ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ

Wednesday,January 15,2020 - 01:59 by Z_CLU

న‌టీన‌టులు: క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌
నిర్మాతలు ‌: ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
నిడివి: 144 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: జనవరి 15, 2020

శతమానంభవతి, శ్రీనివాసకల్యాణం సినిమాలతో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిపించుకున్న సతీష్ వేగేశ్న, ఈసారి కల్యాణ్ రామ్ ను “మంచివాడి”గా చూపించాడు. మరి ప్రేక్షకులతో కూడా ఈ సినిమా “ఎంత మంచివాడవురా” అనిపించుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ

ఫంక్షన్లకు కుర్చీలు, టేబుళ్ల సప్లయ్ చేస్తుంటారు. పండగలకు పిండివంటలు కూడా సప్లయ్ చేసేవాళ్లున్నారు. మరి అలాంటప్పుడు అవసరం ఉన్నవాళ్లకు ఎమోషన్స్ ఎందుకు సప్లయ్ చేయకూడదు. ఆ ఆలోచనతోనే ఆల్ ఈజ్ వెల్ అనే ఎమోషనల్ సప్లయర్స్ కంపెనీని పెడతాడు బాలు (కల్యాణ్ రామ్). చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన బాబు.. అన్న అవసరం ఉన్న అమ్మాయికి అన్నయ్యగా, మనవడు అవసరం ఉన్న తాతకు మనవడిగా మారిపోతుంటాడు.

చిన్నప్పట్నుంచి బాలును చూస్తూ పెరిగిన నందు (మెహ్రీన్) కూడా ఈ విషయంలో తన ప్రియుడికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఈ క్రమంలో కొడుకును కోల్పోయి చావుకు దగ్గరైన రామశర్మ (తనికెళ్ల భరణి) అనే వ్యక్తికి కొడుకుగా వెళ్తాడు బాలు. రామశర్మ కోసం తన పేరును ఆచార్యగా మార్చుకుంటాడు. అయితే అదే ఊరిలో ఇసుక ర్యాంప్ నడిపించే గంగరాజు (రాజీవ్ కనకాల)తో రామశర్మకు పడదు. నిజానికి గంగరాజు వల్లే రామశర్మ తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరోసారి రామశర్మ జీవితంలోకి ఎంటరైన గంగరాజును ఆచార్య అడ్డుకుంటాడు. అప్పుడు ఆచార్య ఏం చేశాడు. బాలు ఆదుకుంటున్న మిగతా కుటుంబాల పరిస్థితేంటి అనేది మిగతా కథ

నటీనటుల పనితీరు

పూర్తి ఎమోషన్స్ తో నిండిన ఈ సినిమాకు కచ్చితంగా ఓ సీనియర్ హీరో కావాల్సిందే. ఈ విషయంలో హీరో సెలక్షన్ పెర్ ఫెక్ట్ గా ఉంది. కల్యాణ్ రామ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. చాలా సినిమాల్లో అతడిలో యాక్షన్ మాత్రమే చూశాం, ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఎమోషన్స్ కూడా పండించాడు. తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా, ప్రియుడిగా… ఇలా ఒకే సినిమాలో ఎన్నో పాత్రలు పోషించే అవకాశం కల్యాణ్ రామ్ కు వచ్చింది. నందు పాత్రలో మెహ్రీన్ ఆకట్టుకుంది. అందంగా కనిపించడమే కాకుండా, 2-3 సన్నివేశాల్లో ఆమెకు నటించే అవకాశం కూడా వచ్చింది.

మనసులో ఉన్నది తనకు తెలియకుండానే బయటకు చెప్పేసే పాత్రలో నరేష్, తన స్టయిల్ ఆఫ్ కామెడీతో వెన్నెల కిషోర్ ఈ సినిమాలో వినోదాన్ని పండించే బాధ్యతను తీసుకున్నారు. విలన్ పాత్రలో రాజీవ్ కనకాల, కల్యాణ్ రామ్ ఫ్రెండ్స్ పాత్రల్లో ప్రవీణ్ తమ పాత్రల మేరకు నటించారు. సుహాసిని, శరత్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించినట్టు అనిపించినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు

రాజ్ తోట సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. జాతరో జాతర సాంగ్ తో పాటు మెలొడీ సాంగ్ తో ఆకట్టుకున్నాడు. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకుడిగా సతీష్ వేగేశ్న తన మార్క్ చూపించడానికి ప్రయత్నించాడు. అయితే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ లోపాలున్నాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ కు మార్పులు చేయడంలో సతీష్ వేగేశ్న పూర్తిగా సక్సెస్ అయ్యాడు. తెలుగు నేటివిటీ, కల్యాణ్ రామ్ ఇమేజ్ కు తగ్గట్టు వేగేశ్న చేసిన ఎరేంజ్ మెంట్స్ మెప్పిస్తాయి.

