ఫిదా రివ్యూ

Friday,July 21,2017 - 01:48 by Z_CLU

నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి

సంగీతం : శక్తికాంత్

నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శేఖర్ కమ్ముల

విడుదల తేదీ : జులై 21, 2017

చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల సినిమా వచ్చింది. మరి ఈసారి అతడి మేజిక్ పనిచేసిందా. థియేటర్లలోకొచ్చిన ఫిదా ప్రేక్షకుల్ని ఫిదా చేసిందా లేదా.. హేవే లుక్.

కథ

తెలంగాణలోని బాన్సువాడలో ఉండే భానుమతి (సాయి పల్లవి) బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తుంటుంది. ఆమె అక్కను చూడ్డానికి అమెరికా నుంచి ఓ కుర్రాడు వస్తాడు. తమ్ముడు చూసి ఓకే చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటాడు. అలా అమెరికా నుంచి సాయి పల్లవి ఇంట్లోకి ఎంటరవుతాడు వరుణ్ (వరుణ్ తేజ్). అక్కడ్నుంచి హీరోహీరోయిన్ల మధ్య పరిచయం జరిగి, వాళ్ల మధ్య ప్రేమ పుడుతుంది. తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తాడు వరుణ్. కానీ కొన్ని కారణాల వల్ల భానుమతి రిజెక్ట్ చేస్తుంది. ఇంతకీ ఆ కారణాలేంటి.. భానుమతి అమెరికా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది.. ఫైనల్ గా భానుమతి-వరుణ్ కలిశారా లేదా అనేది స్టోరీ.

టెక్నీషియన్స్ పనితీరు

ఒక్క ముక్కలో చెప్పాలంటే టెక్నీషియన్స్ అంతా శేఖర్ కమ్ముల స్టయిల్ లో ఒదిగిపోయారు. సంగీత దర్శకుడు శక్తికాంత్ అయితే మరీను. చాలా చోట్ల హ్యాపీడేస్, గోదావరి సినిమాలను తలపించేలా నేపథ్య సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌడ్ స్కోర్ తో పాటు, హిట్ సాంగ్స్ తో తన మార్క్ చూపించాడు శక్తికాంత్. సినిమాటోగ్రాఫర్ వర్క్ చాలా బాగుంది. తెలంగాణలోని బాన్సువాడను ఎంత అద్భుతంగా చూపించాడో… అమెరికాలోని ఆస్టన్ ను కూడా అంతే అద్భుతంగా చూపించాడు. స్వతహాగా డాన్సర్ అయిన సాయిపల్లవికి కొరియోగ్రాఫర్ మంచి మూమెంట్స్ ఇచ్చాడు. ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

సినిమా మొత్తానికి వన్ మేన్ ఆర్మీగా నిలిచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. చాన్నాళ్ల తర్వాత తన మేజిక్ మొత్తం ఫిదాలో చూపించాడు. చిన్న చిన్న డైలాగ్స్ తో కామెడీ పండించడంతో పాటు.. ఎమోషనల్ సీన్స్ తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కమ్ముల మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కమ్ముల సినిమా.

నటీనటుల పనితీరు

నటీనటుల విషయానికొస్తే ముందు చెప్పుకోవాల్సింది సాయి పల్లవి గురించే. ఇకపై ఆమెను ఎవరూ పరభాషా హీరోయిన్ అనరు. తెలంగాణ ఆడబిడ్డగా పిలుచుకుంటారు. అంతలా భానుమతి పాత్రలో ఒదిగిపోయింది సాయిపల్లవి. మొదటి సినిమాకే తెలంగాణ యాసలో ఆమె డబ్బింగ్ చెప్పుకున్న విధానం చూస్తే ముచ్చటేస్తుంది. తెలంగాణ స్టయిల్ లో ఒక్కో డైలాగ్ చెబుతుంటే.. డబ్బింగ్ థియేటర్ లో సాయి పల్లవి పడిన కష్టం కనిపిస్తుంది. దీంతో పాటు యాక్టింగ్, డాన్స్ లో కూడా మెరిపించింది. సాయి పల్లవి టాలీవుడ్ లాంఛింగ్ కు ఫిదాను మించిన పర్ ఫెక్ట్ మూవీ దొరకదేమో అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక సాయి పల్లవిని చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

హీరో వరుణ్ తేజ్ తన వయసుకు తగ్గ పాత్ర చేశాడు. శేఖర్ కమ్ముల చెప్పింది యాజ్ ఇటీజ్ గా చేసినట్టున్నాడు.. చాలా చోట్ల కమ్ముల స్టయిల్ లో కనిపించాడు. గత సినిమాలతో పోల్చి చూస్తే ఎమోషనల్ సీన్స్ లో వరుణ్ తేజ్ బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సెన్సిబుల్ ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా ఈజీగా పండించగలిగాడు.

హీరోహీరోయిన్లతో పాటు మిగతా వాళ్లంతా తమ పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.

జీ సినిమాలు సమీక్ష

వరుణ్ తేజ్ చెప్పినట్టు శేఖర్ కమ్ముల సినిమాల్లో పెద్దగా కథ ఉండదు. ఏవేవో ట్విస్టులు కనిపించవు. బలమైన సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. సరిగ్గా అలాంటి హార్ట్ టచింగ్ సీన్లే ఫిదాకు ప్లస్ అయ్యాయి. తన బలం ఏంటో కమ్ముల మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. పల్లె వాతావరణం, హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు, వాళ్ల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా పండించాడు. బాన్సువాడలో సినిమా తీయాలని ఎలా అనిపించిందో కానీ ఆ నేచురల్ యాంబియన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

కమ్ముల రాసుకున్న సన్నివేశాలకు వరుణ్ తేజ్, సాయి పల్లవి పూర్తి న్యాయం చేశారు. ఒక సందర్భంలో హీరో కంటే హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కథ ప్రకారం చూసుకుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. భానుమతి క్యారెక్టర్ తో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సాయి పల్లవి. సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించింది. ఆమె లుక్స్, డైలాగ్స్, డాన్స్ అన్నీ సింప్లీ సూపర్బ్. వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయలేదు. కమ్ముల హీరో అనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తే అరె భలే చేశాడే అనిపిస్తుంది.

తన మేజికల్ సీన్స్ తో ఫస్టాఫ్ ను అద్భుతంగా నడిపించిన కమ్ముల, సెకండాఫ్ లో మాత్రం అక్కడక్కడ తడబడ్డాడు. సెకెండాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ బోర్ ఫీలింగ్ ను మళ్లీ కవర్ చేశాడు. 2-3 నెగెటివ్స్ తప్ప సినిమాలో పెద్దగా ఎంచడానికి ఏమీ లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే ఇది శేఖర్ కమ్ముల సినిమా. ఈ సినిమా చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

రేటింగ్ : 3.5/5