'కలర్ ఫోటో' మూవీ రివ్యూ

Saturday,October 24,2020 - 10:37 by Z_CLU

నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, దివ్య దృష్టి , సుబ్బారావు తదితరులు

ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్ శాకమూరి

సంగీతం : కాల భైరవ

నిర్మాణం : అమృత ప్రొడక్షన్స్ , లౌక్య ఎంటర్తైన్మెంట్స్

నిర్మాత : సాయి రాజేష్ నీలం , బెన్నీ ముప్పనేని

రచన-దర్శకత్వం : సందీప్ రాజ్

విడుదల : 23 అక్టోబర్ 2020

సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ‘కలర్ ఫోటో’ OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రేమకథ ఎలా ఉంది ? తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేసిన దర్శకుడు సందీప్ ప్రేక్షకులను మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .

Colour Photo Review telugu zeecinemalu
కథ :

సినిమా కథంతా మచిలీపట్నంలో జరుగుతుంది. ఊళ్ళో జనాలకి పాలు పోస్తూ పూటగడిపే జయకృష్ణ (సుహాస్), మరోవైపు కాలేజీలో చదువుకుంటాడు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే దీప్తి (చాందినీ చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు కిట్టు అలియాస్ జయకృష్ణ. ఇక కిట్టు అందంగా లేనప్పటికీ అతని మంచి మనసుకి ఫిదా అయి ప్రేమలో పడుతుంది దీపు అలియాస్ దీప్తి.

ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే కిట్టు-దీపు ఓ ఇన్సిడెంట్ కారణంగా కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు దీపు అన్నయ్య రామరాజు(సునీల్)కి చిక్కుతారు. ఊళ్ళో పోలీస్ గా ఉద్యోగం చేస్తూ ప్రేమ వివాహాలను వ్యతిరేకించే రామరాజు, దీపుకి కిట్టు ని దూరం చేసి తన చెల్లికి అందంగా ఉండే వ్యక్తితో పెళ్లి చేయాలని భావిస్తాడు. రామరాజు కారణంగా కిట్టు, దీపు విడిపోతారు. అలా ప్రేమించిన కిట్టుకి దూరమైన దీపు ఓ NRI ని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంది. ఇక దీపుకి దూరమైన కిట్టు చివరికి ఏమయ్యాడు..? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

హీరో ఫ్రెండ్ గా కమెడియన్ గా పలు సినిమాలతో పేరు తెచ్చుకున్న సుహాస్ కథానాయకుడిగా జస్ట్ పాస్ మార్కులు మాత్రమే అందుకున్నాడు. నిజానికి తనకు యాప్ట్ పాత్రే అయినప్పటికీ సుహాస్ తన పెర్ఫార్మెన్స్ తో కొంతవరకు మాత్రమే ఆకట్టుకోగలిగాడు. ముఖ్యంగా సన్నివేశానికి తగిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. కానీ ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. చాందిని చౌదరి కథానాయికగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బెస్ట్ ఇవ్వాల్సిన కొన్ని సన్నివేశాల్లో జస్ట్ ఓకె అనిపించుకుంది. సునీల్ పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ, విలన్ క్యారెక్టర్ కి తక్కువ అనిపించింది. కనిపించిన కొన్ని సన్నివేశాల్లో కూడా సునీల్ విలనిజం ఎలివేట్ అవ్వలేదు. నిజానికి ఓ దశలో అసలు సునీల్ ఈ పాత్ర ఎందుకు చేసాడనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. స్నేహితుడి పాత్రలో హర్ష మంచి కామెడీ పండించడంతో పాటు క్లైమాక్స్ లో ఎమోషనల్ గా కనిపించి సర్ ప్రయిజ్ చేశాడు. దివ్య దృష్టి , సుబ్బారావు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

లవ్ స్టోరీస్ కి ఎప్పుడూ బెస్ట్ సాంగ్స్ కావాలి. సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ముందుగా ఆ ప్రేమకథను తెలియజేసి సాంగ్స్ తో ఇంప్రెస్ చేయగలగాలి. ఆ బాధ్యతను కీరవాణి తనయుడు కాలభైరవ సంక్రమంగా నిర్వర్తించాడు. సినిమాలో కొన్ని సందర్భాల్లో వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘తరగతి గదిలో’ పాట వినసొంపుగా ఉంది. అలాగే కొన్ని సన్నివేశాలకు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాలను చాలా నేచురల్ గా చిత్రీకరించి సినిమాకి ఓ లుక్, ఫీల్ తీసుకొచ్చాడు. పవన్ కుమార్ ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

