కేరాఫ్ సూర్య మూవీ రివ్యూ

Friday,November 10,2017 - 04:16 by Z_CLU

నటీనటులు : సందీప్ కిషన్, మెహరీన్, విక్రాంత్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, తులసి, ప్రవీణ్, సత్య, ధన్ రాజ్

సంగీతం: డి.ఇమ్మాన్

ఛాయాగ్రహణం : జె.లక్ష్మణ్ కుమార్

ఎడిటర్ : ఎం.యు.కాశీవిశ్వనాధం

పాటలు : రామజోగయ్య శాస్త్రి-శ్రీమణి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి

సహ-నిర్మాత : రాజేష్ దండా

సమర్పణ : శంకర్ చిగురుపాటి

నిర్మాత : చక్రి చిగురుపాటి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుశీంద్రన్

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడివీర ప్రేమ‌క‌థ, రాజా ది గ్రేట్ చిత్రాలతో యూత్ ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్ గా “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం కేరాఫ్ సూర్య. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

విశాఖపట్నంలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి సూర్య (సందీప్ కిషన్). డాక్టర్ నిర్లక్ష్యంతో తండ్రిని (నాగినీడు) కోల్పోయిన సూర్య, తండ్రి మరణం వల్ల వచ్చే పోలీస్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, కేటరింగ్ జాబ్ చేస్తుంటాడు. సూర్య ప్రాణ స్నేహితుడు మహేష్ (విక్రాంత్). గతంలో ఓసారి సూర్య చెల్లెలికి మహేష్ ప్రపోజ్ చేస్తాడు. అది సూర్య తల్లి (తులసి)కి నచ్చదు. దీంతో మహేష్ అంటే కోపంగా ఉంటుంది సూర్య తల్లి. కానీ సూర్య చెల్లెలు, మహేష్ మాత్రం సీక్రెట్ గా ప్రేమించుకుంటూ ఉంటారు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే సీన్ లోకి ఎంటర్ అవుతాడు క్రిమినల్ సాంబశివుడు (హరీష్ ఉత్తమన్). కాంట్రాక్ట్ కిల్లర్ గా పేరుమోసిన ఈ క్రిమినల్, సూర్య చెల్లెల్లి చంపాలనుకుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సూర్య చెల్లెలతో పాటు అతడి బాయ్ ఫ్రెండ్ మహేష్ ను కూడా హతమార్చి, ఇద్దరిదీ ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుంటాడు. సాంబశివుడి ప్రయత్నాన్ని సూర్య ఎలా అడ్డుకున్నాడు.. అతడి దాడి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ను, చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడనేది స్టోరీ.

 నటీనటుల పనితీరు

హీరో సందీప్ కిషన్ మరోసారి తన క్యారెక్టర్ లో లీనమైపోయాడు. ఎక్కడా హీరోయిజం చూపించకుండా అత్యంత సహజంగా నటించాడు. హీరో ఫ్రెండ్ గా నటించిన విక్రాంత్ కూడా కూల్ గా కనిపిస్తూ చక్కగా యాక్ట్ చేశాడు. ఇక విలన్ గా నటించిన హరీష్ ఉత్తమన్, తులసి, సత్య, ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ మెహ్రీన్ కు చెప్పుకోదగ్గ పాత్ర లేకపోయినా కనిపించినంత సేపు హోమ్లీగా కనిపించి ఆకట్టుకుంది.

టెక్నీషియన్స్ పనితీరు

ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు ఇమాన్. సినిమా టైటిల్స్ వద్ద వచ్చే సాంగ్, ఫ్రెండ్స్ మధ్య తీసిన సాంగ్ చాలా బాగున్నాయి. అంబు, అరివు యాక్షన్ కొరియోగ్రఫీ నేచురల్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ కుమార్.. కొన్ని సందర్భాల్లో తన చమక్కు చూపించాడు. లక్ష్మీ నరరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్, డైలాగ్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది.

జీ సినిమాలు సమీక్ష

దర్శకుడు సుశీందరన్ కు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అతడు తీసిన  ఓ సినిమా నా పేరు శివగా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడం, వరుస విజయాలతో దూసుకుపోతున్న మెహ్రీన్ హీరోయిన్ గా ఉండడంతో కేరాఫ్ సూర్యపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు కోలీవుడ్ స్టార్ సూర్య ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. నాని, రకుల్ లాంటి టాలీవుడ్ స్టార్స్ ఈ సినిమా సాంగ్స్, ట్రయిలర్ ను విడుదల చేయడంతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ ప్రాజెక్టు.

మెడికల్ సీట్ల మాయాజాలంలో జరిగే అక్రమాల్ని కేరాఫ్ సూర్య సినిమా బాగా ఎలివేట్ చేసింది. ఓ కాలేజీలో 36 సీట్లే ఉంటాయి. మరి 37వ వ్యక్తికి అదే కాలేజీలో సీట్ కావాలంటే ఏం చేయాలి. ర్యాంకులు సాధించిన 36 మందిలో ఒకర్ని చంపేయాలి. అప్పుడే 37వ వ్యక్తికి సీటు వస్తుంది. నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగాయో లేదో కానీ కేరాఫ్ సూర్య సినిమాలో మాత్రం చాలా రియలిస్టిక్ గా చూపించారు. నిజంగా ఇలాంటివి కూడా జరుగుతాయా అనే విధంగా ఉంది ఈ సినిమా స్టోరీ. ఈ సబ్జెక్ట్ కు తనదైన స్టయిల్ ఆఫ్ స్క్రీన్ ప్లే యాడ్ చేశాడు సుశీందరన్. సినిమా ఆఖరి 20 నిమిషాల వరకు ఈ విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు బాగుంది.

కాకపోతే సినిమా ఫస్టాఫ్ కాస్త నీరసంగా సాగుతుంది. కామెడీ పండించాలని ట్రై చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. మరీ ముఖ్యంగా తను గతంలో తీసిన ‘నా పేరు శివ’ సినిమాలోని కొన్ని సందర్భాల్ని, సన్నివేశాల్ని దర్శకుడు రిపీట్ చేయడం ఈ సినిమాకు మైనస్. దీనికి తోడు హీరోయిన్ క్యారెక్టర్ ను సినిమాలో ఇరికించడానికి చేసిన ప్రయత్నం కూడా అంతగా కనెక్ట్ కాదు. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

డిఫరెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లకు కేరాఫ్ సూర్య నచ్చుతుంది.

రేటింగ్2.75/5