దేవ్ మూవీ రివ్యూ

Thursday,February 14,2019 - 02:04 by Z_CLU

నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, రేణుక
దర్శకుడు: రజత్ రవిశంకర్
నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు
నిర్మాణం : ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌస్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం : హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ : ఆర్. వేల్ రాజ్
ఎడిటర్ : రూబెన్
డ్యూరేషన్ : 158 నిమిషాలు
సెన్సార్ : క్లీన్ U

హిట్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా అనే విషయాన్ని పక్కనపెడితే కార్తి సినిమాల్లో కంటెంట్ మాత్రం కచ్చితంగా బాగుంటుందనే ఇమేజ్ ఉంది. తెలుగు, తమిళ ఆడియన్స్ కామన్ గా ఫీలయ్యే పాయింట్ ఇది. అలాంటి హీరో నుంచి దేవ్ అనే అడ్వెంచరస్ రొమాంటిక్ డ్రామా వచ్చింది. మరి ఈ సినిమాలో కంటెంట్ ఉందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
అడ్వెంచర్స్ అంటే దేవ్ (కార్తి)కి ఇష్టం. జీవితాన్ని పాజిటివ్ గా చూస్తూ అడ్వెంచరస్ గా గడిపేయాలనుకుంటాడు. ఎవరెస్ట్ ఎక్కాలనేది అతడి డ్రీమ్. మరోవైపు మేఘన (రకుల్ ప్రీత్) మాత్రం దీనికి పూర్తి రివర్స్. తన తండ్రి కారణంగా మగాళ్లను ద్వేషిస్తూ, పూర్తిగా డబ్బు సంపాదించడానికే అంకితమైపోతుంటుంది. అనుకోకుండా ఫేస్ బుక్ లో మేఘనను చూస్తాడు దేవ్. తన పాజిటివ్ యాటిట్యూడ్ తో మేఘనను పడేస్తాడు. మేఘన కూడా దేవ్ ను లవ్ చేస్తుంది.

అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలొస్తాయి. ఇంతకీ దేవ్-మేఘన మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి? మేఘన కారణంగా పక్కనపెట్టిన ఎవరెస్ట్ ఎక్కాలనే తన చిరకాల కోరికను దేవ్ తీర్చుకున్నాడా లేదా? అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు
కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. ఏ క్యారెక్టర్ కైనా ఇట్టే సూట్ అయిపోతాడు. దేవ్ గా కూడా బాగా నటించాడు. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ, అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వ్యక్తిగా కార్తి నటన ఆకట్టుకుంటుంది. డబ్బు మాత్రమే ప్రధానం అనుకునే బిజినెస్ ఉమెన్ పాత్రలో రకుల్ ప్రీత్ కూడా బాగానే నటించింది. వీళ్ల తర్వాత కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కనిపిస్తారు. చెరో 2 సీన్లు మాత్రమే ఉండే ఇలాంటి పాత్రల్ని వీళ్లు ఎలా ఒప్పుకున్నారా అని ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్లకంటే కార్తి ఫ్రెండ్స్ కు ఎక్కువ సీన్లు పడ్డాయంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. సినిమాలో మిగతా పాత్రలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

టెక్నీషియన్స్ పనితీరు
దేవ్ సినిమాతో దర్శకుడిగా మారాడు రజత్ రవిశంకర్. మొదటి సినిమాతోనే నెగెటివ్ మార్కులు తెచ్చుకున్నాడు. కథ, స్క్రీన్ ప్లే విభాగాల్లో రజత్ ఫెయిల్ అయ్యాడు. హీరో ప్రేమకథకు అడ్వెంచర్ యాడ్ చేయాలనే తాపత్రయం కనిపించింది తప్ప, బలమైన సన్నివేశాలు, కాన్ ఫ్లిక్ట్ ఎక్కడా కనిపించలేదు. హరీష్ జయరాజ్ మ్యూజిక్, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. కథకు తగ్గట్టు మంచి లొకేషన్లు ఎంచుకున్నారు.

