్గా నడపకపోవడం, బలవంతంగా సెంటిమెంట్ పండించాలని చూడడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.

ఇంతకుముందే గోపీచంద్ చెప్పినట్టు అతడి అభిమానుల్ని గౌతమ్ నంద అలరిస్తుంది.

రేటింగ్ : 2.5/5