చిలసౌ మూవీ రివ్యూ

Friday,August 03,2018 - 12:45 by Z_CLU

నటీనటులు : రాహుల్ రవీంద్రన్ , రుహాని శర్మ, రోహిణి, వెన్నెల కిషోర్, విధ్యు తదితరులు
కెమెరామెన్: ఎం.సుకుమార్,
సంగీతం: ప్రశాంత్ విహారి,
ఎడిటర్: చోట కె ప్రసాద్,
సమర్పణ : మనం ఎంటర్ ప్రైజెస్
నిర్మాతలు: భరత్ కుమార్ మాలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి.
రచన – దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
సెన్సార్ : U/A
విడుదల తేది : 3 ఆగస్ట్ 2018

నటుడిగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రాహుల్ రవీంద్రన్… దర్శకుడిగా మారే సాహసం చేశాడు. చిలసౌ సినిమాతో మెగా ఫోన్ పట్టి పదేళ్ళ తన కలను నెరవేర్చుకున్నాడు. కల అయితే తీర్చుకున్నాడు కానీ సినిమా పరిస్థితేంటి..? ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన చిలసౌ.. రాహుల్ ను దర్శకుడిగా నిలబెట్టిందా..? హీరో సుశాంత్ కు కలిసొచ్చిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

అర్జున్(సుశాంత్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. జీవితంలో తనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పెళ్ళికి దూరంగా ఉంటాడు. కానీ తల్లి(అనూ హాసన్) పదే పదే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అయిష్టంగానే అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులకు ఒప్పుకుంటాడు. అంజలి కూడా తన తల్లి(రోహిణి) కోసమే పెళ్లి చేసుకోవాలని భావించి అర్జున్ ఇంటికి ఒంటరిగా పెళ్లిచూపులకు వస్తుంది. వీరిద్దరూ ఒంటరిగా కలిస్తే బాగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశ్యంతోనే అలా ప్లాన్ చేసి ఇంట్లో పెళ్లిచూపులు ఎరేంజ్ చేస్తుంది అర్జున్ తల్లి. పరిచయమైన కొద్ది సమయంలోనే పెళ్లిపై తనకున్న అయిష్టాన్ని బయటపెడతాడు అర్జున్. కానీ అలా చెప్పిన కాసేపటికే కొన్ని సంఘటనల వల్ల మెల్లగా అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. అలా 24 గంటల సమయంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇద్దరు ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. అయితే పెళ్ళిచూపులకు 24 గంటలు దొరికితే ఎలా ఉంటుంది. చివరికి అర్జున్ అంజలి ఒక్కటయ్యారా లేదా అనేదే చిలసౌ కథ…


నటీనటుల పనితీరు :

ఇప్పటివరకు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో అలరించిన సుశాంత్ ఈ సినిమాతో తన ఒరిజినాలిటీ బయటపెట్టాడు. అర్జున్ గా డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రుహానీ శర్మ కి ఇదే మొదటి సినిమా అంటే నమ్మలేం. అంతలా తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక రోహిణి చేసిన గత పాత్రలతో పోలిస్తే ఈ క్యారెక్టర్ గురించి ఇంకొంచెం ఎక్కువే చెప్పాలి. ఆనందకరమైన సందర్భాల్లో బాగా ఎగ్జైట్ అవుతూ తన వ్యాధిని బయటపెట్టే పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నటిగా తన సత్తా చూపించింది. వెన్నెల కిషోర్ కొన్ని సందర్భాల్లో తన కామెడి టైమింగ్ తో నవ్వించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మెట్ల సీన్, ప్రీ క్లైమాక్స్ లో ఆరెంజ్ జ్యూస్ కోసం పక్కింటి వారిని సంప్రదించే సీన్ లో కడుపుబ్బా నవ్వించాడు. ఇక జయప్రకాష్ క్యారెక్టర్ చిన్నదే అయినా సెటిల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. రాహుల్ రామకృష్ణ, విద్య, హరీష్ తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. ముఖ్యంగా తన రీరికార్డింగ్ తో కొన్ని ఎమోషనల్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ‘మెల్లగా మెల్లగా’, ‘సోలో’ పాటలు బాగున్నాయి. సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్. సినిమాకు తగ్గుట్టుగా ప్రతీ ఫ్రేమ్ చాలా నేచురల్ గా ఉంది. వినోద్ వర్మ ఆర్ట్ వర్క్ బాగుంది. రాహుల్ రవీంద్రన్ స్క్రీన్ ప్లే -డైరెక్షన్ ఆకట్టుకుంది. సిరుని సినీ కార్పోరేషన్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు. రుహని శర్మ క్యారెక్టర్ కి చిన్మయి వాయిస్ ప్లస్ అయ్యింది.


జీ సినిమాలు రివ్యూ

దర్శకుడిగా రెగ్యులర్ రొటీన్ కథనే సెలెక్ట్ చేసుకున్న రాహుల్ ఆ కథకు 24 గంటల్లో ఒక జంట ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకున్నారు..అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను యాడ్ చేసి తన స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున చెప్పినట్టు.. మంచి రైటింగ్ కనిపిస్తుంది ఈ మూవీలో.

తను చెప్పాలనుకున్న కథను చాలా రియలిస్టిక్ గా చెప్పాడు రాహుల్. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా టాలెంట్ కు పదును పెట్టాడు. మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే, నేచురల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాతో రాహుల్ దర్శకుడిగా బిజీ అవ్వడం గ్యారెంటీ.

హీరో క్యారెక్టర్ నుంచి ప్రతి పాత్రకు తగ్గట్టు ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని అక్కడే ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు రాహుల్. హీరోయిన్ తల్లి పాత్రకు రోహిణి లాంటి సీనియర్ నటిని సెలెక్ట్ చేసుకొని ఆమె నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాడు. రోహిణి, రుహాని మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి.

ఫస్ట్ హాఫ్ అంతా కామెడి, సెంటిమెంట్ సీన్స్ తో నడిపించిన రాహుల్ సెకండ్ హాఫ్ లో అర్జున్, అంజలి లైఫ్ లో ఊహించని సంఘటనలతో వచ్చే ట్విస్టుల తో, వెన్నెల కిషోర్ కామెడి, రొమాంటిక్ సీన్స్ తో అలరించాడు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుందనుకునే సమయంలో వెన్నెల కిషోర్ కామెడి ఆదుకుంటుంది. ఇక అక్కడ్నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ తో కథ మళ్ళీ గాడిలో పడుతుంది. మన జీవిత భాగస్వామిను ఎంచుకోవడానికి కొన్ని నిమిషాలు కాకుండా కొన్ని గంటలు, రోజులు ఉంటే బాగుంటుంది అనే పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పాడు రాహుల్.

కాకపోతే హీరోకున్న లక్ష్యం గురించి అలాగే అతను పెళ్లి వద్దనడానికి రీజన్ ఏంటో ఇంకాస్త డెప్త్ లోకి తీసుకెళ్ళి చెప్తే బాగుండేది. కొన్ని సందర్భాల్లో మరీ నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టర్ ను మరీ సింపుల్ గా కానిచ్చేయడం, ఇంటర్వెల్ కే సినిమా కథ మొత్తం తెలిసిపోవడం సినిమాకు మైనస్. . ఫైనల్ గా ‘చిలసౌ’ సింపుల్ & బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3/5