దేవదాస్ మూవీ రివ్యూ

Thursday,September 27,2018 - 02:43 by Z_CLU

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్,
వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య తదితరులు..
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
నిర్మాత‌: అశ్వనీద‌త్
బ్యానర్: వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్
సంగీతం: మ‌ణిశ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్
నిడివి: 164 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: 27-09-2018

మల్టీస్టారర్ అనగానే కేవలం ఆ హీరోల అభిమానులే కాదు, టోటల్ ఇండస్ట్రీ అంతా ఆ సినిమా వైపు చూస్తుంది. ఎందుకంటే వీటిని హ్యాండిల్ చేయడం అంత కష్టం. అందుకే మల్టీస్టారర్లు తక్కువగా వస్తుంటాయి. హీరోలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి టైమ్ లో నాగ్, నాని కలిసి చేసిన మల్టీస్టారర్ దేవదాస్ థియేటర్లలోకి వచ్చింది. మరి రిజల్ట్ ఏమైంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.

మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

 

నటీనటుల పనితీరు
ఇందులో పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మొదట నాగ్ గురించో లేక నాని గురించో స్టార్ట్ చేయకూడదు. ఇద్దరి గురించి కంబైన్డ్ గా మాట్లాడుకోవాలి. అవును.. దేవ పాత్రలో నాగ్, దాస్ గా నాని అదరగొట్టారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఒక దశలో నాగ్, నాని మధ్య వయసు తేడా కూడా కనిపించలేదంటే అది ఈ సినిమా గొప్పదనం. నేచురల్ పెర్ఫార్మెన్స్ తో నాని మరోసారి ఆకట్టుకున్నాడు. డాక్టర్ గా, దేవాకు ఫ్రెండ్ గా, అక్కడక్కడ ప్రేమికుడిగా బాగా చేశాడు.

ఇక నాగార్జున గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మన్మధుడు అనే ట్యాగ్ లైన్ కు మరోసారి న్యాయం చేశాడు. ఓవైపు యాక్షన్, మరోవైపు లవ్, ఇంకోవైపు ఫ్రెండ్ షిప్.. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు.  ఓవరాల్ గా నాని, నాగార్జునలే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్.

హీరోయిన్స్ లో రష్మిక మరోసారి వెయిట్ ఉన్న పాత్ర పోషించగా.. ఆకాంక్ష సింగ్ కూడా ఉన్నంతలో బాగా చేసింది. ఇతర నటీనటుల్లో సీనియర్ నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు ఉన్నప్పటికీ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్లెవరూ గుర్తుకురారు.

 

టెక్నీషియన్స్ పనితీరు
ఈ సెక్షన్ లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది శ్రీరామ్ ఆదిత్య గురించే. ఇద్దరు పెద్ద హీరోల్ని ఒప్పించడంలోనే శ్రీరామ్ ఆదిత్య సగం సక్సెస్ కొట్టేశాడు. తర్వాత వాళ్లను స్క్రీన్ పై పెర్ ఫెక్ట్ గా చూపించడంలో, ఎక్కువతక్కువలు లేకుండా బ్యాలెన్స్ గా కథను నడిపించడంలో శ్రీరామ్ ఆదిత్య తన టాలెంట్ చూపించాడు. కానీ ఇద్దరు స్టార్స్ ను పెట్టుకొని కూడా అక్కడక్కడ పేలవమైన సన్నివేశాలు రాసుకున్నాడు.

శ్రీరామ్ ఆదిత్య తర్వాత చెప్పుకోదగ్గ టెక్నీషియన్ శ్యామ్ దత్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన శ్యామ్ దత్, బ్రహ్మాండమైన అవుట్-పుట్ ఇచ్చాడు. హీరోహీరోయిన్లు అందర్నీ అందంగా చూపించడంతో పాటు ప్రతి ఫ్రేమ్ ను కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. మణిశర్మ ఎప్పట్లానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. పాటలు మాత్రం రెండే బాగున్నాయి. ఆర్ట్ డైరక్టర్, ఎడిటర్ వర్క్ బాగుంది. ఇక బ్యానర్ విషయానికొస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు తగ్గట్టు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండియర్ గా సినిమాను నిర్మించారు నిర్మాత
అశ్వనీదత్.

జీ సినిమాలు రివ్యూ

సీనియర్ హీరోలు మల్టీస్టారర్లు ఎందుకు చేయాలి. అలాంటి సీనియర్లు చెప్పిన వెంటనే యంగ్ హీరోస్ ఆ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎందుకు ఒప్పుకోవాలి. దేవదాస్ చూస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికిపోతుంది.  కచ్చితంగా ఓ సీనియర్ హీరో, మరో యంగ్ స్టర్ కలిసి చేయాల్సిన సినిమా ఇది.

దేవ్ గా నాగార్జున, దాస్ గా నాని పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యారు. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ వీళ్లే. నాని, నాగ్ ను కాకుండా హీరో ఇద్దరు హీరోల్ని ఈ సినిమాలో ఊహించుకోలేం. అంతలా దాసు, దేవ మెప్పిస్తారు. అంతెందుకు, సినిమాలో కథ, అక్కడక్కడ సన్నివేశాలు కాస్త వీక్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకుడు పక్కచూపులు చూడకపోవడానికి కారణం వీళ్లిద్దరి కెమిస్ట్రీనే.

చిన్న హీరోలతో ఇప్పటికే శమంతకమణి లాంటి మల్టీస్టారర్ చేసిన శ్రీరామ్ ఆదిత్యకు దేవదాస్ మాత్రం సిసలైన పరీక్షలా నిలిచింది. ఓవైపు నాగార్జున లాంటి పెద్ద హీరో, మరోవైపు వరుస హిట్స్ తో ఊపుమీదున్న నాని.. ఇలాంటి ఇద్దరు హీరోలతో కథను పెర్ ఫెక్ట్ గా నడిపించాడు. సెకెండాఫ్ లో అక్కడక్కడ బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో శ్రీరామ్ ఆదిత్య తడబడ్డాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ను మరీ లాజిక్ కు దూరంగా లాగించేశాడు. ఎండ్ కార్డ్ కు ముందు కూడా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. అయినప్పటికీ నాగ్, నాని మేజిక్ ముందు అంతా కొట్టుకుపోయింది. ఓ కంప్లీట్ మూవీ చూసిన ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటకొస్తాడు.

ఓవరాల్ గా దేవదాస్ సినిమా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటుంది. “అన్ని వర్గాలు” అనే పదాన్ని ఏదో అలవాటుగా వాడేశామని మాత్రం అనుకోవద్దు. ఫ్యామిలీస్, యూత్, లేడీస్.. ఇలా అందరికీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా దేవదాస్.

రేటింగ్ – 3.25/5