'దమ్ముంటే సొమ్మేరా' మూవీ రివ్యూ

Friday,June 22,2018 - 06:27 by Z_CLU

నటీనటులు : సంతానం, అంచ‌ల్ సింగ్, ఆనంద్ రాజ్, శౌరభ్ శుక్ల, కరునాస్,రాజేంద్రన్ తదితరులు

మ్యూజిక్ : థమన్ ఎస్.ఎస్

నిర్మాత : నటరాజ్

రచన -దర్శకత్వం : రామ్ బాల

విడుదల : 22 జూన్ 2018

 

ప్రతీ వారం ఏవో కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదలవడం కామనే. ఈ వారం కూడా 2 తమిళ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ‘దమ్ముంటే సొమ్మేరా’. తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హాస్యనటుడు సంతానం హీరోగా నటించిన సినిమా ఇది. తమిళ్ లో హారర్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘దిల్లుడు దుడ్డు’ తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్ తో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమాతో కామెడి హీరోగా ఎలా ఎంటర్టైన్ చేసాడు… సినిమాలో హైలెట్స్ ఏంటి…జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

కుమార్(సంతానం), కాజల్(అంచల్ సింగ్) ఇద్దరూ స్కూల్ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల చిన్నతనంలోనే విడిపోతారు. అలా విడిపోయిన కుమార్ ని మర్చిపోలేక పెద్దయ్యాక కూడా అతన్ని వెతుకుతూ ఉంటుంది కాజల్. ఎట్టకేలకు కుమార్ ని కలిసి తన చిన్నప్పటి రోజులు గుర్తుచేస్తుంది కాజల్. అయితే కుమార్, కాజల్ ప్రేమకు అడ్డుపడతాడు కాజల్ తండ్రి(శౌరభ్ శుక్ల). స్కెచ్ మని(రాజేంద్రన్)తో కలిసి కుమార్ ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తమ ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించి ఊరి శివార్లో ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లా లో ఇద్దరికీ పెళ్లి చేస్తానంటూ కుమార్ కుటుంబాన్ని ఆ బంగ్లా కి రప్పిస్తాడు కాజల్ తండ్రి. అలా పెళ్లి పేరుతో ఆ బంగ్లాలో అడుగుపెట్టిన వారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి…చివరికి  కాజల్ తండ్రి కుమార్ ని చంపగలిగాడా.. లేదా అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

రెండు మూడు సీన్స్ లో, పాటల్లో తప్ప సంతానంలో ఎక్కడా హీరో కనిపించలేదు. కాకపోతే ఈ సినిమా కోసం సంతానం ట్రై చేసిన లుక్ ఆకట్టుకుంది. కాజల్ క్యారెక్టర్ లో అంచల్ సింగ్ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆనంద రాజ్, కమెడియన్ కరునాస్ తమ కామెడీతో అలరించారు. ఇక తన కామెడి టైమింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు రాజేంద్రన్. సెకండ్ హాఫ్ అంతా తన భుజాన వేసుకొని తన కామెడి తో నవ్విస్తూ ముందుకు నడిపించాడు. మిగతా అరవ నటీనటులంతా వారి పరిధిలో నటించారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. పాటలు ఆకట్టుకోలేదు కానీ బాగ్రౌండ్ స్కోర్ బాగుంది. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కానీ మొదటి భాగం ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. అక్కడక్కడా కొన్ని కామెడీ డైలాగ్స్ పేలాయి. కొన్ని పాత్రలకు డబ్బింగ్ ప్రాపర్ గా కుదరలేదు. డైరెక్టర్ రామ్ బాల డైరెక్షన్ పరవాలేదు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ :

కమెడియన్ హీరోగా మారితే సినిమా అంతా అతను హీరోలాగే బిహేవ్ చేస్తూ కామెడి తగ్గిస్తాడు అది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా సంతానం సరిగ్గా అదే చేసాడు. సంతానం నుండి ఆశించే కామెడి పంచ్ లు, ఆ టైమింగ్ అవేమి ఈ సినిమాలో కనిపించవు. అది సినిమాకు మైనస్. హీరోగా ఉంటూనే కామెడి వర్కౌట్ చేయొచ్చు కానీ దర్శకుడు సంతానంని కేవలం హీరోగా మాత్రమే చూపించాడు.

సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకూ ప్రేక్షకుడిలో సహనాన్ని పరీక్షించినట్టుగా అనిపిస్తుంది. కానీ రాజేంద్రన్ ఎంట్రీ నుండి సినిమా గ్రాఫ్ మారిపోయింది. తన కామెడి టైమింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి కడుపుబ్బా నవ్వించాడు రాజేంద్రన్. ఇంటర్వెల్ వరకూ చిరాకు తెప్పించే సన్నివేశాలతో సాగదీస్తూ బోర్ కొట్టించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కామెడితో బాగానే ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అన్నీ బాగా పేలాయి. అందరికీ తెలిసిన కథే పైగా చూసేసిన సన్నివేశాలే అయినప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చే కామెడితో ప్రేక్షకుడికి పైసావసూల్ అయిపోతుంది.

టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో హారర్ కామెడీ సినిమాలొచ్చాయి. అందుకే ఇందులో మనకి ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. కానీ ఫస్ట్ హాఫ్ ను కాస్త ఓపికతో భరిస్తే సెకండ్ హాఫ్ లో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఫైనల్ గా ‘దమ్ముంటే సొమ్మేరా’ హారర్ కామెడి ఎంటర్టైనర్ గా కొంత వరకూ అలరిస్తుంది.

 

ప్లస్ పాయింట్స్ : 

కామెడి

బాగ్రౌండ్ స్కోర్

ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కథ – స్క్రీన్ ప్లే

ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు

పాటలు

 

రేటింగ్ : 2 .5 /5