'బ్లఫ్ మాస్టర్' మూవీ రివ్యూ

Friday,December 28,2018 - 01:38 by Z_CLU

న‌టీన‌టులు : సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌ త‌దిత‌రులు.

క‌థ‌ : హెచ్‌.డి.వినోద్‌

సంగీతం: సునీల్ కాశ్యప్

కెమెరా: దాశరధి శివేంద్ర

సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్

నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై

మాటలు -ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి

రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2018

 

నాలుగేళ్ల క్రితం తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన ‘శతురంగ వేట్టై’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గోపి గణేష్ డైరెక్షన్ లో సత్య దేవ్ హీరోగా నటించిన ఈ సినిమా బెస్ట్ రీమేక్ అనిపించుకుందా…? తమిళ్ లో ఘన విజయం సాదించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందా.. ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

మోసానికో పేరు పెట్టుకొని జనాలను బురుడి కొట్టిస్తూ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అంటూ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తమ్ కుమార్(సత్య దేవ్) ఎంతో మందిని మోసం చేస్తూ వేషాలు, ఊర్లు మారుస్తూ తిరుగుతుంటాడు. అయితే విశాఖపట్నంలో గోల్డ్ వే పేరుతో ఓ ప్రొడక్ట్ అమ్మకం సంస్థని ఏర్పాటు చేసి అందరి దగ్గర డబ్బు దన్నుకుంటాడు.ఈ క్రమంలో తను పరిచయమైన అవని( నందిత శ్వేత) సహాయంతో మరింత మందిని మోసం చేసి అక్కడి నుండి పరారవుతాడు. మూడు నెలల తర్వాత మరో వ్యక్తిని మోసం చేస్తుండగా పోలీస్ లకు చిక్కుతాడు. అలా జైల్లో అడుగు పెట్టి ఆ తర్వాత కోర్టు మెట్లెక్కిన ఉత్తమ్ కుమార్ ఎన్నో కేసుల్లో కూరుకుపోతాడు. చివరికి ఆ కేసుల నుండి తప్పించుకొని ఓ లోకల్ రౌడీ గ్యాంగ్ కి చిక్కుతాడు. వాళ్ళతో కలిసి మళ్లీ మోసాలు మొదలేడతాడు. ఉత్తమ్ కుమార్ అసలెందుకు మోసాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. చివరికి ఉత్తమ్ కుమార్ తను చేసిన మోసాల ద్వారా ఏం తెలుసుకున్నాడు. మళ్లీ అవనితో కలిసి కొత్త జీవితాన్ని కొనసాగించిన ఉత్తమ్ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి… అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

ఇప్పటికే కొన్ని క్యారెక్టర్స్ తో తన టాలెంట్ ఏంటో నిరుపించుకున్న సత్య దేవ్ హీరోగా తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. చాలా సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో అదుర్స్ అనిపించాడు. నందిత శ్వేత హీరోయిన్ గా ఆకట్టుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో ఆమె నటన కాస్త అతి అనిపించింది. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పరవాలేదనిపించుకుంది. ధన్ శెట్టిగా పృథ్వి కామెడీ కొంత వరకూ నవ్వించింది. క్లైమాక్స్ లో బసవ క్యారెక్టర్ లో వంశీ మెప్పించాడు. ఆదిత్యా మీనన్ , సిజ్జు , దిల్ రమేష్, కృష్ణ చైతన్య మిగతా నటీ నటులు వారి క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సునీల్ కాశ్యప్ మ్యూజిక్ బాగుంది. రెండు పాటలు పరవాలేదు అనిపించాయి. కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫీ మీద తనకున్న అవగాహనతో అతని నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నాడు దర్శకుడు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాగుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ కథకి తగిన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వేసిన ఇంటి సెట్ బాగుంది. సినిమాలో కొన్ని సందర్భాల్లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంతెక్కువ ఉంటే అంత విలువ ఎలాగైనా డబ్బులు మనం సంపాదించాలి. తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది’.,’ధనవంతుడు కష్టాలు వచ్చినప్పుడు ఏడవడు, డబ్బుతో కొడతాడు.’,  ‘కోడి మీద జాలిపడితే చికెన్ 65 ఎలా తినగలం.’,’బట్టలన్నాక మాసిపోవడం మనుషులన్నాక మోసపోవడం ఖాయం’, ‘నేచర్ బ్యాలెన్స్ తప్పినా, మనిషి బ్యాలెన్స్ తప్పినా ఇలాంటి వినాశకాలే జరుగుతాయి.’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు హెచ్‌.వినోద్‌ కథకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు గోపి గణేష్. అభిషేక్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఒక భాషలో ఓ సినిమా హిట్టయిందంటే వెంటనే ఆ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయడం సహజమే.. అయితే తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన ‘శతురంగ వేట్టై’ సినిమా మాత్రం నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు తెలుగులో రీమేక్ సినిమాగా విడుదలైంది. అయితే ఆల్రెడీ హిట్టయిన సినిమాను డీల్ చేయడం దర్శకుడికి సులువే. కాకపోతే ఆ సినిమా సోల్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ మన నేటివిటీకి తగ్గట్లుగా రీమేక్ చేయగలగాలి.  సరిగ్గా ఇక్కడే గోపి గణేష్ తడబడ్డాడు.

తమిళ్ తో పోలిస్తే చాలా సన్నివేశాలు రియాలిటీకి దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఊర్లు మారుస్తూ హీరో మోసం చేసే సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాకి కీ ఎలిమెంట్ అయిన స్కాం తాలుకు సన్నివేశాలు ఆడియన్స్ పై పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.

పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో సత్య దేవ్ చాలా సందర్భాల్లో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేసాడు. నిజానికి సత్య దేవ్ నటనే సినిమాకు మెయిన్ హైలైట్. నందిత శ్వేత సత్యకి గట్టి పోటీ ఇస్తుందనుకుంటే డీలా పడిపోయింది.  దర్శకుడు గోపి గణేష్ అంతా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసినా ఎక్కడో తేడా కొట్టింది. ముఖ్యంగా తమిళ్ సినిమాలో హైలైట్ అనిపించిన సన్నివేశాలు ఇక్కడ పండలేదు. ఆ సన్నివేశాలు ఇంకా బెటర్ గా వర్కౌట్ చేసుంటే  బాగుండేది.

సినిమా ఆరంభంలో, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ మరీ నెమ్మదిగా సాగడం బోర్ కొట్టిస్తుంది. ఓవర్ ఆల్ గా బ్లఫ్ మాస్టర్ జస్ట్ పరవాలేదనిపించే క్రైం డ్రామా. తమిళ్ సినిమా చూసిన వారికి మాత్రం అసంతృప్తి తప్పదు.

రేటింగ్ : 2 / 5