Movie Review - F౩

Friday,May 27,2022 - 01:14 by Z_CLU

Movie Review – F3

నటీ నటులు : వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా , మెహ్రీన్ , సోనాల్ చౌహాన్ , సునీల్ , రాజేంద్ర ప్రసాద్ ,రఘు బాబు , అన్నపూర్ణమ్మ, ప్రగతి, ప్రదీప్, వెన్నెల కిషోర్
తదితరులు

ఛాయగ్రహణం : సాయి శ్రీరాం

ఆర్ట్ : AS ప్రకాష్

ఎడిటింగ్ : తమ్మిరాజు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : శిరీష్

రచన -దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిడివి : 148 నిమిషాలు

విడుదల తేది : 27 మే 2022

వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఫ్రాంచైజీ ‘F3’ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. F2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి ఫ్రాంచైజ్ గా వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి అనిల్ రావిపూడి అండ్ టీం ఈ ఫన్ ఎంటర్టైన్ తో మెప్పించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

f3 movie
కథ :

మధ్య తరగతి ఇబ్బందులతో సతమతమయ్యే వెంకీ (వెంకటేష్) వెంకీ షార్ట్ కట్ సర్వీసెస్ నడుపుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తుంటాడు. మరో వైపు మంగ టిఫిన్ సెంటర్ నడిపే హారికా (తమన్నా) , హనీ (మెహ్రీన్) ఫ్యామిలీ చేతిలో ఘోరంగా మోసపోయి లక్షలు పోగొట్టుకొని వారి నుండి డబ్బు రాబట్టాలని చూస్తుంటాడు వెంకీ. అనాధగా పెరిగిన వరుణ్ (వరుణ్ తేజ్) చిన్న చిన్న మోసాలు చేస్తూ ఏదైనా పెద్ద జాక్ పాట్ కొట్టి ఈజీగా డబ్బు వచ్చే ప్లాన్ కోసం చూస్తుంటాడు.అందులో భాగంగా హనీ ట్రాప్ లో పడి మోస పోతాడు.

ఇక వెంకీ వరుణ్ లను మోసం చేసిన హారికా , హనీ ఫ్యామిలీ టార్గెట్ కూడా డబ్బే. ఇలా డబ్బే టార్గెట్ గా మోసం చేయడానికి పాల్పడే వెంకీ , వరుణ్ , హారిక , హనీ లకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ ప్రసాద్ తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. మరి ఆనంద్ ప్రసాద్ కొడుకుగా వెళ్లి ఆయన ఆస్తిని అప్పనంగా కొట్టేసేందుకు వీరందరూ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫైనల్ గా డబ్బే ప్రదానంగా భావించే వీరికి ఎలాంటి ట్విస్ట్ ఎదురైంది ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

వెంకటేష్ కామెడి టైమింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎఫ్ కంటే ఇందులో ఇంకాస్త ఎనర్జిటిక్ గా కనిపించాడు. తన కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా నవ్వించాడు. ముఖ్యంగా రే చీకటితో వచ్చే సీన్స్ లో వెంకటేష్ నటన నవ్విస్తుంది. ఎక్కువ భాగం తనే భుజాలపై మోశాడు. ఇక వెంకీ తర్వాత వరుణ్ కూడా తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. నత్తి ఉన్న కుర్రాడిగా ఎంటర్టైన్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో వరుణ్ కామెడీ వర్కౌట్ అయింది. సునీల్ కామెడీ టైమింగ్ వరుణ్ కేరెక్టర్ ని వర్కౌట్ అయ్యేలా చేసింది. సునీల్ ఒకప్పటి కమెడియన్ గా కనిపిస్తూ అలరించాడు. నిజాయితిగల పోలీస్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మెప్పించాడు. పోలీస్ స్టేషన్ లో వచ్చే సీన్స్ బాగా పేలాయి. స్పెషల్ సాంగ్ లో హాట్ స్టెప్స్ తో పూజ హెగ్డే ఎట్రాక్ట్ చేసింది.

