'చాణక్య' మూవీ రివ్యూ

Saturday,October 05,2019 - 01:34 by Z_CLU

న‌టీన‌టులు : గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనా ఖాన్, నాజర్, సునీల్, అలి, త‌దిత‌రులు

ఛాయాగ్రహణం : వెట్రీ ప‌ళ‌ని స్వామి

సంగీతం : విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ చరణ్ పాకాల(నేపథ్య సంగీతం)

నిర్మాణం: ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తిరు

నిడివి : 146 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 5 అక్టోబర్ 2019

 

మ్యాచో హీరో గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తిరు డైరెక్షన్ లో స్పై-యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా..? గోపీచంద్ హిట్టు కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఇండియన్ ఆర్మీకి సంబంధించి రా ఏజెంట్ గా ఉండే అర్జున్(గోపీచంద్) తన టీంను లీడ్ చేసే కులకర్ణి(నాజర్) సపోర్ట్ తో అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తుంటాడు. అందులో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే ఖురేషి(రాజేష్ కటార్) అనే డాన్ ని టార్గెట్ చేసి తన మనిషి అబ్దుల్ సలీంను ఎటాక్ చేసి అదుపులోకి తీసుకుంటాడు. మరోవైపు రామకృష్ణగా పేరుమార్చుకొని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు అర్జున్. ఈ క్రమంలో తన బ్యాంక్ కస్టమర్ ఐశ్వర్య(మెహ్రీన్)ను మొదటి చూపులోనే చూసి ఇష్టపడతాడు. చిన్న గ్యాప్ లోనే ఇద్దరూ ప్రేమలో పడతారు.

ఇక ఐశ్వర్యతో కలిసి బయటికి వెళ్ళిన సందర్భంలో అర్జున్ పై ఎటాక్ జరుగుతుంది. దానికి కారణం ఖురేషి కొడుకు సోహెల్(ఉపెన్ పటేల్) అని తెలుసుకుంటాడు అర్జున్. అదే సమయంలో అర్జున్ టీంలో ఉండే నలుగురిపై ఎటాక్ జరిపి పాకిస్తాన్ కి తరలిస్తాడు సోహెల్. తన టీంను కాపాడుకోవాలంటే కరాచీ కి రమ్మని అర్జున్ కి సవాల్ విసురుతాడు. అలా తన టీంను కాపాడుకోవడానికి పాకిస్తాన్ వెళ్ళిన అర్జున్ తన స్నేహితులను కాపాడి సోహెల్ ను ఎలా బంధించాడు.. అనేదే మిషన్ చాణక్య.

 

నటీనటుల పనితీరు:

గోపీచంద్ రెండు వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్స్ లో ఆకట్టుకున్నాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మ్యాచో హీరో అనిపించుకున్నాడు. ఎప్పటిలాగే డైలాగ్ డెలివరీతో ఎట్రాక్ట్ చేసాడు. కథలో పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ తో మెహ్రీన్ జస్ట్ పరవాలేదు అనిపించుకుంది. జరీన్ ఖాన్ నటన ఆకట్టుకుంది. అర్జున్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో మంచి మార్కులే అందుకుంది. కొన్ని సందర్భాల్లో సునీల్, అలీ కామెడీ నవ్విస్తుంది. మళ్ళీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సునీల్ తన కామెడీ టైమింగ్ తో కొంత వరకూ ఎంటర్టైన్ చేసాడు.

సినిమాలో కీ రోల్ పోషించిన నాజర్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. అర్జున్ టీం మెంబర్స్ గా రాజా, గగన్ విహార్, ఆదర్శ్ బాలకృష్ణ మంచి నటన కనబరిచారు. జయప్రకాశ్ , రఘుబాబు, స్వప్నిక తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

వెట్రీ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను తన కెమెరా వర్క్ తో బాగా చూపించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ అందించిన పాటలు ఆకట్టుకోలేకపోయాయి. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. ఎడిటింగ్ పరవాలేదు. ర‌మ‌ణ వంకా ఆర్ట్ వర్క్ బాగుంది.

రియల్ సతీష్ , స్టంట్ సిల్వ, వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో అబ్బూరి రవి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. తిరు కథతో పాటు డైరెక్షన్ కూడా వీక్ అనిపించాడు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

మొదటిసారి స్పై యాక్షన్ జోనర్ లో సినిమా చేసిన గోపీచంద్ ‘చాణక్య’ తో మెప్పించలేకపోయాడు. ట్రైలర్ చూసి గోపీచంద్ ఈసారి ఓ సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఊహించిన ప్రేక్షకులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. ఓ స్పై యాక్షన్ కథను రెడీ చేసుకొని దానికి కొన్ని కమర్షియల్ హంగులు అద్ది నిరుత్సాహపరిచాడు దర్శకుడు. ఎంతో సీరియస్ గా తెరకెక్కించాల్సిన సినిమాలో రొమాన్స్, కామెడీ, సాంగ్స్ కి స్కోప్ ఇచ్చి ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు.

‘చాణక్య’ అనే మిషన్ చుట్టూ ఏదైనా ఆసక్తి కరంగా స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది. దర్శకుడు ఓ దేశ సమస్యను ఓ లోకల్ సమస్య లా చూపిస్తూ తెరకెక్కించిన విధానం సిల్లీగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ డిజైనింగ్ లో కూడా విఫలమయ్యాడు తిరు. పాటల కోసం మెహ్రీన్ ను కామెడీ కోసం సునీల్ ను పెట్టుకొని వారి పాత్రలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా రెండో భాగంలో కథలో ఏదైనా మలుపు రాకపోదా అని ఎదురుచూస్తున్న సమయంలో సినిమాలో నేను కూడా ఉన్నాను అని గుర్తు చేసేలా మెహ్రీన్ ఓ సాంగ్ కోసం వచ్చి వెళ్తుంది. ఆ పాటతో పాటు దానికి ముందు వచ్చే మెహ్రీన్ సీన్ కామెడీగా అనిపిస్తుంది. సినిమాను కేవలం సీరియస్ గా నడిపించకూడదని ఫిక్సయినప్పుడు మిగతా ఎలిమెంట్స్ దృడంగా ఉండేలా చూసుకోవాలి. ఆ విషయంలో తిరు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రెండో భాగం డబుల్ బాడీ అనే ట్విస్టును కూడా సరిగ్గా రాసుకోలేదు దర్శకుడు. దాంతో ఆ ట్విస్టును ప్రేక్షకులను ట్విస్ట్ గా ఫీలవ్వలేకపోయారు.

సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకూ ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ అయ్యే సన్నివేశాలు పడలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్. స్పై యాక్షన్ సినిమాలా కాకుండా ఓ సాదా సీదా యాక్షన్ డ్రామాలా నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోదు. స్క్రీన్ ప్లే లో బలం లేకపోవడంతో గోపీచంద్ కూడా ఏం చేయలేకపోయాడు. మొదటి భాగంలో హీరో హీరోయిన్ కలిసే ప్రేమ సనివేశాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఆ సన్నివేశాల కోసం రాసుకున్న కుక్కల కామెడీ నవ్వించకపోగా మాకేంటి ఈ బాధ అనే ఫీల్ కలిగిస్తుంది. ఫైనల్ గా గోపీచంద్ ‘చాణక్య’ తో మరోసారి నిరాశ పరిచాడు.

బాటమ్ లైన్ : మిషన్ ఫెయిల్

రేటింగ్ : 2/5