'ఘాజీ' మూవీ రివ్యూ

Wednesday,February 15,2017 - 03:36 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 17, 2017

నటీ నటులు : రానా దగ్గుబాటి, తాప్సి

సినిమాటోగ్రఫీ : మది

మ్యూజిక్ : కె

నిర్మాతలు : పరం వి.పొట్లూరి, కవీన్ కన్నె

నిర్మాణం : పి.వి.పి సినిమా , మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్

మాటలు : గుణ్ణం గంగరాజు

థ- స్క్రీన్-దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

 

రానా నేవీ ఆఫీసర్ గా నటించిన ‘ఘాజీ’ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. భారతీయ సినీచరిత్రలోనే ఇప్పటివరకు చూడని కథాశంతో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో త్రిలింగ్వల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా… తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందా… చూద్దాం..

ghazi-still

కథ :-

1971లో భారత్ నేవికి -పాకిస్థాన్ నేవికి మధ్య జరిగిన యుద్దానికి ముందు చోటు చేసుకున్న  సంఘటన నేపధ్యంలో జరిగిన కథ. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ (రానా దగ్గుబాటి) కెప్టెన్ రణ్ విజయ్ సింగ్( కె కె మీనన్) టీం భారత సబ్ మెరైన్ ల కన్నా ఎన్నో రేట్లు శక్తి వంతమైన పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజీ’ ను ధైర్య సాహసాలతో కూడిన మిషన్ తో ఎలా ఎదుర్కొన్నారు… చివరికి ఎలా గెలిచారు…అనేది సినిమా కథాంశం…

 

నటీ నటుల పనితీరు :

లెఫ్టినెంట్ కమాండర్ గా రానా తన పెర్ఫెర్మెన్స్ తో మరో సారి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ వర్మ అనే క్యారెక్టర్ కి నటుడిగా పర్ఫెక్ట్ అనిపించుకుని సినిమాకు హైలైట్ గా నిలిచాడు.. ఇక రానా తరువాత చెప్పుకోవాల్సింది కె కె మీనన్ గురించే నిజాయితీ గల నేవి కెప్టెన్ గా తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మరో హైలైట్ గా నిలిచాడు. తాప్సి చేసింది చిన్న క్యారెక్టరే అయినా తన నటనతో అలరించింది. సత్య దేవ్ నటన బాగుంది. ఇక ఓంపురి, అతుల్ కులకర్ణి,నాజర్, కునాల్ కౌశిక్,ప్రియ దర్శి తదితరులు తమ క్యారెక్టర్స్ పూర్తి న్యాయం చేశారు…

 

టెక్నీషియన్స్ పనితీరు :-

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పుకోవాలి. ఈ తరహా సినిమాకు కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ చాలా ముఖ్యం. ఆ రెండు ఈ సినిమాకు అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా సబ్ మెరైన్ లోపలి సెట్ అందరినీ ఆకట్టుకుంది… కె. అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. కొన్ని యుద్ధ సన్నివేశాలను ఆర్.ఆర్ బాగా ఎలివేట్ చేసింది.. గుణ్ణం గంగరాజు అందించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ”యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు శత్రువు ప్రాణాలు తీసి గెలవడం” ,”గెలుపు దానంతట అదే మన దగ్గర కి రాదు.. పోరాడి సాదించాలి.” అనే డైలాగ్స్ తో పాటు మరికొన్ని డైలాగ్స్ అలరించాయి. దర్శకుడు సంకల్ప్ స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకునేలా ఉంది.. గ్రాఫిక్ వర్క్, ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ సినిమా స్థాయిలో రిచ్ గా ఉన్నాయి…

ghazi

జీ సినిమాలు సమీక్ష :-

ఇప్పటి వరకూ వెండితెరపై చూడని ఒక చరిత్రను కల్పిత సన్నివేశాలతో కథగా మలిచి ఆ కథకు సరి పడే క్యారెక్టర్స్ తో సరైన స్క్రీన్ ప్లేతో సరికొత్త అనుభూతి కలిగించాడు దర్శకుడు సంకల్ప్. దర్శకుడిగా ఇలాంటి కథతో ‘ఘాజీ’ సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిన సంకల్ప్ ను, ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి నటించి సినిమాకు హైలైట్ గా నిలిచిన రానాని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. రానా,కె.కె.మీనన్ క్యారెక్టర్స్, సబ్ మెరైన్ నీళ్ళల్లోకి దిగి పైకి లేచే సన్నివేశాలు, రానాకి కె.కె. మీనన్ మధ్య వచ్చే సీన్స్, సబ్ మెరైన్ లో ప్రతీ వ్యక్తి పనిచేసే విధానాన్ని కళ్ళకు కట్టేలా చూపించే సీన్స్, సముద్రం లో యుద్ధ కదలికలు తెలుసుకొనే సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. సరికొత్త కథ, కథాంశం, ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి.. ఫైనల్ గా ‘ఘాజీ’ తెలుగు ప్రేక్షకులు గర్వాంగా చెప్పుకొనే సినిమాగా నిలుస్తుందనడం ఎటువంటి సందేహం లేదు…

 

రేటింగ్ : 3 .5 /5