Movie Review - రామబాణం

Friday,May 05,2023 - 03:18 by Z_CLU

నటీ నటులు : గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు

సంగీతం: మిక్కీ జె మేయర్

కెమెరా : వెట్రి పళనిసామి

కథ: భూపతి రాజా

డైలాగ్స్: మధుసూదన్ పడమటి

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

దర్శకత్వం: శ్రీవాస్

విడుదల తేదీ : 5 మే 2023

 

మ్యాచో స్టార్ గోపీచంద్ , శ్రీవాస్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన ‘రామబాణం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ – శ్రీవాస్ కి హ్యాట్రిక్ హిట్ లభించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

ప్రజలకి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని చూసే మంచి గుణం కలిగిన రాజారాం (జగపతి బాబు), తాము చేసే మంచి పనికి ఎవరైనా ఎదురొస్తే వారికి గట్టిగా బుద్ది చెప్పే అతని తమ్ముడు విక్కీ(గోపీచంద్). తన కళ్ళతో లోకం చూడాలని శాంతంగా ఉండాలని కోరే అన్నయ్య మాటను వినడం ఇష్టం లేక కుటుంబం నుండి కలకత్తా పారిపోయి అక్కడ డాన్ గా ఎదిగిన విక్కీ(గోపి చంద్) తను ప్రేమించిన అమ్మాయి భైరవీ (డింపుల్ హయతి) ను పెళ్లాడటం కోసం 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగి వస్తాడు.

అలా ప్రేమించిన అమ్మాయిను పెళ్లి చేసుకునేందుకు మళ్ళీ తన కుటుంబంలో అడుగుపెట్టిన విక్కీ కి అన్నయ్యకి ఎదురొచ్చి, తన ఫ్యామిలీను పాపరావ్ (నాజర్), అతని అల్లుడు ఇబ్బంది పెడుతున్న విషయం తెలుస్తుంది. రాజారాం తమ ఫుడ్ బిజినెస్ కి అడ్డంకిలా ఉన్నాడని భావించి పాపరావ్ అతని అల్లుడు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి జైలుకి ఎక్కిస్తారు. మరి విక్కీ వారికి ఎలా బుద్ది చెప్పాడు ? అన్నయ్యపై పడిన మచ్చను ఎలా తొలగించాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

గోపీ చంద్ నటన బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో , సాంగ్స్ లో మెస్మరైజ్ చేశాడు. ఎప్పటిలానే కమర్షియల్ మాస్ హీరోగా మెప్పించి స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేశాడు. డింపుల్ హయతి కేవలం ప్రేమ సన్నివేశాలు ,  పాటలకే పరిమితమైంది. లవ్ ట్రాక్ పేలవంగా ఉండటంతో ఆమె పాత్ర క్లిక్ అవ్వలేదు. జగపతి బాబు , ఖుష్బూ అన్న , వదిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. నాజర్, తరుణ్ అరోరా విలనిజం పండలేదు. శుభలేఖ సుధాకర్ , సచిన్ ఖేడేకర్ , కాశీ విశ్వనాథ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ , సప్తగిరి కామెడీ ట్రాక్స్ తో ఎంటర్టైన్ చేయలేకపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కమర్షియల్ మాస్ , ఫ్యామిలీ సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ , ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా కుదరాలి. రామబాణం విషయంలో ఈ రెండూ సెట్ అవ్వలేదు. దీంతో మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు మైనస్ అనిపించింది. లవ్ స్టోరీస్ , ఫ్యామిలీ మూవీస్ కి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చే మిక్కీ ఈ సినిమాకు ఆ రేంజ్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది కానీ బయటికొచ్చాక ఒక్క సాంగ్ కూడా పాడుకునేందుకు గుర్తుకురాదు.వెట్రి పళనిసామి కెమెరా వర్క్ బాగుంది. గోపీచంద్ ను బాగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు , సాంగ్స్ లో అతని కెమెరా పనితనం కనిపించింది. ప్రవీణ్ ఎడిటింగ్ పరవాలేదు. భూపతి రాజా అందించిన కథ , కథనం రొటీన్ గా ఉన్నాయి.

