బూమరాంగ్ మూవీ రివ్యూ

Friday,January 03,2020 - 12:45 by Z_CLU

నటీనటులు: అధర్వ, మేఘా ఆకాష్, ఇందూజ రవిచంద్రన్, సతీష్‌, ఆర్జే బాలాజీ, ఉపెన్‌ పటేల్‌ తదితరులు
స్క్రీన్ ప్లే: ఆర్‌.కె. సెల్వ
సంగీతం: రధన్
మాటలు – పాటలు: రాజశ్రీ సుధాకర్‌
ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్‌. కుమార్‌
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఆర్‌ కణ్ణన్‌
నిర్మాత: సీహెచ్‌ సతీష్‌కుమార్‌
నిడివి: 129 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: జనవరి 3, 2020

గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు అధర్వ. దీంతో అతడు నటించిన బూమరాంగ్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాతో అధర్వ మరోసారి టాలీవుడ్ అడియన్స్ ను మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

ఫుట్ బాల్ ప్లేయర్ శివ ఓ యాక్సిడెంట్ లో తన ముఖం మొత్తం పోగొట్టుకుంటాడు. అదే టైమ్ లో హాస్పిటల్ చావు బతుకుల మధ్య ఉంటాడు శక్తి. ఇద్దరి పొజిషన్ క్రిటికల్ గా ఉన్న టైమ్ లో శక్తి చనిపోతాడు. శివ మాత్రం బతుకుతాడు. కానీ అతడి ముఖం పూర్తిగా పోతుంది. దీంతో డాక్టర్లు శక్తి ముఖాన్ని తెచ్చి శివకు అతికిస్తారు. అలా సరికొత్త ముఖంతో మళ్లీ బతికిన శివ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రిజెక్ట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ కూడా తిరిగొస్తుంది.

అంతా సాఫీగా సాగిపోతుందనున్న టైమ్ లో శివ జీవితంలో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొంతమంది శివను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొంతమంది అతడ్ని బాగా తెలిసినవాడిగా పలకరిస్తుంటారు. దీంతో శివ అయోమయానికి గురవుతాడు. తనకు పెట్టిన శక్తి ముఖం ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.

ఈ ప్రయత్నంలో శివ తెలుసుకున్న నిజాలేంటి? శక్తి ప్రారంభించిన మిషన్ ను శివ పూర్తిచేస్తాడా లేదా అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు

శివ, శక్తి పాత్రల్లో అధర్వ చాలా బాగా చేశాడు. ఒకటి సరదాగా జోవియల్ గా ఉండే పాత్ర. ఇంకోటి సీరియస్ గా, సమస్యల కోసం పోరాడే పాత్ర. ఎలాంటి మేకోవర్ లేకుండా ఈ రెండు పాత్రల మధ్య తేడాను చూపిస్తూ నటించడంలో అధర్వ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. తండ్రికి (ఒకప్పటి కోలీవుడ్ హీరో మురళి) తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నిజానికి అధర్వ టాలెంట్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. పరదేశి అనే సినిమాతోనే ఇతడి టాలెంట్ ఎంటో అందరికీ తెలిసింది. ఇప్పుడు బూమరాంగ్ లో మరోసారిన తన సహజ నటనతో
ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ మేఘా ఆకాష్ అందంగా ఉంది. యాక్టింగ్ కూడా బాగుంది. కానీ కథకు, ఆమెకు పెద్దగా కనెక్షన్ ఉన్నట్టు అనిపించదు. ఫస్టాఫ్ లో పాటల కోసం, సెకెండాఫ్ లో ఓ చిన్న క్లూ కోసం మాత్రం పనికొచ్చింది. మాయ పాత్రలో ఇందూజ, గోపాల్ పాత్రలో కమెడియన్ సతీష్, ఫ్రెండ్ పాత్రలో ఆర్జే బాలాజీ, సూరజ్ గా ఉపెన్ పటేల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. సినిమాటోగ్రాఫర్ ప్రసన్న కుమార్ వర్క్ మరో హైలెట్. ఫస్టాఫ్ లో వినోదానికి, సెకెండాఫ్ లో సీరియస్ నెస్ కు మధ్య తన కెమెరాతో తేడా చూపించాడు. ఈ విషయంలో ఎడిటింగ్ కూడా కూడా బాగుంది. సైడ్ ట్రాక్స్ కు వెళ్లకుండా కథను 2 గంటల్లో సూటిగా చెప్పాడు.