జీ సినిమాలు రివ్యూ

ఓ గుజరాతీ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఎంత మంచివాడవురా. ఎమోషనల్ సప్లయర్స్ అనే కాన్సెప్ట్ ను ఒరిజినల్ సినిమాలో ఆర్టిస్టిక్ గా చూపించారు. దానికే కమర్షియల్ టచ్ ఇచ్చాడు సతీష్ వేగేశ్న. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త కాన్సెప్ట్. అయితే దాన్ని ఎంగేజింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. దీనికితోడు స్లో గా సాగే నెరేషన్, రొటీన్ సన్నివేశాలు బోర్ అనిపిస్తాయి.

సినిమాలో రకరకాల పేర్లతో ఒకే వ్యక్తి, వివిధ కుటుంబాలతో కలిసిపోవడం అనే ఎపిసోడ్ ను కాస్త సస్పెన్స్ యాంగిల్ లో చూపించొచ్చు. హీరో ఎందుకిలా చేస్తున్నాడనే విషయాన్ని కాస్త ఎక్కువసేపు క్యూరియాసిటీ కలిగించేలా చూపిస్తే బాగుండేది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ విషయాన్ని చెప్పేసి, అక్కడ్నుంచి ఎమోషనల్ సప్లయర్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్లిపోవడంతో సినిమా ఫ్లాట్ గా మారింది. దీనికితోడు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు.

ఎమోషన్స్ కోరుకునే వాళ్లకు రిలేషన్స్ అందించే హీరో.. ఏదో ఒక కుటుంబంలో సమస్య వస్తుంది కాబట్టి దాని కోసం పోరాడతాడనే విషయం సినిమా స్టార్టింగ్ లోనే అందరికీ అర్థమైపోయింది. ఆ సమస్యను తనికెళ్ల భరణి పాత్రతో సృష్టించిన దర్శకుడు.. పోనీ ఆ ప్రాసెస్ నైనా భయంకరంగా, భయపెట్టేలా చూపిస్తే బాగుండేది. ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా అక్కడికక్కడే విలన్ ను జైలుకు పంపించడంతో సినిమాపై సగం ఆసక్తి తగ్గిపోతుంది. క్లైమాక్స్ లో మళ్లీ ఓ ఫైట్ కావాలి కాబట్టి, విలన్ ను ఇనిస్టెంట్ గా జైలు నుంచి తీసుకొచ్చినట్టు అనిపించింది. వీటికి తోడు టెక్నికల్ గా కూడా సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో అనిపించదు.

నేటివిటీకి తగ్గట్టు వేగేశ్న చేసిన మార్పుచేర్పులు బాగున్నాయి కానీ వాటిని ఓ క్రమంలో చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఎపిసోడ్స్ వారీగా చూసుకుంటే బాగుంది కానీ, సినిమాలో ఫ్లో మిస్సయింది. ఈ మైనస్ పాయింట్స్ పక్కనపెడితే.. సినిమాలో మంచి ఎమోషనల్ సన్నివేశాలున్నాయి. వీటికి సతీష్ వేగేశ్న రాసుకున్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. కల్యాణ్ రామ్-తనికెళ్ల భరణి మధ్య సన్నివేశాలు చాలా బాగున్నాయి. జాతర ఎపిసోడ్, స్పెషల్ సాంగ్ బాగా వచ్చాయి. సెకెండాఫ్ లో సుహాసిని-శరత్ బాబు ఎపిసోడ్ కూడా బాగుంది. అక్కడొచ్చిన సాంగ్ మరోసారి సినిమా ఫ్లోకు అడ్డుపడింది.

ఓవరాల్ గా ఎంత మంచివాడవురా సినిమాను కొన్ని మంచి ఎమోషనల్, ఫ్యామిలీ సీన్స్, కల్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ కామెడీ కోసం చూడొచ్చు.

రేటింగ్2.5/5