'బ్రాండ్ బాబు' మూవీ రివ్యూ

Friday,August 03,2018 - 12:30 by Z_CLU

నటీనటులు : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నాడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌

ఎడిటింగ్‌ : ఉద్ధవ్‌ ఎస్‌.బి

ఆర్ట్‌ : మురళి ఎస్‌.వి.

దర్శకత్వం : ప్రభాకర్ పి

నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు

బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌

మ్యూజిక్ : జేబి

లిరిక్స్ : పూర్ణచెర్రీ

కెమెరామెన్ : కార్తీక్ ఫలణి

ఎడిటర్ : ఉద్ధవ్ ఎస్.బి

సెన్సార్ : క్లీన్-U

రిలీజ్ : ఆగస్ట్ 3, 2018

 

కొత్త హీరో, అప్ కమింగ్ దర్శకుడు, అంతగా పేరులేని బ్యానర్.. ఇలాంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ‘బ్రాండ్ బాబు’ను అంతా పట్టించుకున్నారు. ఎందుకంటే ఇది మారుతి సినిమా. అలా మారుతి బ్రాండ్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘బ్రాండ్ బాబు’ ఎలా ఉందో చెక్ చేద్దాం…. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు. ఈ క్రమంలో తనకొచ్చిన ఓ  మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు.

రాధ కూడా డైమండ్ బాబును ప్రేమిస్తుంది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. తను ప్రేమించింది హోం మినిస్టర్ కూతుర్ని కాదని, పని పిల్లనని తెలుసుకున్న డైమండ్ బాబు కుటుంబంతో సహా ఎస్కేప్ అవుతాడు. అసలు విషయం తెలుసుకున్న రాధ మేనమామ (రాజా రవీంద్ర), డైమండ్ రత్నం కుటుంబంపై సంఘ బహిష్కరణ ప్రకటిస్తాడు. ఆ టైమ్ లో డైమండ్ బాబు కుటుంబానికి సహాయపడుతుంది రాధ. బ్రాండ్స్ అంటే పడిచచ్చే డైమండ్, పనిపిల్ల రాధను అంగీకరించాడా..? చివరికి డైమండ్ రత్నం రాధను తన కోడలిగా స్వీకరించాడా లేదా అనేది సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

సుమంత్ శైలేంద్ర తెలుగు ఆడియన్స్ కు కొత్త. కానీ ఇతడు ఇప్పుడే ముఖానికి రంగేసుకున్న నటుడు మాత్రం కాదు. కన్నడలో హీరోగా అరడజను సినిమాలు చేశాడు. ఆ అనుభవంతో ఇప్పుడు బ్రాండ్ బాబుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. మనుషుల కంటే బ్రాండ్స్ కు విలువనిచ్చే బడా బాబుగా శైలేంద్ర ఆకట్టుకున్నాడు. ఇతడి తండ్రిగా మురళీశర్మ ఎప్పట్లానే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

వీళ్ల తర్వాత చెప్పుకోవాల్సింది రాధ పాత్ర పోషించిన ఈషా రెబ్బా గురించే. పని మనిషిగా సాఫ్ట్ లుక్స్ లో ఈషా ఆకట్టుకుంది. ఈమధ్య కాలంలో తెలుగులో ఇంత సాత్వికమైన పాత్ర రాలేదంటే, రాధ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. హోం మినిస్టర్ కూతురుగా  పూజిత పొన్నాడ ఆకట్టుకుంది. రాధ మేనమామ పాత్రలో రాజా రవీంద్ర ఆకట్టుకున్నాడు. హీరో అసిస్టెంట్స్ వేణు, ఈరోజుల్లో సాయి, రైటర్ పాత్ర పోషించిన సత్యం రాజేష్ కామెడీ పెద్దగా పండలేదు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

స్టార్టింగ్ నుంచి మారుతి సినిమాలకు వర్క్ చేస్తున్న జేబీ, ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు. రీ-రికార్డింగ్ ఫర్వాలేదనిపించాడు. 2 సాంగ్స్ బాగున్నాయి. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. బ్రాండ్ బాబు ఇమేజ్ ను ఇంకాస్త ఎక్కువగా చూపించింది ఈ సినిమాటోగ్రఫీ. ఎడిటర్ ఉద్ధవ్ ను బాగా కంట్రోల్ చేసినట్టున్నారు. అతడికి స్వేచ్ఛనిచ్చి ఉంటే సినిమాలో ఓ 5-6 సన్నివేశాలపై కోతపడేది.