జీ సినిమాలు రివ్యూ
ప్రేమకథలకు కావాల్సిన బేసిక్ క్వాలిటీ కెమిస్ట్రీ. అది వర్కవుట్ అవ్వకపోతే ఎన్ని యాడ్-ఆన్స్ అద్దినా ప్రయోజనం ఉండదు. దేవ్ లో మిస్ అయింది అదే. హీరోహీరోయిన్లు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రేమలో ఇదంతా సహజం అన్నట్టు ఒకరి మీద ఒకరు పడుతుంటారు. 2 ముద్దుసీన్లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా ఆ ప్రేమ ప్రేక్షకుడికి కనిపించదు. అంతా కృత్రిమం. కార్తి-రకుల్ అత్యంత సహజంగా ఉండడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. మొత్తం సినిమా ఇక్కడే తేడాకొట్టింది.

ఇదే కార్తి గతంలో కాజల్ తో బ్రహ్మాండంగా ఆన్-స్క్రీన్ రొమాన్స్ పండించాడు. వాళ్లిద్దరి పెయిర్ చూస్తే చూడముచ్చటేసింది. కానీ రకుల్ తో మాత్రం ఆ బాండింగ్ కుదరలేదు. ఖాకీ సినిమా సీరియస్ మూవీ కాబట్టి, పైగా లవ్ ట్రాక్ చాలా చిన్నది కాబట్టి నడిచిపోయింది. కానీ దేవ్ అలా కాదు. పూర్తిగా కార్తి-రకుల్ పైనే నడిచింది. కాకపోతే అది గుంతల ప్రయాణంగా మారింది.

కార్తి ఫ్రెండ్, దర్శకుడు రజన్ రవిశంకర్ కు మంచి ఆలోచన వచ్చింది. ఓ ప్రేమకథకు అడ్వెంచర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆ ఆలోచన. నిజంగా ఇది గొప్ప థాట్. కానీ దురదృష్టవశాత్తూ అది ఆలోచన పేపర్ పైకి సగమే వచ్చింది. ఇక తెరపైకి వచ్చేసరికి అందులో సగమే మిగిలింది. అలా దేవ్ సినిమా ఓ మంచి ఆలోచనను ఎలా తీయకూడదో చూపించింది. ఓ దశలో ఈ సినిమాలో “ఎవడే సుబ్రహ్మణ్యం” ఛాయలు కూడా కనిపిస్తాయి. కనీసం ఆ ఎమోషనల్ టర్న్ తీసుకున్నా సినిమా బాగుండేది. ఆ ప్రయత్నం కూడా జరగలేదు.

సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్ విషయానికొస్తే ముందుగా కార్తి గురించే చెప్పుకోవాలి. ఏ క్యారెక్టర్ కు తగ్గట్టు ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయే కార్తి, మోడ్రన్ కుర్రాడిగా, అడ్వెంచరస్ అబ్బాయిగా బాగా సెట్ అయ్యాడు. తనవరకు వందశాతం ఔట్ వుట్ ఇచ్చాడు. రకుల్ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. కానీ స్క్రిప్ట్ లో లోపాలు, బలహీనమైన సన్నివేశాలు వీళ్ల కష్టాన్ని నీళ్లపాలుచేసింది.

దర్శకుడు రజత్ రవిశంకర్ రాసుకున్న కథ బాగుంది కానీ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అస్సలు బాగాలేవు. అడ్వెంచర్ కాన్సెప్ట్ కు, ప్రేమకథకు మధ్య లింక్ సరిగ్గా సెట్ చేయలేకపోయాడు. దీనికితోడు హీరోహీరోయిన్లు విడిపోవడానికి అతడు చూపించిన కారణం అత్యంత పేలవంగా ఉంది. ఇద్దరి ప్రేమకథను మూడో వ్యక్తి ద్వారా అతడు చెప్పించాలనుకున్న స్క్రీన్ ప్లే కూడా పండలేదు. ఉన్నంతలో హరీష్ జైరాజ్ మ్యూజిక్, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ కాస్త కూర్చోబెట్టగలిగాయి. ఒకే పాట మూవీలో 5 చోట్ల కనిపించడం ఆ పాట తప్పు కాదు, స్క్రీన్ ప్లే తప్పు.

ఓవరాల్ గా ఈ ప్రేమికుల రోజున వచ్చిన దేవ్ అనే ప్రేమకథాచిత్రం ఆ లవ్ ఫీల్ ను అందించలేకపోయింది.

రేటింగ్2/5