బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ

Friday,June 28,2019 - 02:41 by Z_CLU

న‌టీన‌టులు: శ్రీవిష్ణు, నివేత థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేత పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరాం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
బ్యాన‌ర్‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
సెన్సార్: క్లీన్ U
రిలీజ్ డేట్: 28 జూన్ 2019

కథ

రాహుల్ (శ్రీవిష్ణు), రాంకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ).. ముగ్గురూ ముగ్గురే. వీళ్లను అంతా ఆర్-3 బ్యాచ్ అంటారు. వీళ్లకు చదువు అబ్బలేదు. మూడు సార్లు ఇంటర్మీడియట్ ఫెయిలై అదే క్లాస్ లో కొనసాగుతూ ఉంటారు. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ (శ్రీకాంత్ అయ్యంగార్) కూతురు మిత్ర (నివేత థామస్) కూడా అదే క్లాస్ లో చదువుకుంటుంది. మిత్ర చదువు కూడా ఆర్-3 బ్యాచ్ కు ఏమాత్రం తీసిపోదు. కానీ మిత్రకు డాన్స్ అంటే ప్రాణం. తండ్రికి చదువంటే ప్రాణం. ఒక దశలో కూతుర్ని బాగా చదవమని టార్చర్ పెట్టడంతో తన ఫ్రెండ్స్ అయిన రాహుల్, రాంకీ, రాంబో సహాయంతో ఓ చిన్న డ్రామా ఆడి ఇంటి నుంచి పారిపోతుంది మిత్ర. అక్కడే కిడ్నాప్ కు గురవుతుంది.

అదే సమయంలో సైమల్టేనియస్ గా మరో కథ నడుస్తోంది. సినిమాల్లో దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న విశాల్ (సత్యదేవ్), హీరోయిన్ షాలు (నివేత పెతురాజ్)కు కథ చెబుతుంటాడు. కథను లైక్ చేయడంతో పాటు విశాల్ ను కూడా ఇష్టపడుతుంది షాలు. ఈ క్రమంలో విశాల్ తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఇలా సమాంతరంగా సాగుతున్న ఈ రెండు కథలు ఎక్కడ కలిశాయి..? ఫైనల్ గా మిత్ర కిడ్నాప్ డ్రామ్ ఏమైంది? విశాల్ తండ్రికి ఎలా యాక్సిడెంట్ అయింది? అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

ఈ సినిమాలో హీరోలు ముగ్గురు. వాళ్లే ఆర్-3 బ్యాచ్. రాహుల్, రాంకీ, రాంబో పాత్రల్లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇరగదీశారు. వీళ్లకు తోడు నివేత థామస్, నివేత పెతురాజ్, సత్యదేవ్ ల పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నివేత థామస్ మరోసారి తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. నివేత పెతురాజ్, సత్యదేవ్ జంట కూడా చక్కగా నటించింది. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. వీళ్ల పెర్ఫార్మెన్స్ లే సినిమాకు హైలెట్. సీరియస్ సీన్స్ లో కూడా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పండించిన కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఇక నివేత థామస్ క్లాసికల్ డాన్స్ సినిమాకు బోనస్ అయింది.

ఇతర నటీనటుల్లో హీరోయిన్ తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, హీరో తండ్రిగా శివాజీరాజా తమ పాత్రలకు న్యాయంచేశారు. సీఐగా హర్షవర్థన్ సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించాడు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ క్రెడిట్ మొత్తం దర్శకుడు వివేక్ ఆత్రేయకే దక్కుతుంది. చాలా నీట్ గా కథ రాసుకున్నాడు. అంతే చక్కగా డైరక్ట్ చేశాడు. ఇవన్నీ పక్కనపెడితే, తను రాసుకున్న పాత్రలకు పెర్ ఫెక్ట్ గా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా అక్కడే సగం సక్సెస్ అయిపోయింది. మిగతా సక్సెస్ ను టెక్నీషియన్స్ అందించారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేశాడు. సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్, ఎడిటర్ రవితేజ కూడా తలో చేయి వేయడంతో సినిమా పెర్ ఫెక్ట్ షేప్ తీసుకుంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.


జీ సినిమాలు రివ్యూ

రిలీజ్ కు ముందు టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన బ్రోచేవారెవరురా మూవీ, రిలీజ్ తర్వాత థియేటర్లలో స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటుంది. మేకర్స్ చెప్పినట్టు నిజంగానే దీన్ని ఏదో ఒక జానర్ కు కట్టిపడేసే సినిమా కాదు. దాన్ని థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి. ఫన్, సస్పెన్స్, థ్రిల్, యాక్షన్, లవ్.. ఇలా అన్నీ ఉన్న సినిమా ఇది.

ఈ తరహా స్క్రీన్ ప్లే తెలుగు సినిమాకు కొత్తకాదు. చక్కగా థ్రెడ్స్ రాసుకొని, ఎక్కడికక్కడ ముడులు విప్పుతూ సాగిపోయే సినిమాలు గతంలో కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికంటే భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకోవడమే బ్రోచేవారెవరురా ప్రత్యేకత. నలుగురు కాలేజీ స్టూడెంట్స్ జీవితాలకు, ఓ సినిమా నేపథ్యాన్ని కనెక్ట్ చేయడం మాములు విషయం కాదు. పేపర్ పై చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ మొత్తం బ్రోచేవారెవరురా సినిమాలో కనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రైటింగ్ కు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడతాయి.

రెండు కథల్ని సమాంతరంగా నడిపించడం చిన్న విషయం కాదు. పైగా ఆ రెండు కథల్ని ఏదో ఒక చోట కలపాలి. ఏమాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ అయినా సినిమా కిచిడీ అయిపోయింది. ఈ విషయంలో దర్శకుడు చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎక్కడా గందరగోళం లేకుండా ఒక్కో ఎపిసోడ్ ను నీట్ గా డిజైన్ చేసుకున్నాడు. పైగా ఎక్కడా ఫన్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో ఓవైపు క్రైమ్ డ్రామా నడుస్తున్నప్పటికీ, ఆడియన్స్ కు కావాల్సిన కామెడీ మాత్రం మరోవైపు నుంచి పుష్కలంగా అందుతుంది.

కానీ కథ రాసుకునే క్రమంలో దర్శకుడు అక్కడక్కడ కొన్ని లెంగ్తీ ఎపిసోడ్స్ రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే పరంగా రన్ టైమ్ ను బాగానే మెయింటైన్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్ లో మాత్రం అక్కడక్కడ గ్రిప్ మిస్సయ్యాడు. దీంతో ఫస్టాఫ్ తో పోలిస్తే, సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఒక్క డ్రాబ్యాక్ మినహాయిస్తే ఈ సినిమాలో అన్ని ప్లస్ పాయింట్సే కనిపిస్తాయి. మంచి కామెడీ, బ్రహ్మాండమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని రకాలుగా సినిమా బాగుంది. ఓవరాల్ గా బ్రోచేవారెవరురా సినిమా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు, అటు యూత్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కింది.

రేటింగ్ 3/5