తమన్నా , మెహ్రీన్ ఇద్దరికీ కథలో మళ్ళీ కీలక పాత్రలు దొరకడంతో మంచి నటన కనబరిచారు. మొదటి భాగంలో మెహ్రీన్ , రెండో భాగంలో తమన్నా కేరెక్టర్స్ హైలైట్
గా నిలిచాయి. సోనాల్ చౌహాన్ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రగతి రియాక్షన్ కామెడీ నవ్వించింది. అలాగే అన్నపూర్ణమ్మ , వై విజయ రెండు మూడు సన్నివేశాల్లో నవ్వించారు. రఘు బాబు కామెడీ కేరెక్టర్ తో మరోసారి అలరించాడు. సినిమా అంతా “అంతేగా అంతేగా” అంటూ ఉండే ప్రదీప్ కి క్లైమాక్స్ లో మంచి ఎలివేషన్ సీన్ లభించడంతో హిలేరియస్ గా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో మోర్చపోయే సీన్ లో ఆలి , సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను చక్కిలి గింతలు పెట్టి నవ్వించింది. సవతి తల్లి అంటూ వెంకీ ని సాధిస్తూ ఉండే పాత్రలో తులసి , తండ్రి పాత్రలో గోపరాజు బాగా నటించారు. రంగురాళ్ళ కామెడీతో సత్య తన టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. సంపత్ రాజ్ ,శ్రీనివాస్ రెడ్డి మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఎఫ్ ౩ ఫ్రాంచైజీ కి సంబంధించి రిలీజ్ కి ముందే తన సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు ప్లస్ అయ్యాడు. ‘లబ్ డబ్ లబ్ డబ్’ , ‘వూ ఆ అహ అహ’ , ‘అధ్యక్షా లైఫ్ అంటే ఇలా ఉండాలా’ సాంగ్స్ తో మెప్పించాడు. అలాగే డబ్బు గురించి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా బాగుంది. సీన్స్ కి తగ్గట్టుగా నేపథ్య సంగీతం అందించి సినిమాకు బిగ్ సపోర్ట్ అయ్యాడు. సాయి శ్రీ రాం సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని ప్రతిభ కనిపించింది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్కువ డ్రాగ్ లేకుండా సీన్స్ కట్ చేసి తన పనితనం చూపించారు. ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ బాగుంది. ఎప్పటిలానే యాక్టర్స్ నుండి బెస్ట్ రాబట్టుకున్నాడు. అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో అనిల్ రైటింగ్ , ఆలోచనలు ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా క్వాలిటీ పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

కామెడీ సినిమాలకు డీల్ చేయడం ఆశా మాషీ కాదు. ఈ జోనర్ లో చాలా మంది దర్శకులు సినిమా చేసినా హిట్లు కొట్టిన వాళ్ళను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఈ జోనర్ లో భారీ సక్సెస్ లు అందుకున్న వారిలో ముఖ్యంగా జంధ్యాల , ఈవీవీ గుర్తొస్తారు. వారి కామెడీ సినిమాలను ఆదర్శంగా తీసుకొని తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ మెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని నేటి హాస్య దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అనీల్ రావిపూడి. తనలో ఉన్న ఎంటర్టైన్ మెంట్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని ‘ఎఫ్ 2’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా అందుకున్న సక్సెస్ తో మళ్ళీ ఇప్పుడు దానికి ఫ్రాంచైజీ తీసి మరోసారి తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి మరో మంచి కామెడీ సినిమాను అందించాడు.

