'దర్బార్' మూవీ రివ్యూ

Thursday,January 09,2020 - 03:12 by Z_CLU

నటీ నటులు : రజినీ కాంత్ , నయనతార, నివేత థామస్, సునీల్ శెట్టి , యోగి బాబు తదితరులు

సంగీతం : అనిరుద్

ఛాయాగ్రహణం : సంతోష్ శివన్

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : సుభాస్కరన్

రచన -దర్శకత్వం : ఎ.ఆర్.మురుగదాస్

నిడివి : 159 నిమిషాలు

విడుదల : 9 జనవరి 2020

 

సూపర్ స్టార్ రజిని – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దర్బార్’ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రజిని తన మేజిక్ చూపించి ప్రేక్షకులను మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

తన కూతరు వల్లి(నివేత థామస్) చనిపోయాక ముంబై కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) గ్యాంగ్ స్టర్స్ ను చంపడమే లక్ష్యంగా పెట్టుకొని డ్రగ్ మాఫియాను అంతం చేయాలనుకుంటాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉండే ఆదిత్య ఇలా వరుస ఎన్కౌంటర్స్ చేయడంతో అతను చేసిన ఎన్కౌంటర్స్ కు సంబంధించి న్యాయ స్థానం మనవ హక్కుల కమీషన్ నుండి నివేదిక కోరుతుంది. మరో వైపు ఆదిత్య అరుణాచలంను చంపాలని చూస్తుంటాడు హరి చోప్రా(సునీల్ శెట్టి). ఇంతకీ ఆదిత్య ముంబైలో ఉన్న రౌడీలపై ఎందుకు ఫోకస్ పెట్టాడు..? హరి చోప్రా ,ఆదిత్య మధ్య ఏం జరిగింది..? అసలు ఆదిత్య అరుణాచలం కూతురు వల్లిని చంపిందెవరు..? చివరికి తన కూతురు చావుకి కారణమైన వ్యక్తికి ఆదిత్య ఎలా అంతమొందించాడు అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

ఎన్నో ఏళ్లుగా తన స్టైల్ తో మేజిక్ చేస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజిని డెబ్బై ఏళ్ళు దాటినా తనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసాడు. తన స్టైల్ , డైలాగ్ డెలివరీ , స్టెప్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసాడు. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కకపోవడంతో నయనతార జస్ట్ గెస్ట్ రోల్ చేసినట్టు అనిపించింది.

రజిని కూతురి పాత్రలో నివేత థామస్ ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో మంచి మార్కులు అందుకుంది. యోగిబాబు డైలాగ్ కామెడీ కొంత వరకూ నవ్వించింది. విలన్ గా సునీల్ బెస్ట్ ఛాయిస్ కానీ అతనను పూర్తి స్థాయిలో వాడుకొని విలనిజం చూపించలేకపోయారు. మిగతా నటీ నటులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

అనిరుద్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలకు ఫ్యాన్స్ రోమాలు నిక్కపొడిచేలా ఆర్ ఆర్ ఇచ్చి జోష్ నింపాడు. సాంగ్స్ లో ‘నేనే దర్బార్’ ఆకట్టుకుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించి తన కెమెరా వర్క్ చూపించాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సెట్స్ బాగా కుదిరాయి. ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు తీసి స్పీడప్ చేస్తే బెటర్ గా ఉండేది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఫైట్ సినిమాకే హైలైట్. మురుగదాస్ కథ-కథనంలో కొత్తదనం లేదు. లైకా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

మరోసారి రజనీకాంత్ కనువిందు చేశారు. అతడి స్టయిల్, యాక్షన్, మేనరిజమ్ దర్బార్ కు స్పెషల్ ఎట్రాక్షన్స్. మరీ ముఖ్యంగా ఈసారి మరింత ఉత్సాహంగా-ఉల్లాసంగా రజనీకాంత్ కనిపించడం తళైవ ఫ్యాన్స్ కు పెద్ద బోనస్. ఇది తప్పితే కథలో కొత్తదనం లేదు. ఇలాంటి కాప్-స్టోరీలు మనకు కొత్తకాదు, అందులో ట్విస్టులు అంతకంటే కొత్తకాదు. రొటీన్ పోలీస్ యాక్షన్ డ్రామాకు రజనీ మార్క్ యాడ్ చేసి దర్బార్ తీశాడు దర్శకుడుఅ మురుగదాస్.

