దొరసాని మూవీ రివ్యూ

Friday,July 12,2019 - 03:40 by Z_CLU

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కన్నడ కిశోర్, వినయ్ వర్మ, శరణ్య తదితరులు..
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
సమర్పణ : సురేష్ బాబు
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
నిడివి : 138 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్ : 12 జులై, 2019

ఓవైపు విజయ్ దేవరకొండ తమ్ముడు.. మరోవైపు హీరో రాజశేఖర్ చిన్న కూతురు.. వీళ్లిద్దరూ కలిసి చేశారు కాబట్టే దొరసాని సినిమా మార్కెట్లో హాట్ కేక్ గా మారింది. మరి సినిమా పరిస్థితేంటి? ఆనంద్ దేవరకొండకు, శివాత్మికకు దొరసాని కలిసొచ్చిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

80వ దశకం నాటి ఓ తెలంగాణ పల్లె జయగిరి. అందులో ఓ దొర (వినయ్ వర్మ). ఆ ఊరు జనాల భూములన్నీ అతడి సొంతం. ఏళ్లకు ఏళ్లు ప్రజలంతా అతడి కింద వెట్టిచాకిరి చేయాల్సిందే. అలా కూలిపని చేసే ఓ కుటుంబంలో రాజు (ఆనంద్ దేవరకొండ) ఉంటాడు. రాజు తల్లిదండ్రులు ఇళ్లకు సున్నాలు వేసి జీవితం గడుపుకుంటారు. కానీ రాజును మాత్రం కష్టపడి పట్నంలో చదివిస్తుంటారు.

శెలవుల కోసం జయగిరి వచ్చిన రాజు.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దొరసాని (శివాత్మిక)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. దొరసాని కోసం పరితపిస్తాడు. గడీ వెనక్కి వెళ్లి దొరసానిని దూరం నుంచి ప్రేమిస్తుంటాడు. రాజు కవితలు చదివిన దొరసాని కూడా అతడ్ని మూగగా ప్రేమిస్తుంది. ఓవైపు పీపుల్స్ వార్ ఉద్యమం జోరుగా సాగుతుంటే, మరోవైపు రాజు-దొరసాని అంతే జోరుగా ప్రేమించుకుంటారు. ఒక దశలో గడీ దాటి బయటకొచ్చి రాజును కలుస్తుంది దొరసాని. విషయం దొరకు తెలుస్తుంది. అప్పుడు దొర ఎలా నిర్ణయం తీసుకున్నాడు? చివరికి రాజు-దొరసాని ఒక్కటయ్యారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు

ప్రేమకథలకు కావాల్సింది హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ. తెరపై ఆ కెమిస్ట్రీ వర్కవుట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. అయితే ఇలాంటి కథకు ఇద్దరు కొత్త హీరోహీరోయిన్లను తీసుకోవడం సాహసమే. అలాంటి సక్సెస్ ఫుల్ సాహసమే దొరసానిలో జరిగింది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఈ సినిమాకు ఫ్రెష్ నెస్ తీసుకురావడమే కాకుండా.. తమ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో ప్లస్ అయ్యారు. జైల్ సీన్ లో ఆనంద్ దేవరకొండ న్యూడ్ గా కూడా కనిపించి మార్కులు కొట్టేశాడు. ఇటు ఆనంద్ దేవరకొండకు, అటు శివాత్మిక ఇద్దరికీ ఈ సినిమా మంచి లాంఛింగ్ ప్రాజెక్టు.

హీరోహీరోయిన్లతో పాటు అంతా కొత్త నటీనటులతో తెరకెక్కింది దొరసాని. ఎవరి పాత్రను వాళ్లు చక్కగా పోషించారు. సిద్ధడు పాత్ర పోషించిన అనురాగ్ చౌదరి, దొర పాత్రలో కనిపించిన వినయ్ వర్మ, శీను పాత్ర పోషించిన సన్నీ, వసంతలా అనుషా బాగా నటించారు. ఇక ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ పాత్రలు పోషించిన వాళ్లంతా బాగా నటించారు. శంకర్ అన్న పాత్ర పోషించిన కన్నడ కిషోర్, దాసి పాత్ర పోషించిన శరణ్యను మాత్రమే ఆడియన్స్ గుర్తుపడతారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ తోనే స్టార్ట్ చేయాలి. 80ల నాటి పల్లె వాతావరణం, ఓ ఫ్రెష్ నెస్ ను అద్భుతంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి. ఇతడికి ఆర్ట్ డైరక్టర్ జేకే మూర్తి నుంచి పూర్తి సహకారం లభించింది. ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రశాంత్ విహారి మ్యూజిక్ మరో ఎత్తు. ప్రేమకథలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ప్రశాంత్ విహారి నుంచి హండ్రెడ్ పర్సెంట్ అవుట్-పుట్ వచ్చింది. సినిమాలో ప్రతి సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కుదిరింది. ఎడిటర్ నవీన్ నూలి వర్క్ బాగుంది.

దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తన తొలి చిత్రానికి మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. 5-6 మంచి సీన్లు కూడా రాసుకున్నాడు. కానీ రెండున్నర గంటల సినిమా నడవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. 90ల్లో వచ్చిన ఎన్నో ప్రేమకథలు ఎలా ప్రారంభమౌతాయో.. అదే ఎత్తుగడను దొరసానికి కూడా ఫాలో అయిన మహేంద్ర.. ఇంటర్వెల్ కు ముందు, ఆ తర్వాత సరైన సీన్లు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కానీ ఈ సినిమాతో దర్శకుడిగా తనలో స్పార్క్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

జీ సినిమాలు రివ్యూ

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే విజయ్ దేవరకొండ ఓ మాట అన్నాడు. దొరసాని సినిమా అనేది ఓ ప్రేమప్రయాణం. ఓ ఎమోషనల్ జర్నీ. దాన్ని అనుభూతి చెందాల్సిందే. ఇక్కడ పాట వస్తే బాగుంటుంది కదా.. ఇక్కడ మంచి ఫైట్ పడితే బాగుండు.. ఇక్కడొక పంచ్ డైలాగ్ మిస్ అయిందే లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా ఓ ఫీల్ తో అలా సాగిపోతుందంతే. అది ఫీల్ అయినవాళ్లు హిట్ అంటారు, అవ్వని వాళ్లు కష్టం అంటారు.

అయినా ఇదేదో కమర్షియల్ గా రికార్డులు తిరగరాస్తుందనే ఉద్దేశంతో మహేంద్ర ఈ సినిమా తీయలేదు. ఒకప్పటి గడీల పాలనలో జరిగిన ఓ అందమైన ప్రేమకథను ఉన్నది ఉన్నట్టుగా తీయాలనుకున్నాడు. అలానే తీశాడు. ఈ విషయంలో దొరసానికి వంద మార్కులు గ్యారెంటీ. దర్శకుడిగా మహేంద్రకు కూడా హిట్ మార్క్ లు పడతాయి. ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో తీయడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.

80ల్లో ఓ తెలంగాణ పల్లెలో జరిగిన యదార్థ గాధకు మహేంద్ర ఇచ్చిన ఫిక్షన్ టచ్ బాగుంది. 40 ఏళ్ల నాటి కథను, ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చేసిన మార్పులు, రాసుకున్న సన్నివేశాలు మెప్పిస్తాయి. అప్పటి తెలంగాణ పరిస్థితులు, యాస, వేషధారణ, పీపుల్స్ వార్ ఉద్యమం లాంటి ఎలిమెంట్స్ బాగా మెప్పిస్తాడు. సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చిన ఎలిమెంట్స్ ఇవే.

సెటప్ అంతా బాగున్నప్పటికీ దొరసానికి మెయిన్ ప్రాబ్లమ్ కథతోనే వచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటి.. క్లయిమాక్స్ ఎలా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. సినిమా చూసి అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సెకండాఫ్ స్టార్ట్ అయినప్పట్నుంచి దొరసాని, రాజు ఎలా చనిపోతారనే ఆసక్తితోనే ప్రేక్షకుడు ఉంటాడు తప్ప, పాత్రల మధ్య ఉన్న ప్రేమను ఆస్వాదించడు. అది సినిమాకు మైనస్ గా మారుతుంది.

రొటీన్ స్టోరీతో వస్తున్న ఇలాంటి సినిమాల్ని కేవలం నెరేషన్ తోనే కూర్చోబెట్టాలి. ఈ విషయంలో దర్శకుడు మహేంద్ర కాస్త తడబడ్డాడు. నచ్చిన సన్నివేశాల్నే సాగదీసుకుంటూ వెళ్లిపోయాడు. అలా ఫస్టాఫ్, సెకెండాఫ్ లో కొన్ని సీన్లు విసిగిస్తాయి. దీనికి తోడు షాకింగ్ అనిపించేలా క్లయిమాక్స్ ను తీయకపోవడం మరో పెద్ద మైనస్. కానీ సన్నివేశం ఎలా
ఉన్నప్పటికీ హీరోహీరోయిన్లు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్

ఓవరాల్ గా హీరోహీరోయిన్ల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, తెలంగాణ నేటివిటీ కోసం దొరసాని సినిమాను ఓసారి చూడొచ్చు.

రేటింగ్2.75/5