‘ఎఫ్ 2’ లో భార్యల వల్ల భర్తలకు వచ్చే ఫ్రస్ట్రేషన్ ని చూపించి నవ్వించి హిట్టు కొట్టిన అనీల్ రావిపూడి ‘ఎఫ్ ౩’ లో అందరికీ కనెక్ట్ అయ్యే డబ్బు ఎలిమెంట్ తీసుకొని దాని చుట్టూ ఆహ్లాదకరమైన కామెడీతో స్క్రీన్ ప్లే అల్లి మరోసారి మెప్పించాడు. సినిమా ఆరంభంలోనే మురళి శర్మ కేరెక్టర్ ద్వారా డబ్బు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్తూ ఒక్కో కేరెక్టర్ ని కథలో ఎంట్రీ చేశాడు. ఇక ‘ఎఫ్ 2’ లో కనిపించిన పాత్రలే కావడంతో కేరెక్టర్స్ ఇంట్రడ్యూస్ కి ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్ళి విడతల వారిగా ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ మెస్మరైజ్ చేశాడు అనీల్.

మొదటి భాగంలో వెంకటేష్ ఇంట్రడ్యూస్ సీన్ , ఆ తర్వాత తులసి పాత్రతో వచ్చే సీన్ తో సినిమా ఎలా నవ్వించబోతుందో హింట్ ఇస్తూ సినిమాను మ,ముందుకు నడిపించాడు అనీల్ రావిపూడి. అలాగే వరుణ్ ఇంట్రడ్యూస్ సీన్ తర్వాత వచ్చే గుండు సుదర్శన్ కామెడీ తో నవ్వించాడు. ఆ తర్వాత వచ్చే వెంకీ రే చీకటి సన్నివేశాలు బాగా నవ్వించాయి. వెంకటేష్ , వరుణ్ తేజ్ ఇద్దరూ తమ నటనతో సినిమాను ఎంటర్టైనింగ్ గా నడిపించారు.  మొదటి భాగంలో ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఓ ట్రాక్ ని వాడుకొని దాని నుండి ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేసి మూర్చ కామెడీతో నవ్వించాడు అనీల్. అలాగే లబ్ డబ్ సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఈజీ మనీ కోసం ఆరాటపడే సన్నివేశాలతో నడిపించిన అనీల్ రావిపూడి రెండో భాగాన్ని ఒకే లొకేషన్ లో అన్ని కేరెక్టర్స్ ని పెట్టి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. ఆ సన్నివేశాలు ఈవీవీ ని గుర్తుచేసేలా ఉన్నాయి.  అన్ని కేరెక్టర్స్ ని పెట్టుకొని సెకండాఫ్ లో వాటితో మంచి ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ని ఇంకా హిలేరియస్ గా రాసుకున్నాడు. అనీల్ ఐడియాలు , ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఎలిమెంట్స్ సెకండాఫ్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వెంకీ సినిమాలను థియేటర్స్ లో మిస్ అయిన ఫ్యాన్స్ కి క్లైమాక్స్ లో నారప్ప గెటప్ తో ట్రీట్ ఇచ్చాడు. అలాగే రెండో బాగంలో స్టార్ హీరోలను వాడుకుంటూ డిజైన్ చేసిన ఎపిసోడ్ క్లిక్ అయింది. ఆ సీన్స్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేసుకొని సక్సెస్ అయ్యాడు. కామెడీ సినిమాలు పెద్దగా కథ అవసరం లేదు, అలాగే లాజిక్స్ కూడా పట్టించుకొనక్కర్లేదు. ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఇక ‘ఎఫ్ ౩’ తో అక్రమదారిలో మోసాలు చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే వారికి మంచి సందేశం కూడా ఇచ్చాడు. మురళి శర్మ కేరెక్టర్ తో క్లైమాక్స్ లో చెప్పించిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. కామెడీ సినిమాతో ఈ తరహా సందేశం ఇవ్వడం బాగుంది.

సెకండాఫ్ లో అన్ని కేరెక్టర్స్ ని వాడుకుంటూ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తూ ఈవీవీని గుర్తుచేశాడు అనీల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకొని తెరకెక్కిన ఈ ఫన్ ఫ్రాంచైజీ ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్వించి మెప్పిస్తుంది.

బాటం లైన్ : హిట్టు ఫ్రాంచైజీ… నవ్వులే నవ్వులు

రేటింగ్ : 3.25 /5

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics