'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ

Friday,November 22,2019 - 11:56 by Z_CLU

నటీనటులు: సందీప్ మాధవ్ సత్య దేవ్ , ముస్కాన్,దేవిక,మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్వర్మ, తిరువీర్,అభయ్,మహాతి, మాస్టర్ శ్రీనివాస్ పోకలే తదితరులు .

కెమెరా : సుధాకర్ యెక్కంటి

సంగీతం : సురేష్ బొబ్బిలి

నేపథ్య సంగీతం  : హర్షవర్ధన్ రామేశ్వర్

అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి

నిర్మాత: అప్పిరెడ్డి

రచన-దర్శకత్వం : జీవన్ రెడ్డి

సెన్సార్ : U/A

నిడివి : 153

విడుదల తేది : 22 నవంబర్ 2019

స్టూడెంట్ లీడర్ కథతో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఎట్టకేలకు మళ్ళీ ఇన్నాళ్ళకి ‘జార్జ్ రెడ్డి’ రూపంలో ఓ స్టూడెంట్ లీడర్  సినిమా వచ్చింది. ఉస్మానియాలో చదువుతూ ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్.


కథ :

కేరళలో పుట్టిన జార్జ్ రెడ్డి(సందీప్ మాధవ్) చిన్నతనం నుండే భగత్‌ సింగ్‌, చెగువేరా పుస్తకాలు చదవడంతో అతనిలో చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండే చదువులో చురుకుగా ఉండే జార్జ్.. ప్రతీ విషయాన్ని ఎంతో శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందుతాడు. తల్లి(దేవిక) సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. జార్జ్ రెడ్డి కేరళ, బెంగళూర్, చెన్నైలలో చదివి చివరికి హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయంలో చేరతాడు.

తన ముందు ఏదైనా అన్యాయం జరిగినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేని జార్జ్ రెడ్డి మరో విద్యార్ది రాజన్న(అభయ్)ను క్యాంటీన్ లో దూషించడం చూసి కౌశిక్( చైతన్య కృష్ణ) గ్యాంగ్ పై ఎదురు తిరుగుతాడు. అక్కడి నుండే పోరాటం మొదలు పెడతాడు. ఈ క్రమంలో కిషన్ సింగ్ తమ్ముడు లలన్(తిరువీర్) తో గొడవ పెట్టుకుంటాడు. అలాగే ABCD పార్టీకి, మరో పార్టీకి ఎదురు తిరిగి కొత్త ఎజెండాతో కొత్త పార్టీ పెట్టి స్టూడెంట్ లీడర్ గా పోటీ చేస్తాడు. అలా ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచిన జార్జ్ రెడ్డి విద్యార్థుల్లో ఎలాంటి స్ఫూర్తిని నింపాడు..? చివరికి కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి ఎలా కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరివరకు ఎలా పోరాడాడు ? అనేదే సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఇప్పటికే కథానాయకుడిగా తన టాలెంట్ ఏంటో రుజువు చేసుకున్న సందీప్ మాధవ్ మరోసారి జార్జ్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపే సన్నివేశాల్లో బాగా నటించాడు. క్యారెక్టర్ లో దమ్ము లేకపోవడంతో కొన్ని సన్నివేశాల్లో మాత్రం జస్ట్ పరవాలేదనిపించుకున్నాడు. మాయ పాత్రలో ముస్కాన్ నటన బాగుంది. తల్లి పాత్రలో దేవిక మంచి నటన కనబరిచింది. విద్యార్థి సంఘం నాయకుడిగా సత్య పాత్రలో సత్యదేవ్ మంచి మార్కులు అందుకున్నాడు. అర్జున్ పాత్రలో మనోజ్ నందం కూడా బాగానే నటించాడు.

రాజన్న పాత్రలో అభయ్ నటన ఆకట్టుకుంది. క్యాంటీన్ సీన్ లో చాలా బాగా నటించాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో కాస్త అతి అనిపించింది. యాదమ్మ రాజు కామెడీ సినిమాకు ప్లస్ అయింది. తన కామెడీ టైమింగ్ వల్ల కొన్ని సందర్భాల్లో డైలాగ్ కామెడీ పేలింది. ప్రొఫెసర్ గా సంజీవ్ రెడ్డి, లలన్ గా తిరువీర్, వినయ్ వర్మ, శత్రు, పవన్ రమేష్, జగదీశ్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాటోగ్రఫీతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సుధాకర్ యెక్కంటి విజువల్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని సన్నివేశాలకు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కాకపోతే కొన్ని సన్నివేశాలకు మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ అవ్వలేదు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ పరవాలేదు. మరీ ఎక్కువ లెంత్ అనిపించకుండా చూసుకున్నాడు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ వర్క్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని రీ క్రియేట్ చేయడంలో అతని ప్రతిభ కనిపిస్తుంది.

