'ఈ నగరానికి ఏమైంది' రివ్యూ

Friday,June 29,2018 - 03:09 by Z_CLU

నటీనటులు : విశ్వక్ సేన్, సుశాంత్, వెంకట్ కకుమను, అబినవ్ గోమతం, అనీష అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు

సినిమాటోగ్రఫి : నికేత్ బొమ్మిరెడ్డి

మ్యూజిక్ : వివేక్ సాగర్

నిర్మాత : డి.సురేష్ బాబు

రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్

నిడివి : 140 నిమిషాలు

సెన్సార్ : UA

విడుదల తేది : 29 జూన్ 2018

 

పెళ్లిచూపులతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తన సెకెండ్ ప్రాజెక్టుతో ఏకంగా సురేష్ బాబునే ఒప్పించాడు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది లాంటి మరో యూత్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? పెళ్లిచూపులు రేంజ్ లో సైలెంట్ గా సునామీ సృష్టిస్తుందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

కార్తిక్ (సుశాంత్ ), వివేక్ (విశ్వ‌క్‌సేన్ నాయుడు), ఉపేంద్ర (వెంక‌టేష్ కాక‌మాను), కౌశిక్ (అభిన‌వ్ గోమ‌తం).. మంచి స్నేహితులు. కాకపోతే కార్తీక్, వివేక్ బాల్య మిత్రులు. కాలేజి చదివే రోజుల్లో అనుకోకుండా ఓ అగ్ర దర్శకుడిని కలిసాక ఓ షార్ట్ ఫిలిం తీయాలని డిసైడ్ అవుతారు. వివేక్ స్టోరీ – డైరెక్ష‌న్‌, కౌశిక్ యాక్టింగ్‌, కార్తిక్ కెమెరా, ఉప్పు ఎడిటింగ్ ఇలా ఒక్కో విభాగం ఎంచుకుని కలిసి కట్టుగా ఓ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్‌గా తను మొదటి చూపులునే ప్రేమించిన శిల్ప (సిమ్రాన్ చౌద‌రి)ను ఎంచుకున్న వివేక్.. ఆ షార్ట్ ఫిలిం తీసే క్రమంలో ఆమెతో ప్రేమ‌లో ప‌డతాడు.

అయితే త‌న యాటిట్యూడ్‌ వ‌ల్ల వివేక్ ప్రేమకి బ్రేకప్ చెప్పేసి తనకు దూరంగా వెళ్ళిపోతుంది శిల్ప. అలా లవ్ బ్రేకప్ తో ఫుల్ గా డిస్టర్బ్ అయిన వివేక్ మందుకు బానిస అవుతాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో.. ఈ గ్యాంగ్‌కు షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి మంచి ఆఫ‌ర్ వ‌స్తుంది. అయితే.. ల‌వ్ స్టోరీస్ మాత్రం చేయ‌నంటూ మొండిప‌ట్టు ప‌డ‌తాడు వివేక్. కారులో ప్రయాణం చేస్తూ.. ఇదే విష‌యంపై న‌లుగురు వాదించుకుంటుండగా అనుకోకుండా ఓ యాక్సిడెంట్ అవుతుంది. క‌ట్ చేస్తే.. ఆ యాక్సిడెంట్ జరిగిన నాలుగేళ్ళ త‌రువాత ఈ న‌లుగురు కార్తిక్ బ్యాచ్‌ల‌ర్ పార్టీ కోసం క‌లుస్తారు. అలా కలిసిన వీరు అనుకోకుండా గోవాకి ప్రయానమవుతారు.. అలా గోవా వెళ్ళి డబ్బు కోసం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ నలుగురు ఎలాంటి పరిస్థితుల్లో గోవా వెళ్ళారు.. చివరికి షార్ట్ ఫిలిం చేసి తమకి అవసరమైన డబ్బు సంపాదించారా..లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

గతంలో ‘వెళ్ళిపోమాకే’ అనే సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఒక రకంగా సవాల్ లాంటిదే. వివేక్ అనే క్యారెక్టర్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు విశ్వక్. ఇక విశ్వక్ తర్వాత చెప్పుకోవాల్సింది సుశాంత్ గురించే సినిమా ప్రారంభం నుండి తన స్లాంగ్ డైలాగ్ డెలివరీ తో బాగా ఇంప్రెస్ చేసాడు. తన కామెడి టైమింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు అభినవ్ గోమతం. ఇన్నేళ్ళు నటుడిగా ఓ అవకాశం కోసం ఎదురుచూసిన అభినవ్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ ముగ్గురితో పాటు వెంకట్ కూడా తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. నిజ జీవితంలో ఎడిటర్ లు ఎలా ప్రవర్తిస్తారో… వారు పనిచేసే విధానం ఎలా ఉంటుందో తన పెర్ఫార్మెన్స్ తో చూపించి అలరించాడు. క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో సిమ్రాన్ చౌదరి జస్ట్ పరవాలేదనిపించుకుంది. అనిషా అంబ్రోస్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. గీతా తరుణ్ గారితో పాటు మిగతా నటీనటులంతా తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం పనితీరు :

