'డిస్కో రాజా' మూవీ రివ్యూ

Friday,January 24,2020 - 01:44 by Z_CLU

న‌టీన‌టులు : ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్య హాప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు

ఛాయాగ్రహణం : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని

మాటలు : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్

నిర్మాణం : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

కథ –స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌కత్వం : విఐ ఆనంద్

నిడివి : 149 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 24 ఫిబ్రవరి 2020

గతేడాది గ్యాప్ ఇచ్చిన రవితేజ ‘డిస్కో రాజా’ తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాస్ మహారాజా హిట్ కొట్టి ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడా ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

లడక్ లో ఓ గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోయి మంచులో కూరుకుపోతాడు డిస్కో రాజా(రవి తేజ). అయితే కొన్నేళ్ళ తర్వాత అనుకోకుండా ఒక వ్యక్తి కంటపడటంతో మంచులో నుంచి శరీరాన్నిబయటికి తీసి రుద్రాపూర్ లో ఉన్న బయోల్యాబ్ లో ఉంచి ఆ శరీరంపై ఓ ప్రయోగం చేస్తారు. అయితే డాక్టర్స్ చేసిన ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో వెంటనే బ్రతికి కోమాలోకి వెళ్తాడు డిస్కో రాజా. ఆ వెంటనే మళ్ళీ కోమా నుండి బయటికి వచ్చి తన గతం గుర్తుచేసుకొనే ప్రయత్నాలు చేస్తాడు.

అదే క్రమంలో డిస్కో రాజా టివీలో కనబడటంతో వాసు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావ్ అంటూ అతని బందువులు అక్కడికి వస్తారు. ఇక సేతు(బాబీ సింహ) గ్యాంగ్ కూడా అక్కడికి వచ్చి డిస్కో రాజా ను కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ డిస్కో రాజా ఎవరు ? అతని పోలికలతో ఉండే వాసు డిస్కో రాజాకి ఏమవుతాడు..? సేతు కి డిస్కో రాజా కి మధ్య గొడవేంటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

డిస్కో రాజా క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేసాడు రవితేజ. ఇంకెవరూ మ్యాచ్ చేయలేని ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎట్రాక్ట్ చేసి వన్ మ్యాన్ షో అనిపించాడు. పాయల్ తనకిచ్చిన పాత్రలో పరవాలేదు అనిపించుకుంది. గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ కావడంతో నభా ఆకట్టుకోలేకపోయింది. తాన్య హాప్ తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ చేసింది. కామెడీతో పాటు తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు సునీల్.అదేంటనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. గతంలో చేసిన పాత్రే కావడంతో బాబీ సింహ తన విలనిజంతో నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు.

కొన్ని సందర్భాల్లో వెన్నెల కిశోర్ డైలాగ్ కామెడీ పండింది. సత్య కూడా తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. సత్యం రాజేష్ , మహేష్ ఆచంట సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకున్నారు. రాంకీ , నరేష్ , అన్నపూర్ణమ్మ , జీవ , అభయ్ , వంశీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంబంధించి ఆర్ట్ వర్క్ , సినిమాటోగ్రఫీ మేజర్ ఎస్సెట్ గా నిలిచాయి. ముఖ్యంగా కార్తీక్ ఘట్టమనేని తన కెమెరా వర్క్ తో కథకు తగిన విజువల్స్ అందించాడు. తమన్ మ్యూజిక్ కొంత వరకూ మాత్రమే ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సినిమాల్లో నేపథ్య సంగీతాన్ని గుర్తుచేసింది. ‘నువ్వు నాతో ఏమన్నావో’ సాంగ్ విజువల్ కూడా ఆకట్టుకుంది. ఫైట్స్ ఎట్రాక్ట్ చేసాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ తో పాటు మరో ఫైట్ స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.

నవీన్ నూలి ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను ఇంకా కుదిస్తే బాగుండేది. అబ్బూరి రవి అందించిన కొన్ని మాటలు ఆకట్టుకున్నాయి. వి ఐ ఆనంద్ కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కమర్షియల్ సినిమాకు పెట్టింది పేరు రవితేజ … కాన్సెప్ట్ సినిమాల స్పెషలిస్ట్ విఐ ఆనంద్. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది..? సరిగ్గా ‘డిస్కో రాజా’ అలాగే ఉంది. అదిరిపోయే కాన్సెప్ట్ తో కొన్ని కమర్షియల్ హంగులతో కొంత వరకూ ఎట్రాక్ట్ చేసింది. కాకపోతే దర్శకుడు తను నమ్మిన కాన్సెప్ట్ లో రవితేజ ఇమేజ్ కోసం కొన్ని కమర్షియల్ హంగులు అద్దడంతో రొటీన్ సినిమా అనిపిస్తుంది.

ఒక మనిషి చనిపోవడం కొన్నేళ్ళ తర్వాత ఆ మనిషిని బ్రతికించడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ఆ తర్వాత రొటీన్ రివేంజ్ డ్రామాలా నడిపించిన తీరు మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో అయోమయంలో పడేసాడు ఆనంద్.

రవితేజను ఓ గ్యాంగ్ చంపడం, లడక్ మంచులో ఆ బాడీని వదిలేసి వెళ్ళడంతో సినిమాను మొదలుపెట్టి ప్రేక్షకుడిలో ఆసక్తి నెలకొల్పిన దర్శకుడు బయో ల్యాబ్ కి ఆ బాడీని తీసుకురావడం దగ్గర్నుంచి ఇంట్రెస్టింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ముందుకు నడిపించలేకపోయాడు. ముఖ్యంగా వెస్పా బైక్ లోన్ కోసం రవితేజను కనిపెట్టడానికి వచ్చి నభా ప్రేమలో పడటం మరీ సిల్లీగా అనిపిస్తుంది.

ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రవితేజ – పాయల్ లవ్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. అది కూడా గత మాఫియా సినిమాల్లో వచ్చిన లవ్ ట్రాక్ నే గుర్తుచేసింది తప్ప కొత్తగా అనిపించదు.

సినిమా అక్కడక్కడా నత్త నడకన సాగుతుంటే రవితేజ మాత్రం తన ఎనర్జీతో కాస్త స్పీడ్ గా నడిపించే ప్రయత్నం చేసాడు. కొన్ని విసుగు తెప్పించే సన్నివేశాల తర్వాత రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కొంతవరకూ రిలీఫ్ ఇస్తుంది. చాన్నాళ్ళకి పర్ఫెక్ట్ క్యారెక్టర్ దొరకడంతో మాస్ మహారాజా రెచ్చిపోయి నటించాడు. చాలా చోట్ల అభిమానులకు వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రెట్రో గెటప్ లో కూడా ఆకట్టుకున్నాడు.

రవితేజ తర్వాత బాబీ సింహ సినిమాకు ప్లస్ అయ్యాడు. కాకపోతే వారిద్దరి మధ్య వచ్చే వార్ ఎపిసోడ్స్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. రవితేజ -బాబీ సింహ మధ్య ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలు పడకపోవడం కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. వెనకుండి అన్నీ నడిపించే మెయిన్ విలన్ ను సప్రయిజింగ్ క్యారెక్టర్ గా ప్రెజెంట్ చేసిన క్లైమాక్స్ తేలిపోయింది. ఓ కమెడియన్ ఆ పాత్ర చేయడంతో అప్పటివరకూ ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గి కిక్ పోయింది.

ఓవరాల్ గా కొత్త కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ చివరికి ఓ రొటీన్ రివేంజ్ డ్రామాతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు ‘డిస్కో రాజా’. ఫైనల్ గా రవితేజ కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.25 / 5