సంజనా శ్రీనివాస్ కాస్ట్యూమ్స్ పాత్రలకు అప్పటి లుక్ తీసుకొచ్చాయి. గణేష్, ఆర్కే కంపోజ్ చేసిన స్టంట్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసాయి. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. ఖలీష,రాహుల్ సౌండ్ డిజైన్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. జీవన్ రెడ్డి రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ స్కోప్ ఉన్నప్పటికీ అలాంటి డైలాగ్స్ పడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

బయోపిక్ లను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలగాలి. ఇక ‘జార్జి రెడ్డి’ లాంటి స్టఫ్ ఉన్న కథను తెరకెక్కించేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకొని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకోవాలి. ఇక్కడే దర్శకుడు జీవన్ మేజర్ మిస్టేక్ చేసాడు. ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ ను స్క్రీన్ మీద అంతే పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడిగా జీవన్ రెడ్డి విఫలమయ్యాడు. ఇటీవల వచ్చిన బయోపిక్ స్టైల్ లోనే సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత అక్కడక్కడా తడబడుతూ సన్నివేశాలతో మెస్మరైజ్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా జార్జ్ రెడ్డి క్యారెక్టర్ కు ఎక్కడా సరైన ఎలివేషన్ ఇవ్వలేదు. ఎంతగానో ఊహించిన ఇంట్రడక్షన్ కూడా సాదాసీదాగా తెరకెక్కించి నిరాశపరిచాడు జీవన్. ఇక హీరో ఇంట్రడక్షన్ అవ్వగానే హీరోయిన్ చేత అర్జెంట్ గా ఓ సాంగ్ పెట్టాలనే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ‘బుల్లెట్’ అంటూ వచ్చే సాంగ్ బాగున్నప్పటికీ.. ఆదిలోనే కథకు అడ్డం తగిలింది.

ఒక వైపు జార్జ్ రెడ్డి కథతో డాక్యుమెంటరీగా తీసేందుకు అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసే ఓ అమ్మాయి. అదే సమయంలో జార్జ్ రెడ్డి చిన్నతనం నుండి అతని మరణం వరకూ కథను చెప్తూ సినిమాను తెరకెక్కించాడు జీవన్. అయితే జార్జి రెడ్డి అసలెందుకు పోరాటం మొదలు పెట్టాడు ? అతను విప్లవకారుడిగా మార్చిన సంఘటనలేంటి ? అనే వాటిపై పూర్తిగా ఫోకస్ పెట్టకుండా తన ముందు ఏదైనా గొడవ జరిగితే వెంటనే రియాక్ట్ అయి ఫైటర్ గా మారే ఓ వ్యక్తిగా చిత్రీకరించాడు దర్శకుడు. అక్కడే కథ తేడా కొట్టింది. అలా కాకుండా జార్జ్ ఎందుకు పోరాటం మొదలు పెట్టాడు..? అతను చదివిన పుస్తకాల ద్వారా ఎలాంటి స్ఫూర్తి పొందాడు..? కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా మరణించే వరకూ విద్యార్థులు కోసం రైతుల కోసం ఎందుకు ఉద్యమకారుడిగా పోరాడాడు..? వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చే సన్నివేశాలు పడాల్సింది. నిజానికి తను స్ఫూర్తి పొంది సినిమా చేసే ఆలోచన వచ్చినప్పుడు అతని ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులు కూడా అదే ఫీలయ్యేలా సినిమాను తెరకెక్కించాలి. ఎందుకో జీవన్ తను స్ఫూర్తి పొందిన ఎలిమెంట్స్ తో ‘జార్జి రెడ్డి’ బెస్ట్ బయోపిక్స్ లో ఒకటిగా నిలబెట్టలేకపోయాడు. ఇక ఉన్నంతలో టెక్నీషియన్స్ అందరూ జీవన్ కి బెస్ట్ సపోర్ట్ అందించారు. ముఖ్యంగా జీవన్ విజన్ ని సుధాకర్ ఎగ్జాక్ట్ గా చూపించే ప్రయత్నం చేసాడు. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా కొన్ని సందర్భాల్లో సాదా సీదా సన్నివేశాలను కూడా నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు.

ఇక క్యారెక్టర్ లో పవర్ ఫుల్ నెస్ లేకపోవడం ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న సందీప్ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నిజానికి అతని క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే బలమైన సన్నివేశాలు ఒకటి తర్వాత మరొకటి వరుసగా పడితే సినిమా మరో రేంజ్ లో ఉండేది. ఎంత సేపు జార్జి రెడ్డిని ఓ సైలెంట్ స్టూడెంట్ గా చూపిస్తూ మరోవైపు ఊరికే గొడవలకు దిగే కుర్రాడిగా చూపించే సన్నివేశాలు రాసుకున్నాడు. బయోపిక్ అయినప్పటికీ సినిమా లిబర్టీ తీసుకొని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే రోమాలు నిక్కపొడిచే సన్నివేశాలు క్రియేట్ చేసి ఇంట్రో సీన్ నుండి క్లైమాక్స్ వరకూ అదే ఫార్మేట్ ను ఫాలో అయితే బాగుండేది. అలాంటి సన్నివేశాలు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో సినిమా ఆర్ట్ ఫిలిం , డాక్యుమెంటరీ లను తలపిస్తుంది.

రెండో భాగంలో స్టూడెంట్ గొడవలతో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకుంటే బోర్ కొట్టకుండా ఉండేది. ఇవన్నీ పక్కన పెడితే జార్జి రెడ్డి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలనుకునే వారికి స్టూడెంట్ లీడర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘జార్జ్ రెడ్డి’ కొంత వరకూ నచ్చేస్తాడు. మిగతా వారిని మాత్రం మెప్పించడం కష్టమే.

రేటింగ్ : 2.5 /5