దర్బార్ లో రజనీకాంత్ తన మార్క్ చూపించగలిగాడు కానీ, దర్శకుడిగా మురుగదాస్ మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. మురగకు ప్రత్యేకంగా సౌత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి సినిమాలకు ఓ ఇమేజ్ ఉంది. కానీ దర్బార్ లో మురుగదాస్ మెరుపుల్లేవ్. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల అతడి దర్శకత్వ లోపాల్ని రజనీకాంత్ తన ఇమేజ్ తో కప్పిపెట్టాల్సి వచ్చింది. విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగా పండుతుందనే విషయాన్ని బలంగా నమ్మే మురుగదాస్ ఈ సినిమాలో విషయంలో తప్పు చేశాడు. విలన్ పాత్రను మరింత భయంకరంగా చూపించి ఉంటే బాగుండేది.

అన్నింటికంటే దర్శకుడు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే.. అసలు విలన్ సునీల్ శెట్టి అనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పేసి, అతడు ఎవరో కనిబెట్టే పనిని హీరోకు అప్పగిస్తాడు. అంతా చేసింది సునీల్ శెట్టి అని ఆడియన్స్ కు తెలుసు. అతడు ఎక్కడుంటాడో కూడా తెలుసు. కానీ సూపర్ స్టార్ కు మాత్రం తెలీదు. సెకండాఫ్ మొత్తం క్లైమాక్స్ వచ్చేవరకు వెదుకుతూనే ఉంటాడు. తమకు తెలిసిన విషయాన్ని తమ అభిమాన హీరో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు. ఇలాంటి స్క్రీన్ ప్లేకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారని మురుగదాస్ అనుకోవడం తప్పు. అలాంటప్పుడు హీరో-విలన్ మధ్య కాస్త థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నా బాగుండేది. ఆ ప్రయత్నం కూడా జరగలేదు.

ఉన్నంతలో ఈ సినిమాను రజనీకాంత్ ఒక్కడే ఆదుకున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు వరకు సినిమాను తన భుజాలపై మోశాడు. గడిచిన 3 సినిమాలతో పోలిస్తే ఈసారి రజనీకాంత్ లో మరింత ఎనర్జీ, జోష్ కనిపించింది. ఈ విషయంలో మాత్రం మురుగదాస్ కు వంద మార్కులు వేయాల్సిందే. అభిమానులకు ఏం కావాలో అవన్నీ దర్బార్ తో అందించాడు. అలా మంచి మసాలా అందిస్తూ ఫస్టాఫ్ వరకు సినిమాను బాగా లాక్కొచ్చిన దర్శకుడు, ఇంటర్వెల్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ కు షాకిచ్చాడు.

కానీ ఇంటర్వెల్ తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు మురుగదాస్. తన వీక్ స్క్రీన్ ప్లేతో సెకెండాఫ్ కాసేపు బోర్ కొట్టిస్తాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రేక్షకులకు ముందే అన్నీ చెప్పేసి సినిమాపై ఆసక్తి లేకుండా చేశాడు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి, మురగదాస్ లో ఎక్కడలేని తొందర కనిపించింది. ఇక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, అన్ని దేశాలు వెదుకుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ ను రజనీకాంత్ తుదముట్టిచ్చే క్లైమాక్స్ ఇది కాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్
– రజనీకాంత్ స్టయిల్, యాక్షన్
– అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– సునీల్ శెట్టి ఎప్పీయరెన్స్
– నివేద థామస్ పెర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్
– సెకెండాఫ్ స్క్రీన్ ప్లే
– విలన్ పాత్రను బలంగా చూపలేకపోవడం
– సాంగ్స్

రేటింగ్2.75/5