'భేతాళుడు' రివ్యూ

Thursday,December 01,2016 - 04:39 by Z_CLU

విడుదల : డిసెంబర్ 1, 2016

నటీనటులు : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్

సంగీతం : విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ : ప్రదీప్ కలిపురయత్

ఎడిటర్ : వీరసెంథిల్

సమర్పణ : ఎం.శివకుమార్

నిర్మాణం : మానస్ రిషి ఎంటర్ ప్రైజస్, విన్.విన్.విన్. క్రియేషన్స్

నిర్మాతలు : కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్

దర్శకత్వం : ప్రదీప్ కుమార్

సరికొత్త కథాంశం, కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఉన్న పర్ ఫెక్ట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ వంటి గ్రాండ్ హిట్ తరువాత నటించిన చిత్రం ‘భేతాళుడు ’. విడుదలకి ముందే ట్రైలర్స్, 10 నిమిషాల పాటు సీన్స్ తో అందరిలో ఆసక్తి కనబరిచిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ? చూద్దాం.

bhetaludu

కథ :-

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే దినేష్(విజయ ఆంటోనీ) ఒక అనాధ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఐశ్వర్య(అరుంధతి నాయర్) ను పెళ్లిచేసుకుంటాడు. పెళ్ళైన తరువాత దినేష్ కు ఓ భయంకరమైన గొంతు వినపడుతూ వేధిస్తుంది.. గతజన్మ కు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావడం. జయలక్ష్మి అనే మహిళ తనను గత జన్మలో చంపిందంటూ ఆ గొంతుతో వినబడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ గొంతు ఎవరిది? ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్న తరువాత దినేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? అసలు జయలక్ష్మి ఎవరు? గతజన్మలో దినేష్ ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

నటీనటుల పనితీరు :-

విజయ ఆంటోనీ నటన సినిమాకు పెద్ద హైలైట్. రెండు విభిన్న పాత్రలతో సినిమా అంతా తన భుజాలపై నడిపించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ‘భేతాళుడు’ గా విజయ్ ఆంటోనీ అదరగొట్టేసాడు. ఇక అరుంధతి నాయర్ తన పాత్రతో ఆకట్టుకుంది. చారు హాసన్, మీరా కృష్ణన్, వై.జి.మహేంద్ర, సిద్దార్థ శంకర్, కమల్ కృష్ణ, మురుగదాస్, విజయ్ సారధి, కిట్టి రెమియా నంబీశన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. తెలుగు ప్రేక్షకులకు వీళ్లంతా పెద్దగా పరిచయం లేకపోయినా… ప్రేక్షకుడు కథలో లీనమైపోవడంతో పాత్రలు మాత్రమే తెరపై కనిపిస్తాయి.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు కేవలం నటుడిగానే కాకుండా టెక్నీషియన్ గా కూడా హైలైట్ గా నిలిచాడు విజయ్ ఆంటోనీ. తన ఆర్.ఆర్ తో సినిమా ను ఆసక్తికరంగా నడిపించి సంగీత దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇలాంటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఇంపార్టెంట్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోతే టోటల్ సినిమానే తేడాకొట్టేసి ఉండేది. ఆ విషయంలో విజయ్ ఆంటోనీకి ఫుల్ మార్కులు పడతాయి. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోరే సినిమాను నిలబెట్టింది. ప్రదీప్ కలిపురయత్ సినిమాటోగ్రఫీ బాగుంది. భాష శ్రీ మాటలు, సాహిత్యం బాగున్నాయి. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

bhetaludu-2
జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో ‘నకిలీ’, ‘డాక్టర్ సలీం’ వంటి విభిన్న సినిమాలతో హీరోగా గుర్తింపు అందుకొని ‘బిచ్చగాడు’ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ మరోసారి అలాంటి విభిన్న కథాంశం, స్క్రీన్ ప్లే తో ‘భేతాళుడు’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ భేతాళుడుగా తనలోని యాక్టింగ్ టాలెంట్ ను మరోసారి చూపించాడు. టైటిల్స్ నుంచి ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా కథను నడిపించిన దర్శకుడు ప్రదీప్… రెండో భాగంలో కథను కాస్త రొటీన్ ఫార్మాట్ లోకి తీసుకెళ్లాడు. అప్పటివరకూ ఏం జరగబోతుందని ఆసక్తి గా ఎదురుచూసిన ప్రేక్షకుడు రెండో భాగం లో కాస్త రొటీన్ గా ఫీలవుతాడు. ఫస్టాఫ్ లో గత జన్మల గురించి చెప్తూ కథను నడిపించి రెండో భాగంలో ఓ మాఫియా ను టార్గెట్ చేయడంతో రెండు కథల్ని ఒకే సినిమాలో ఇరికించినట్టయింది. మొదటి 15 నిమిషాల ఎపిసోడ్, మరికొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, గతజన్మకు సంబంధించిన సీన్లు సినిమాకు పెద్ద హైలెట్ గా నిలుస్తాయి. విజయ్ ఆంటోనీ భేతాళుడిగా మారిన సన్నివేశాలు, జయలక్ష్మి ని వెతికే సన్నివేశాలు, ఆర్.ఆర్ సినిమాకు ప్రాణంపోశాయి. ప్రమోషన్ నుంచే తమ సినిమా హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని చెప్పి, విజయ్ ఆంటోనీ మంచిపని చేశాడు. సో… ప్రేక్షకుడు ముందే తన మైండ్ సెట్ ను ట్యూన్ చేసుకొని థియేటర్ లోకి వెళ్తున్నాడు. థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారిని ఈ సైకలాజికల్ థ్రిల్లర్ భేతాళుడు గ్యారెంటీగా ఎట్రాక్ట్ చేస్తాడు.

 

రేటింగ్ : 3/5