దర్శకుడు కణ్నన్ ఎంచుకున్న కథ బాగుంది. ఫేస్ ట్రాన్సప్లాంట్ కు రైతు సమస్యలకు ముడిపెడుతూ కథ రాసుకోవడం ఒకెత్తయితే.. ఆ కథలో మంచి ట్విస్టులు పెట్టడంలో కణ్నన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సెల్వ నుంచి ఇతడికి మంచి సపోర్ట్ దక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ

సందేశాత్మక సినిమాలు తీయాలని అందరికీ ఉంటుంది. కానీ ఈ కాలం ఎవరు చూస్తారులే అనే అపోహలో పడిపోతారు. అది నిజమే. రెండున్నర గంటలు కూర్చోబెట్టి మెసేజ్ ఇస్తామంటే ఆడియన్స్ ఒప్పుకోరు. అదే సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ, ఎంటర్ టైన్ మెంట్ కోటింగ్ ఇస్తే కచ్చితంగా చూస్తారు. బూమరాంగ్ సినిమా కూడా అలాంటిదే. రైతుల సమస్యల్ని ఇందులో సీరియస్ గా చర్చించారు. ఆ పాయింట్ కు రావడం కోసం దర్శకుడు తీసుకున్న టర్న్ లు, చూపించిన ట్విస్టులు మెప్పిస్తాయి. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి “ఇక చాలు, ముగించేద్దాం”
అన్నట్టు ఉంటుంది సినిమా.

ఈ సంగతి పక్కనపెడితే రైతుల సమస్యల మీద సినిమాలు తెలుగు జనాలకు కొత్తకాదు. ఖైదీ నంబర్ 150, మహర్షి, రూలర్… ఇలా చెప్పుుకుంటూ పోతే రైతు సమస్యలపై ఈమధ్య చాలా సినిమాలొస్తున్నాయి. దీంతో బూమరాంగ్ లో దర్శకుడు కణ్నన్ ఎత్తుకున్న పాయింట్ కొత్తగా అనిపించదు. సెకెండాఫ్ కాస్త రొటీన్ అనిపించడానికి ఇదొక కారణం. కానీ సరిగ్గా ఇక్కడే దర్శకుడు తన టాలెంట్ ను చూపించాడు. రైతు సమస్యలను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి, ఫేస్-ఆఫ్ ను తెరపైకి తీసుకొచ్చాడు.

ఫేస్ ట్రాన్సప్లాంట్ ను ముందుగా చూపించడంతో సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. సినిమా కూడా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక అక్కడ్నుంచి మలుపులు తీసుకొని రైతుల సమస్యవైపు మళ్లడం అనేది సరైన ఎత్తుగడ. కాకపోతే ఈ పాయింట్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. ఏకంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఈ కాన్సెప్ట్ తో ఎవడు అనే సినిమా చేశాడు. కాకపోతే ఎంటర్ టైన్ మెంట్ పండడంతో ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. సెకెండాఫ్ నుంచి అసలైన కథ మొదలవుతుంది.

ఫస్టాఫ్, సెకెండాఫ్ లో ఇలా తెలిసిన పాయింట్లే ఉన్నప్పటికీ దర్శకుడు ఫస్టాఫ్ ను ఫన్ తో, సెకెండాఫ్ ను మంచి స్క్రీన్ ప్లే, ట్విస్టులతో నడిపించడంతో బూమరాంగ్ ఓసారి చూడదగ్గ సినిమాగా నిలిచింది. అయితే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన మేఘా ఆకాష్ కు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి, కథలో లింక్ చేసినట్టయితే బాగుండేది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో అలాంటి ప్రయత్నం ఏమీ కనిపించలేదు.

ఉన్నంతలో ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ మేజర్ హైలెట్స్ కాగా.. టెక్నికల్ గా రథన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రసన్నకుమార్ సినిమాటోగ్రాఫీ మెచ్చుకోదగ్గ విధంగా ఉన్నాయి. అన్నింటికీ మించి 2 గంటల 10 నిమిషాల్లోనే ముగించడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

సరిగ్గా 2 రోజుల కిందటొచ్చిన అరడజను సినిమాలతో పోలిస్తే.. ఈరోజు థియేటర్లలోకొచ్చిన బూమరాంగ్ చాలా బెటర్. ఇంకా చెప్పాలంటే న్యూ ఇయర్ లో మంచి కంటెంట్ తో వచ్చిన మొదటి సినిమా ఇదే.

రేటింగ్ 2.5/5