'F2'మూవీ రివ్యూ 

Saturday,January 12,2019 - 01:51 by Z_CLU

నటీ నటులు : వెంకటేష్ , తమన్నా , వరుణ్ తేజ్, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్, ప్రగతి, వెన్నెల కిషోర్ తదితరులు

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

రచన -దర్శకత్వం : అనిల్ రావిపూడి

రెండేళ్ళ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి అనీల్ డైరెక్షన్ లో ‘F2’సినిమా చేసాడు విక్టరీ వెంకటేష్. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రిలీజయిన ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ అనిపించుకుందా..? సంక్రాంతి అల్లుళ్ళుగా వచ్చిన వెంకీ -వరుణ్ తేజ్ సంక్రాంతి విన్నర్స్ గా నిలిచారా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

ఎం.ఎల్.ఎ (రఘుబాబు) దగ్గర పీఏ గా వర్క్ చేస్తుంటాడు వెంకీ (వెంకటేష్). పెళ్ళికి రెడీ అయిన వెంకీకి మొగుడు పై పెత్తనం చేసే మనస్తత్వం ఉన్న హారిక( తమన్నా)తో పెళ్లవుతుంది. మొదటి ఆరు నెలలు ఎంతో సంతోషంగా గడిపిన వీరి దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు. అలకలు మొదలవుతాయి. ఈ క్రమంలో హాస్టల్ నుండి వచ్చి అక్క ఇంట్లోనే తిష్ట వేస్తుంది హారిక చెల్లి హనీ(మెహ్రీన్). ఇక అటు పెళ్ళాం , ఇటు మరదలు పెట్టె టార్చర్ తో ఇబ్బంది పడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు వెంకీ.. అదే టైంలో హారికా ఫ్యామిలీ కూడా వెంకీ పై విరుచుకుపడటం, దాంతో ఫ్యామిలీ  టార్చర్ ని భరించలేక వెంకీ ఆసనం వేసుకుంటూ.. పెళ్ళాంతో కాంప్రమైజ్ అవ్వలేక నానా తంటాలు పడుతుండటం జరుగుతుంది.

తమన్నా చెల్లెలు హాని (మెహరీన్) వరుణ్ (వరుణ్ తేజ్ ) లవ్ లో ఉంటారు, వారిద్దరి లవ్ స్టోరీ ని వెంకీ… హారిక ఫ్యామిలీ ముందు పెట్టె క్రమంలో అనుకోకుండా వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవుతుంది. ఇక అప్పటి నుంచి తమన్నా ఫ్యామిలీ దెబ్బకి వరుణ్ కూడా  వెంకీ లాగే  భార్య బాధితుడిగా మారతాడు.  కాబోయే తోడల్లుళ్ళు కలిసి అక్కా చెల్లిళ్ళ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటారు. సరిగ్గా హనీతో పెళ్ళికి ముందు ఇద్దరూ కలిసి యూరప్ కి జంప్ అవుతారు.

అలా యూరప్ వెళ్ళిన వెంకీ -వరుణ్ లకి ఎదురైనా సంఘటనలేంటి…? చివరకి ఈ రెండు జంటలు వారి మధ్య  ఈగో ప్రాబ్లెమ్స్ ను ఎలా పరిష్కరించుకున్నారు ? ఫైనల్ గా వెంకీ -వరుణ్ లు పెళ్ళాలతో మళ్ళీ వారి జీవితాన్ని ఎలా హాయిగా కొనసాగించారు.. అనేది మిగతా కథ.

నటీనటులు :

కామెడీ టైమింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ టైమింగ్ తో మంచి కామెడీ పండించాడు. ముఖ్యంగా ఈ సినిమా వెంకీ లేకుండా ఊహించుకోలేం. ప్రతీ కామెడీ సీన్ లో వెంకీ వందకి వంద మార్కులు అందుకున్నాడు. వెంకీ కామెడీ టైమింగ్ ముందు వరుణ్  తెలిపోయినా పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణా యాసతో మంచి కామెడీ క్రియేట్ చేసి క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ అనిపించాడు వరుణ్. ఇక మొదటిభాగం లో జస్ట్ పరవలేదనిపించినా రెండో భాగంలో మాత్రం హరి తేజతో కలిసి బాగా నవ్వించాడు రాజేంద్ర ప్రసాద్. ప్రకాష్ రాజ్ కొత్త క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ లో తన నటనతో అలరించాడు.

అన్నపూర్ణమ్మ, వై విజయ పోటీ పడి మరీ నవ్వించాడు. ప్రగతి బెస్ట్ క్యారెక్టర్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్ కామెడీ పండలేదు, కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త నవ్వించాడు.  సుబ్బరాజు, సత్యం రాజేష్, మిర్చి బాబ్జీ మిగతా నటీ నటులందరూ తమ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేసారు.

