'బుర్రకథ' మూవీ రివ్యూ

Friday,July 05,2019 - 12:02 by Z_CLU

న‌టీనటులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సంగీతం : సాయికార్తీక్‌

ఛాయాగ్రహణం: సి.రాంప్ర‌సాద్‌

స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్ దిడ్ల

నిర్మాణం : దీపాల ఆర్ట్స్‌

నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు

సెన్సార్ : U/A

రన్ టైమ్ : 126 నిమిషాలు

రిలీజ్ డేట్: జూన్ 28, 2019

 

ఒక వ్యక్తికి రెండు బ్రెయిన్స్ ఉంటే పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఏ మెదడు పనిచేస్తుందో తెలియకపోతే ఎలా? ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈరోజు థియేటర్లలోకొచ్చింది బుర్రకథ. మరి ‘ఆది’ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.

ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).

ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

 

నటీనటుల పనితీరు:

సినిమాకు బ్యాక్ బోన్, వన్ మ్యాన్ ఆర్మీ ఆది సాయికుమార్ మాత్రమే. రెండు డిఫరెంట్ షేడ్స్ ను ఒకే సినిమాలో చూపించాలంటే ఏ హీరోకైనా కష్టమే. అలాంటి కష్టమైన జాబ్ ను ఎంతో ఇష్టంగా పూర్తిచేసి బెస్ట్ అనిపించుకున్నాడు ఆది. మాస్, క్లాస్ క్యారెక్టర్లను చక్కగా పండించాడు. చూడ్డానికి క్యూట్ గా ఉంటాడు కాబట్టి క్లాస్ క్యారెక్టర్ పోషించడానికి అతడికి పెద్దగా ఇబ్బంది లేదు. మాస్ క్యారెక్టర్ లోకి షిఫ్ట్ అవ్వడానికి మాత్రం ఆదికి తన అనుభవం పనికొచ్చింది. పైగా రెండు పాత్రల్లో గెటప్, లుక్ పరంగా పెద్దగా వేరియేషన్స్ లేకపోవడంతో ఆ తేడాను తన యాక్టింగ్ తోనే చూపించాల్సి వచ్చింది. ఈ విషయంలో ఆది యాక్టింగ్ కు వంద మార్కులు వేయాల్సిందే.

ఆది తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలు పోషించిన వ్యక్తులు రాజేంద్రప్రసాద్, పోసాని. వీళ్ల సీనియారిటీ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఓవైపు కామెడీ పండిస్తూనే, మరోవైపు కథను వీళ్లిద్దరూ కలిసి ముందుకు తీసుకెళ్లే విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తికి కాస్త నటించే స్కోప్ దక్కింది. నైరా షా మాత్రం యాక్టింగ్ పరంగా చాలా మెరుగవ్వాలి.  ఇతర పాత్రలు పోషించిన పృధ్వి, గాయత్రి గుప్తా, అభిమన్యుసింగ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. పాత్ర స్వభావం ఏదైనా అంతా కలిసికట్టుగా కామెడీ పండించారు. అదే స్పెషాలిటీ.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ కేటగిరీలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు డైమండ్ రత్నబాబు గురించే. కథను చక్కగా రాసుకోవడంతో పాటు ఏమాత్రం తడబడకుండా సినిమాను తెరకెక్కించాడు. నిజానికి ఇలాంటి కథలకు ఎవరైనా సీనియర్ డైరక్టర్ అవసరం. కానీ డైమండ్ రత్నబాబు మాత్రం మొదటి సినిమా అయినప్పటికీ, ఎక్కడా కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ రానివ్వలేదు. హీరోకు చెందిన రెండు పాత్రల్ని అతడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. టేబుల్ పై ప్రతి డీటెయిల్ ను నీట్ గా రాసుకోవడం రత్నబాబుకు ప్లస్ అయింది. దీనికి తోడు డైలాగ్స్ కూడా బాగా పేలాయి.

దర్శకుడికి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్ నుంచి పూర్తి సహకారం అందింది. డీవోపీ రామ్ ప్రసాద్ అనుభవం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అటు సాయికార్తీక్ కూడా  మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. 2 పాటలు కూడా బాగున్నాయి. వర్మ ఎడిటింగ్, చిన్న ఆర్ట్ వర్క్ బాగున్నాయి. దీపాల ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథకు ఎంత అవసరమో అంతకంటే కాస్త ఎక్కువే ఖర్చు చేసినట్టున్నారు.