తను రాసుకున్న ప్రేమకథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సందీప్ రాజ్ ఫెయిలయ్యాడు. దర్శకుడిగా కొన్ని సన్నివేశాలు బాగానే డీల్ చేసినప్పటికీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

Colour Photo Review
‘జీ సినిమాలు’ సమీక్ష :

ఏ ప్రేమకథకైనా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పండాలి. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ పండేలా మంచి లవ్ ట్రాక్ క్రియేట్ చేసి మెస్మరైజ్ చేసే సన్నివేశాలు రాసుకోవాలి. అప్పుడే ప్రతీ ప్రేక్షకుడు ఆ ప్రేమకథను ఓన్ చేసుకొని కనెక్ట్ అవుతాడు. ‘కలర్ ఫోటో’ కి అదే మైనస్. ఓ హై ఎమోషన్ తో సినిమాను ఎండ్ చేసే ముందు అసలు ఆ ప్రేమ కథకి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు ఉన్నాయా లేవా అనేవి చూసుకోకుండా సినిమా తీశారనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ ను ఇంకా బాగా క్రియేట్ చేసి హీరో హీరోయిన్ మధ్య మంచి లవ్ సీన్స్ పెట్టి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకుంటే సినిమా మరోలా ఉండేది. ‘ప్రేమిస్తే’ , ‘షాపింగ్ మాల్’ లాంటి డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగులో ఆదరించడానికి ఇవే ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇక సినిమాలో క్యారెక్టర్స్ మీద కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ప్రాపర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బెటర్ గా ఉండేది. ముఖ్యంగా సునీల్ ను రామరాజు పాత్రకు తీసుకొని అతని పాత్రకు సరైన ఎలివేషన్ ఇచ్చేలా సన్నివేశాలు రాయడం, తీయడంలో పూర్తిగా విఫలమయ్యాడు దర్శకుడు. ఒకానొక సందర్భంలో అసలు సునీల్ ని ఈ పాత్రకి ఎందుకు తీసుకున్నారు..? అతనెలా యాక్సెప్ట్ చేసాడనే అనుమానం కలుగుతుంది. అటు పూర్తి స్థాయి విలన్ గానూ ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టు గా కాకుండా ఆ పాత్రను డిజైన్ చేసారనిపించింది.

ఇక ట్రైలర్, సాంగ్స్ ఇంపాక్ట్ తో సినిమా చూసే ప్రేక్షకులు ఒక మంచి ప్రేమకథ చూడబోతున్నామనుకుంటారు. సినిమా ఆరంభంలో ఒక మంచి ఆహ్లాదకరమైన పల్లెటూరి ప్రేమకథను చూడబోతున్నాం అనుకునే లోపే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, కథకు అతికించినట్టుగా ఉండే లవ్ ట్రాక్ , మధ్యలో అర్థంపర్థం లేని కాలేజీ ఫైటు ఇలా అన్ని ప్రేక్షకుడిని కాసేపు విసిగిస్తాయి. ఇక సన్నివేశాల్లో బలం లేకపోవడంతో కాల భైరవ ఎంత ఎఫర్ట్ పెట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అలాగే సినిమాలో సునీల్ క్యారెక్టర్ తేలిపోతుందనే విషయం కూడా ఆరంభంలో వచ్చే ఓ సన్నివేశానికే పసిగట్టేయొచ్చు. అయితే కలర్ ఫోటో కథలో ఎంటర్టైన్ మెంట్ కి కూడా మంచి స్కోప్ ఉంది. రొటీన్ ప్రేమకథే అయినప్పటికీ మళ్ళీ ఆకట్టుకునేలా తీయొచ్చు. కానీ మొదటి సినిమా కావడం పైగా దర్శకత్వంలో అనుభవం కూడా లేకపోవడంతో దర్శకుడు పర్ఫెక్ట్ గా డీల్ చేయలేకపోయాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కు టైం కేటాయించి స్క్రిప్ట్ వర్క్ బెటర్ గా చేస్తే తెలుగులో మరో మంచి ప్రేమకథ అయ్యుండేది.

ఫైనల్ గా ‘కలర్ ఫోటో’ క్లైమాక్స్ లో కొందరిని కదిలించినప్పటికీ ఫైనల్ గా చూసుకుంటే సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ అనిపించకపోవచ్చు.

రేటింగ్ : 2.5/5