'భీష్మ' మూవీ రివ్యూ

Friday,February 21,2020 - 02:04 by Z_CLU

నటీ నటులు : నితిన్ , రష్మిక, అనంత్ నాగ్ , బ్రహ్మాజీ , వెన్నెల కిశోర్ తదితరులు

సంగీతం : సాగర్ మహతి

ఛాయాగ్రహణం : సాయి శ్రీరాం

నిర్మాణం : సితార ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : నాగ వంశీ

రచన -దర్శకత్వం : వెంకీ కుడుముల

విడుదల తేది : 21 ఫిబ్రవరి 2020

 

నితిన్ ని సింగిల్ ఫర్ ఎవర్ అనే క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ‘భీష్మ’ సినిమా తీసాడు వెంకీ కుడుముల. మరి ఈ సినిమాతో నితిన్ కి హిట్ అందించాడా లేదా జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ ఒక్క అమ్మాయి కూడా ప్రేమలో పడట్లేదనే బాధతో ఉండే భీష్మ(నితిన్) తొలి చూపులోనే చైత్రను చూసి ప్రేమలో పడతాడు. తన కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకుంటాడు. ఇదే క్రమంలో తన కూతురుని ప్రేమిస్తున్నాడని భీష్మ అండ్ ఫ్యామిలీ మీద ఫైర్ అవుతాడు ఏసీపీ దేవ(సంపత్ రాజ్) … ఈ క్రమంలో భీష్మ సాదారణ వ్యక్తి కాదని, భీష్మ ఆర్గానిక్ కంపెని ఏండీ భీష్మ(అనంత్ నాగ్) మనవడని తెలుస్తుంది.

వెంటనే భీష్మను తన కంపెనీకి కొత్త సీ.ఈ.ఓ గా అందరికీ పరిచయం చేస్తాడు భీష్మ ఆర్గానిక్ కంపెని ఏం.డి భీష్మ. అదే సమయంలో భీష్మ కంపెనీ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటాడు ఫీల్డ్ సైన్స్ కంపెని అధినేత రాఘవన్(జిషు సేన్ గుప్తా). అయితే తన బలంతో రాఘవన్ వేసే ఎత్తులన్నీ చిత్తు చేస్తుంటాడు భీష్మ. ఫైనల్ గా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అందరూ బాగుండాలని కాంక్షతో ఆర్గానిక్ కంపెనీ పెట్టిన భీష్మ లక్ష్యాన్ని కుర్ర భీష్మ ఎలా చేరుకున్నాడనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

చాలా రోజుల తర్వాత నితిన్ తనలోని కామెడీ టైమింగ్ బయటపెట్టి ఆకట్టుకున్నాడు. మునుపటి జోష్ తో ఫైట్స్ , డాన్సులతో మెప్పించాడు. ముఖ్యంగా భీష్మ క్యారెక్టర్ కి హీరోగా పర్ఫెక్ట్ అనిపించుకొని హైలైట్ గా నిలిచాడు. రష్మిక తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు ప్లస్ అయింది. అనంత్ నాగ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. జిషు సేన్ గుప్తా స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు.

వెన్నెల కిశోర్ తన డైలాగ్ కామెడీతో నవ్వించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. నరేష్, శుభలేఖ సుధాకర్, సంపత్ రాజ్, సుదర్శన్, సత్య, అజయ్, నర్రా శ్రీనివాస్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

కంటెంట్ ఎంత బాగున్నా టెక్నికల్ గా కూడా అన్నీ కుదిరితేనే సినిమా అవుట్ పుట్ బాగా వస్తుంది. భీష్మకు టెక్నికల్ గా కూడా బలం చేకూరింది. ముఖ్యంగా సాయి శ్రీరామ్ కెమెరా వర్క్, మహతి స్వర సాగర్ మ్యూజిక్ బాగా కలిసొచ్చాయి. సాగర్ మహతి అందించిన సాంగ్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా డ్రాగ్ అనిపించకుండా ట్రిమ్ చేసాడు. వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి. వాట్టే బ్యూటీ సాంగ్ కి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ బాగుంది. ఆ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ‘సింగిల్ ఆంథెమ్’ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. ఆ పాటను రెట్రో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన  విధానం ఆకట్టుకుంది.