జీ సినిమాలు రివ్యూ:

ఏ కాన్సెప్ట్ తీసుకున్నామన్నది కాదు, ఆ కాన్సెప్ట్ ను ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత ఎంటర్ టైనింగ్ గా చెప్పామన్నది ఇంపార్టెంట్. స్టోరీలైన్ గా చెప్పుకుంటే బుర్రకథ చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాంటి టఫ్ కాన్సెప్ట్ ను కూడా అంతా సరదాగా నవ్వుకునేలా, మనసుకు హత్తుకునేలా  తెరకెక్కించాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు.

బుర్రకథ అంటే మనందరికీ తెలిసిందే. కానీ ఆది నటించిన ఈ బుర్రకథ మాత్రం నిజంగా “బుర్ర”కు సంబంధించిన కథ. ఒక మనిషికి రెండు బ్రెయిన్స్ ఉంటే పరిస్థితేంటనే విషయాన్ని సీరియస్ గా కాకుండా సున్నితంగా, సరదాగా చెప్పిన విధానం మెప్పిస్తుంది. అభి, రామ్ పాత్రల్లో ఆది పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒకే సినిమాలో మాస్ గా, క్లాస్ గా కనిపించే అవకాశం చాలా కొద్దిమంది హీరోలకు మాత్రమే దక్కుతుంది. అలాంటి ఛాన్స్ ఈ సినిమాతో కొట్టేశాడు ఆది.

స్ప్లిట్ పర్సనాలిటీ అనేది తెలుగు సినిమాకు కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి స్టోరీలైన్స్ వచ్చాయి. అంతెందుకు, గజనీ సినిమా నుంచి ఇలాంటి కథలు మినిమం గ్యాప్స్ లో వస్తూనే ఉన్నాయి. కానీ వాటితో పోలిస్తే ఇది ఎంతో భిన్నం. దానికి కారణం ఇందులో వినోదం. సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి క్లయిమాక్స్ కు ముందు వరకు ఎక్కడా కామెడీ డోస్ తగ్గలేదు. హీరోతో పాటు రాజేంద్రప్రసాద్, పోసాని, పృధ్వి.. ఇలా ఒక్కరు కాదు, అంతా తలో చేయి వేయడంతో సినిమాలో కామెడీ పుష్కలంగా పండింది.

కామెడీనే ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవ్వడం, పైగా ఈ సీజన్ లో రావడం బుర్రకథకు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే దాదాపు సమ్మర్ స్టార్ట్ అయినప్పట్నుంచి అన్నీ ఎమోషనల్ మూవీసే వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఫుల్ లెంగ్త్ నవ్వించే సినిమాగా బుర్రకథ వచ్చింది. అందుకే ఇది ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. దీనికి తోడు సినిమాలో ఫాదర్ సెంటిమెంట్, క్లయిమాక్స్ ట్విస్ట్ బిగ్ హైలెట్స్ గా నిలిచాయి.

ఈ ప్లస్ పాయింట్స్ తో పాటు సినిమాలో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సెకెండ్ హీరోయిన్ ను ఉన్నఫలంగా ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు.. ఆమెకు రాసుకున్న సన్నివేశాలు అంతగా మెప్పించవు. అభి పక్కనుండే గాయత్రి గుప్త పాత్రతో పాటు అభిమన్యు సింగ్ పాత్రల్ని ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. కామెడీపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో దర్శకుడికి ఈ పాత్రలపై దృష్టిపెట్టేంత టైమ్ చిక్కి ఉండదు. ఇలాంటి చిన్న డ్రాబ్యాక్స్ మినహా… బుర్రకథలో వంకలు పెట్టడానికేం లేదు.

ఓవరాల్ గా.. ఈ వీకెండ్ లో ఫ్యామిలీస్ తో పాటు వెళ్లి, మన బుర్రకు పనిచెప్పకుండా హాయిగా ఎంజాయ్ చేయదగ్గ సినిమాగా నిలుస్తుంది ఈ హైటెక్ బుర్రకథ.

రేటింగ్3/5