సాంకేతికవర్గం పనితీరు : 

సినిమాకు పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు దేవి. ఎంతో ఫన్, రెచ్చి పోతాం బ్రదర్ , గిర్రా గిర్రా సాంగ్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. తన కెమెరా వర్క్ తో సినిమాకు క్లాస్ టచ్ ఇచ్చి హైలైట్ గా నిలిచాడు సమీర్. ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్ గా కట్ చేసారు. కాసర్ల శ్యాం అందించిన సాహిత్యంతో పాటు శ్రీమణి, బాలాజీ సాహిత్యం కూడా బాగుంది.

సినిమాలో వచ్చే కొన్ని కామెడీ పంచ్  డైలాగ్స్ బాగా పేలాయి. అనిల్ కాన్సెప్ట్ , డైరెక్షన్ అందరినీ ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

మొగుడు- పెళ్ళాం మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, వాటి నుండి జెనరేట్ అయ్యే ఫన్ ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తుంది. భార్య భర్తల మధ్య వచ్చే కామెడీ ని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే హిట్టు కొట్టడం చాలా ఈజీ కూడా… అప్పట్లో ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ‘ క్షేమంగా వెళ్లి లాభంగా రండి’,’పెళ్ళాం ఊరెళితే’ లాంటి హిట్ సినిమాలే దీనికి రీజన్. అయితే ఈ కాన్సెప్ట్ ని మరోసారి పర్ఫెక్ట్ రాసుకొని దానికి వెంకీ లాంటి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరో వరుణ్ లాంటి మరో యంగ్ హీరోని సెలెక్ట్ చేసుకొని ఈ సంక్రాంతి బరిలో నిలిచాడు అనీల్ రావిపూడి.

ఇప్పటి రోజుల్లో ఓ సినిమాతో  ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించడం కష్టం.. జంధ్యాల , ఈ.వి.వి తర్వాత చాలా మంది దర్శకులు ఈ జోనర్ ట్రై చేసినా కొందరే హిట్టు కొట్టగలిగారు.  ఈ జెనరేషన్ లో ఎలాంటి కంపేరిజన్స్ లేకుండా రెగ్యులర్ జోక్స్ వాడకుండా నవ్వించడం మరీ కష్టం.  ఆ ఛాలెంజ్ ని దర్శకుడిగా బాగా డీల్ చేసాడు అనీల్ రావిపూడి. తన మొదటి సినిమా నుండే కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అనీల్ ఈసారి కమర్షియల్ హంగుల జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ పెట్టి కడుపుబ్బా నవ్వించాడు. చాలా సందర్భాల్లో జంధ్యాల , ఈ.వి.వి లను గుర్తుచేసాడు అనీల్. ఆల్మోస్ట్ అందరు కమెడియన్లను బాగా వాడుకొన్నాడు. ముందు నుండి భార్య అంటే భయపెట్టేలా చూపించిన అనీల్ క్లైమాక్స్ లో మాత్రం భార్య గొప్పతనాన్ని ఎమోషనల్ గా చెప్పి ఆకట్టుకున్నాడు.

సినిమాలో వెంకీ స్థానంలో మరో హీరోని ఊహించుకోలేం.. తన కామెడీ టైమింగ్ తో భుజాలపై సినిమాను నడిపించాడు వెంకీ. సినిమా ప్రారంభంలోనే ‘నువ్వు నాకు నచ్చావ్’ , ‘మల్లీశ్వరి’ సినిమాల్లో వెంకీ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. అప్పటి వెంకీ ని మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. త్రివిక్రమ్ తర్వాత వెంకటేష్ కి ఈ రేంజ్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఇచ్చి  బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్న రైటర్ కం డైరెక్టర్ అనీల్.  కామెడీ పండించే మంచి క్యారెక్టర్ దొరకాలే కానీ దుమ్ము దులిపెస్తానని మరోసారి నిరూపించాడు వెంకటేష్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే పెళ్లి చూపుల సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకూ వెంకీ కామెడీ కి నవ్వని వారుండరు.

బోరబండ లోకల్ కుర్రాడిగా వరుణ్ బాగానే చేసాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. కాకపోతే వెంకీ కామెడీ టైమింగ్ ముందు మాత్రం నిలవలేకపోయాడు. ఇక మొదటి భాగానికే ప్రేక్షకులకు నవ్వి నవ్వి ఇంక చాలు మా డబ్బుకి న్యాయం జరిగిందనే పరిస్థితి కొస్తారు. ఇక రెండో భాగం, మొదటి భాగం రేంజ్ లో హిలేరియస్ గా లేకపోయినా తన స్క్రీన్ ప్లే తో అక్కడక్కడా  కామెడీ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేసాడు అనీల్. ఫైనల్ గా సంక్రాంతి అల్లుళ్ళు భలే నవ్వించారు.

బాట్టం లైన్ : నో ఫ్రస్ట్రేషన్… ఓన్లీ ఫన్

రేటింగ్ : 3 .25 /5