వెంకీ కుడుముల డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాను నిలబెట్టాయి. సితార ఎంటర్టైన్ మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

మొదటి సినిమా ‘ఛలో’తోనే తన టాలెంట్ నిరూపించుకున్న వెంకీ కుడుముల మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటాడు. ప్రారంభంలో ఎక్కడా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోయాడు. తను చెప్పాలనుకున్న సేంద్రీయ వ్యవసాయం పాయింట్ తో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా కథకు సరైన హీరోను ఎంచుకొని అక్కడే సగం విజయం సాదించాడు.

నితిన్ లోని కామెడీ టైమింగ్ ను సరిగ్గా వాడుకుంటూ మిగతా క్యారెక్టర్స్ తో ఫన్ క్రియేట్ చేసి మెప్పించాడు దర్శకుడు. ఒక పాత కథను ఇప్పుడున్న ట్రెండ్ కి కనెక్ట్ అయ్యేలా చెప్తూ తన రైటింగ్ తో స్క్రీన్ మీద మేజిక్ చేసాడు. సినిమా గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తన బలమైన కామెడీని సరిగ్గా వాడుకొని ప్రేక్షకుడిని నవ్వించాడు. తన మొదటి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ నే ఈ సినిమాకు కూడా రిపీట్ చేసి వారి నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నాడు. ముఖ్యంగా సినిమాకు సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ బాగా కలిసొచ్చాయి. సాయి శ్రీరామ్ తన కెమెరా వర్క్ తో సినిమాను అందంగా తీర్చిదిద్దితే సన్నివేశాలకు బలం చేకూర్చే సంగీతం అందించి మహతి స్వర సాగర్ ఇంకా బలం చేకూర్చాడు.

సేంద్రీయ వ్యవసాయం అనే పాయింట్ ను స్ట్రాంగ్ గా టచ్ చేయకుండా లైట్ గా చూపించి దాని చుట్టూ ఎంటర్టైన్ మెంట్ ను అల్లి, వెంకీ సినిమాను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా కోసం ఇతర భాష నటులు అనంత్ నాగ్ తో పాటు జిషు సేన్ గుప్తాను తీసుకొని ఆ క్యారెక్టర్స్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. లవ్ ట్రాక్ రొటీన్ అనిపించినా నితిన్, రష్మిక కెమిస్ట్రీతో వర్కౌట్ చేసాడు వెంకీ. వారిద్దరి కెమిస్ట్రీ పండటంతో కథలో లవ్ ట్రాక్ కూడా పాస్ అయిపొయింది. సినిమాలో మీమ్స్ క్రియేటర్ గా నితిన్ క్యారెక్టర్ ను పరిచయం చేసిన దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో మీమ్స్ తో వచ్చే లైన్స్ తో మంచి కామెడీ పండించి ఎంటర్టైన్ చేసాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ సీన్స్ కూడా బాగా పండాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఇచ్చిన ట్విస్ట్, ఆఫ్టర్ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ లు మెప్పిస్తాయి.

రెండో భాగంలో పల్లెటూర్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ నిలిచింది. ఈ మధ్య నితిన్ ను సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చూస్తూ నీరసపడ్డ ఫ్యాన్స్ కి ఆ యాక్షన్ ఎపిసోడ్ కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలాగే లాస్ట్ సాంగ్ లో నితిన్, రష్మిక డాన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి. స్టార్టింగ్ లో కొన్ని త్రెడ్స్ కి సంబంధించి క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ బాగుంది.  ఫైనల్ గా ‘భీష్మ’ రొమాంటిక్ కామెడీగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3.25 / 5