మధుసూదన్ పడమటి డైలాగ్స్ ఆకట్టుకోలేదు. దర్శకుడు శ్రీవాస్ ఈ కథను రొటీన్ గానే డీల్ చేయడం తేడా కొట్టింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష : 

కమర్షియల్ మీటర్ తో సరైన యాక్షన్ సినిమా తీస్తే హిట్ చేసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. తాజాగా వచ్చిన ధమాకా, వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల సక్సెస్ దీనికి ఉదాహరణ. గతేడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’ కమర్షియల్ మీటర్ తో  సింపుల్ గా 100 కోట్లు కొల్లగొట్టింది.  కాకపోతే కమర్షియల్ పేరుతో ఎలాంటి కొత్తదనం లేకుండా కొన్నేళ్ళ క్రితం చూసిన సినిమానే మళ్ళీ వడ్డిస్తే మాత్రం రిజల్ట్ తేడా కొట్టడం ఖాయం.  కమర్షియల్ యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకులు కూడా అదే కథలతో డిజాస్టర్స్ అందుకోవడం చక్కని ఉదాహరణ. ఇక శ్రీవాస్ ఈ సినిమా కోసం భూపతి రాజా నుండి రొటీన్ కథను తీసుకోవడం దానికి సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. అలాగే ‘లక్ష్యం’ లో పండిన సెంటిమెంట్ డ్రామా , ‘లౌక్యం’లో వర్కవుట్ అయిన కామెడీ రెండూ ఈ సినిమాలో లేకపోవడంతో ‘రామబాణం’ సాదా సీదా రొటీన్ యాక్షన్ ఫ్యామిలీ సినిమా అనిపించుకుంది తప్ప మెప్పించలేదు.

శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. దీని ముందు సినిమా ‘సాక్ష్యం’ ఊహించిన రిజల్ట్ తెచ్చుకోకపోయినా అందులో కథ , కథనం ఆకట్టుకున్నాయి. పంచభూతలతో ఓ రీవెంజ్ డ్రామా ప్లాన్ చేసి ఆ సినిమాతో కొత్తగా ప్రయత్నించాడు శ్రీవాస్.  ‘రామబాణం’కి వచ్చే సరికి  రొటీన్ స్టోరీ , అవుట్ డెటెడ్ సన్నివేశాలతో బోల్తా కొట్టాడు. ముఖ్యంగా  ఇలాంటి కమర్షియల్ సినిమాళ్లో ఉండాల్సిన బలమైన సన్నివేశాలు , ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో కుదరలేదు. దీంతో గతంలో చూసిన యాక్షన్ ఫ్యామిలీ సినిమానే  మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది.

అన్నదమ్ముల కథ , కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే  లోకల్ విలన్ , హీరోను డీ  కొట్టడం కోసం అతని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చే మరో విలన్ , ఆ ఇద్దరి నుండి చివరికి హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం… ఈ ఫార్మెట్ కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘రామబాణం’ లోనూ ఇదే  ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ లో లోకల్ విలన్ , కలకత్తాలో డాన్ కి హీరో సమాచారం ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చే సీన్స్ చూస్తే ‘లక్ష్మి’ సినిమా గుర్తొస్తుంది. మాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసం వర్కవుట్ అయిన కమర్షియల్ కథ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ కథతో ఏదైనా కొత్త విషయం చెప్పాలి. ఇందులో ఫుడ్ గురించి చెప్పే విషయం కూడా గతంలో చూసిందే తప్ప కొత్తదనం లేదు. అలాగే కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకోలేదు. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ క్లిక్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ రొటీన్ కామెడీ సీన్స్ , సప్తగిరి స్లాప్ స్టిక్ కామెడీ కూడా బోర్ కొట్టిస్తాయి. కొన్నేళ్లుగా కథల ఎంపికలో గోపీచంద్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇకనైనా జాగ్రత్త తీసుకుంటే  ‘ఒక్కడున్నాడు’ , ‘సాహసం’ లాంటి సినిమాలొస్తాయి. లేదా కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఫ్రెష్ గా వడ్డించే దర్శకుడితో సినిమా ప్లాన్ చేసుకోవాలి.

గోపీచంద్ నటన , యాక్షన్ ఎపిసోడ్స్ , సినిమాటోగ్రఫీ, సాంగ్స్ పిక్చరైజేషన్ సినిమాకు చెప్పుకోదగిన ప్లస్ పాయింట్ కాగా , మిగతావన్నీ మైనస్ అనిపిస్తాయి.

రేటింగ్ : 2 /5