ఓ సినిమాకు వర్త్ ఉన్న టెక్నీషియన్స్ కలిసి పనిచేస్తే కచ్చితంగా మంచి అవుట్ పుట్ వస్తుంది. ఈ సినిమాకు అది బాగా కుదిరింది… పెద్దగా అనుభవం లేకపోయినా ప్రతీ ఒక్కరూ తమ వర్క్ లో బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సందర్భాలలో వివేక్ అందించిన బాగ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేసింది. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. తన కెమెరా వర్క్ తో చాలా సందర్భాల్లో మెస్మరైజ్ చేసాడు. రవితేజ ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. సంజయ్ దాస్, వరుణ్ వేణుగోపాల్ సౌండ్ డిజైనింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాకు తగ్గట్టుగా లతా తరుణ్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ స్క్రీన్ ప్లే – డైరెక్షన్ – డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

నీ గ్యాంగ్ తో రా చూసుకుందాం… అంటూ నిన్నటి వరకూ ఓ తెగ ఊరించిన యూనిట్ ఆ టాగ్ ఎందుకో వాడుకున్నారో సినిమా చూసాక బాగా అర్థం అవుతుంది. మొదటి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాను మాత్రం కేవలం యూత్ ను దృష్టిలో పెట్టుకొని తీశాడు. ఒక కాన్సెప్ట్ అనుకోని అందులో క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సినిమాను ఎలివేట్ చేసే టెక్నీషియన్స్ ను తీసుకొని అక్కడే మొదటి సక్సెస్ అందుకున్నాడు.

నలుగురు స్నేహితులు, వారి మధ్య వచ్చే కామెడీతో సినిమాను తీశామంటూ చెప్పుకొచ్చిన తరుణ్ భాస్కర్ మొత్తానికి తన మార్క్ కామెడీతో బాగానే అలరించాడు..కాలేజీలో బాగా దగ్గరైన ఓ గ్యాంగ్…. వారు కలుసుకున్నప్పుడు వారి ప్రవర్తన… వారి మధ్య వచ్చే కామెడీను హైలైట్ చేస్తూ తన కోణంలో చాలా రియాలిస్టిక్ గా సినిమాను ప్రజెంట్ చేశాడు. కాకపోతే కామెడీతో పాటు, లవ్ ట్రాక్, ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్స్ ను కూడా ఇంకాస్త ఎలివేట్ చేసుంటే బాగుండేది.

పూర్తిగా రియలిస్టిక్ గా తీయాలనే ఉద్దేశంతో ఈ రెండు అంశాలతో పాటు క్లయిమాక్స్ ను కూడా అంతే రియల్ గా చూపించాడు తరుణ్ భాస్కర్. నిజానికి సినిమాటిక్ ఫ్రీడమ్ వాడుకొని, క్లయిమాక్స్ లో వాళ్లు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో గెలిచినట్టు, జీవితంలో సక్సెస్ అయినట్టు చూపించొచ్చు. సగటు ప్రేక్షకుడు కూడా అదే కోరుకుంటాడు. కానీ ఇక్కడ కూడా సినిమాను రియలిస్టిక్ గానే ముగించడం కాస్త ఇబ్బందిపెట్టే అంశం.

‘హ్యాంగోవర్’, ‘జిందగీ నా మిలేగి దోబారా’, ‘3 ఇడియట్స్’ సినిమాల ఫ్లేవర్ లోనే ఇది ఉంటుందని ముందు నుంచి చెప్పుకొచ్చిన దర్శకుడు కథ కంటే, ఫ్రెండ్స్ మధ్య సంఘటనలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కథ పెద్దగా లేకపోయినా తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ స్నేహితులతో కలిసి తన షార్ట్ ఫిలిమ్స్ కోసం కష్టపడిన అనుభవాల్ని జోడించి కేవలం కామెడీని నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు  , సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ , అభినవ్ గోమతం మధ్య వచ్చే కామెడి సీన్ బాగా పేలింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ కామెడీ కి కొదవే లేకుండా ఎంటర్ టైనింగ్ వేలో సినిమాను నడిపించి తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో అలరించాడు తరుణ్ భాస్కర్. కాకపోతే స్నేహితుల మధ్య బలమైన ఎమోషన్ సీన్స్ లేకపోవడం, విశ్వక్ సేన్-సిమ్రాన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడం సరైన కథ లేకపోవడం సినిమాకు మైనస్. యూత్ కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది.

తరుణ్ తొలి సినిమా పెళ్లిచూపులుతో పోలిస్తే ఇది టెక్నికల్ గా చాలా బెటర్ మూవీ. కానీ కంటెంట్ పరంగా చూస్తే పెళ్లిచూపులే చాలా బెటర్. పెళ్లిచూపులు సినిమా అన్ని వర్గాలకు కనెక్ట్ అయింది. ఈ సినిమా మాత్రం అలా కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం. తరుణ్ స్టార్టింగ్ నుంచే చెబుతున్నట్టు “నీ గ్యాంగ్ తో రా థియేటర్లో చూస్కుందాం” అనే ట్యాగ్ లైన్ కు ఈ సినిమా పర్ ఫెక్ట్. స్నేహితులతో సరదాగా గడిపిన సందర్భాలు గుర్తుచేసుకుంటూ హాయిగా నవ్వుకోవచ్చు.

 

ప్లస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే – డైరెక్షన్

క్యారెక్టర్స్ డిజైన్

కామెడీ

బాగ్రౌండ్ స్కోర్

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :

కథను సాగదీసినట్టు అనిపించడం

సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

లవ్ ట్రాక్

క్లైమాక్స్

రేటింగ్ : 3/5