స్టోరీ రైటర్ గా మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. ఎవరూ ఊహించని విధంగా నానిని మతిమరుపు వ్యక్తిగా, శర్వానంద్ ను అతిశుభ్రత హీరోగా చూపించిన మారుతి.. ఈ సినిమాలో శైలేంద్ర కోసం బ్రాండ్స్ బాబు క్యారెక్టర్ రాశాడు. దీంతో పాటు మారుతి అందించిన మాటలు, స్క్రీన్ ప్లే బాగున్నాయి. కీలకమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ పార్ట్ ను మారుతి హ్యాండిల్ చేయడంతో దర్శకుడు ప్రభాకర్ కు చాలా కలిసొచ్చింది. దీనికి తోడు ఇంటర్వెల్ బ్లాక్ ను కూడా మారుతి డైరక్ట్ చేయడంతో ప్రభాకర్ కు మరో పెద్ద పని తప్పింది. మిగతా సినిమా మొత్తాన్ని బాగానే డైరక్ట్ చేశాడు ప్రభాకర్.

జీ సినిమాలు రివ్యూ :

కొన్ని కథలు కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి. అందరికీ నప్పేలా కథలు రాయడం కుదరని పని. కానీ ఎలాంటి ఇమేజ్ లేని స్టోరీలు కూడా ఉంటాయి. అలాంటి స్టోరీలు రాసి, అందులో స్టార్స్ ను ఇరికించడంలో మారుతి దిట్ట. అయితే ఈసారి మాత్రం తన కథకు కొత్త కుర్రాడ్నే పెట్టుకున్నాడు. బౌండెడ్ స్క్రిప్ట్ తో పాటు డైలాగ్స్ కూడా రాసి ప్రభాకర్ కు మెగాఫోన్ అందించాడు. అలా మారుతి మార్క్ తో ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన బ్రాండ్ బాబు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు.

మారుతి సినిమాల్లో ప్రీ-ఇంటర్వెల్ అంతా టైంపాస్ వ్యవహారంలా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఎదురుచూసేలా చేస్తుంది. బ్రాండ్ బాబు కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ కోసం నిరీక్షణ తప్పలేదు. కానీ ఇంటర్వెల్ నుంచి ఎండ్-కార్డ్ వరకు, బ్యాక్ టు బ్యాక్ హార్ట్ టచింగ్ సీన్స్ తో సీట్ లో ప్రేక్షకుడ్ని కట్టిపడేసింది మారుతి-ప్రభాకర్ జోడి.

మరీ ముఖ్యంగా సినిమాలో మారుతి వేసిన లింక్స్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ కు ముందు పెట్టిన పాట బాగున్నప్పటికీ అసందర్భం అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఆ పాట అక్కడెందుకు పెట్టారో అర్థమౌతుంది. హీరోయిన్ ఇచ్చిన నాన్-బ్రాండ్ షర్ట్ ను క్లైమాక్స్ లో హీరో వేసుకుంటాడు. ఇలాంటి లింక్స్ చాలా వరకు క్లిక్ అవ్వడం బ్రాండ్ బాబుకు ప్లస్. హీరోను కేవలం ఓ క్యారెక్టర్ గా చూపించడం, అతడిలో హీరోయిజాన్ని చూపించకపోవడం ఈ సినిమాకు మరో ప్లస్. భారీ బ్యాకప్ ఉన్న సుమంత్ శైలేంద్ర… యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ సాంగ్స్ జోలికి పోకుండా మారుతి చెప్పినట్టు చేశాడు.

బాబుకు బ్రాండ్స్ అంటే తెగ పిచ్చి అనే కాన్సెప్ట్ నుంచి అలా బ్రాండ్స్ మాయలో పడిన కుర్రాడు, హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిపిల్లను ప్రేమించడం వరకు సినిమాలో చక్కగా చూపించారు. తర్వాత హీరోయిన్ ను ఇంప్రెస్ చేసే క్రమంలో పెట్టిన కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టిస్తాయి. ఇక సెకెండాఫ్ లో పెట్టిన సహాయ-నిరాకరణ ఎపిసోడ్ ను మరింత ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఎందుకో అవి రొటీన్ అనిపించాయి.

ఇవన్నీ ఒకెత్తయితే, సినిమాలో బలమైన కాస్టింగ్ లేకపోవడం బ్రాండ్ బాబుకు పెద్ద మైనస్. హీరోను బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ లా చూపించిన దర్శకుడు.. క్యారెక్టర్స్ విషయంలో కూడా కాస్త బ్రాండ్ వాల్యూ ఉన్న నటీనటుల్ని పెట్టుకుంటే సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది. కీలకమైన క్యారెక్టర్లలో కూడా కొత్త ముఖాలు కనిపించేసరికి చాలా సన్నివేశాలు తేలిపోయాయి.

ఈ మైనస్ పాయింట్స్ పక్కనపెడితే.. సెకండాఫ్ మొత్తం సినిమాకు పెద్ద ఎస్సెట్. ఫస్టాఫ్ ను కాస్త భరించగలిగితే సెకెండాఫ్ పైసా వసూల్ అనిపించుకుంటుంది. ఎమోషనల్ కంటెంట్ కనెక్ట్ అయితే బ్రాండ్ బాబు థియేటర్లలో క్లిక్ అయినట్టే.

బాటమ్ లైన్ – “మారుతి బ్రాండ్” బాబు

రేటింగ్ : 2.75/5