'భీమ్లా నాయక్' మూవీ రివ్యూ

Friday,February 25,2022 - 12:14 by Z_CLU

నటీ నటులు : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్ , రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు

సంభాషణలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్

ఛాయాగ్రాహకుడు : రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్ : నవీన్ నూలి

ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్

స్టంట్స్ : విజయ్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత:సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం: సాగర్ కే చంద్ర

నిడివి : 142 నిమిషాలు

విడుదల తేది : 25 ఫిబ్రవరి 2022

‘వకీల్ సాబ్’ తర్వాత పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో ‘భీమ్లా నాయక్‘ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్. అయ్యప్పనుమ్ కొషియం కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా కూడా పవన్ కి జత అయ్యాడు. మరి పవర్ స్టార్ ఈ సినిమాతో పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

అటవీ ప్రాంతంలో SI గా పనిచేసే భీమ్లా నాయక్ ( పవన్ కళ్యాణ్ ) చెందిన మాజీ మంత్రి కొడుకు డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) ని అక్రమ మద్యం రవాణా కేసులో అరెస్ట్ చేస్తాడు. కానీ అతను మాజీ మంత్రి కొడుకు అని తనకి పొలిటికల్ సపోర్ట్ ఉందని తెలుసుకొని స్టేషన్ లో కంఫర్ట్ ఇస్తాడు. ఊహించని విధంగా తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడంతో హర్టయిన డానియల్ భీమ్లా నాయక్ పై పగ పెంచుకొని ఎలాగైనా అతన్ని దెబ్బ తీసి పోలీస్ జాబ్ పోగొట్టాలని ప్లాన్ చేస్తాడు.

అలా భీమ్లా ని దెబ్బకొట్టాలని డిసైడ్ అయిన డానియల్ తనపై పెట్టిన కేసులో జైలుకి వెళ్ళడం బయటికొచ్చాక భీమ్లా నాయక్ వేరే కేసులో ఇరికించి అతన్ని కూడా జైలుకి పంపడం జరుగుతుంది. అక్కడి నుండి ఒకరిపై మరొకరు పై చేయి సాధిస్తూ డీ అంటే డీ అంటూ ఇద్దరూ ముందుకెళ్తారు. అహంకారానికి , ఆత్మాభినానికి జరిగే ఈ యుద్ధంలో చివరికి గెలిచిందెవరు ? అనేది మిగతా కథ.

bheemla nayak pawan

నటీ నటుల పనితీరు :

పవర్ స్టార్ ఖాకి డ్రెస్ వేస్తే పూనకం వచ్చేస్తుంది. దానికి ఇంటెన్స్ జోడించి పవన్ నటిస్తే ఇక చెప్పేదేముందు ప్రేక్షకుడు మెస్మరైజ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే పోలీస్ పాత్రలతో మెప్పించిన పవన్ మరోసారి భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో మేజిక్ చేశాడు. ముఖ్యంగా హై ఇంటెన్స్ తో కూడిన పవన్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. డానియల్ శేఖర్ పాత్రలో రానా ఒదిగిపోయాడు. అహంకారి పాత్రలో అదరగొట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో పవన్ కి ధీటుగా నటించాడు. నిత్యా మీనన్ ఎప్పటిలానే తన క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో సంయుక్త మీనన్ ఆకట్టుకుంది.

సముత్రఖని , మురళి శర్మ , తనికెళ్ళ భరణి, రావు రమేష్, రఘుబాబు, శత్రు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటుడు పమ్మి సాయికి ఇంపార్టెన్స్ ఉన్న సన్నివేశాలు దక్కాయి. సునీల్ , హైపర్ ఆది కేవలం టైటిల్ సాంగ్ లో మెరిశారు. మిగతా నటీ నటులంతా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ సినిమాకయినా టెక్నికల్ సపోర్ట్ సంపూర్ణంగా అందితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. భీమ్లా నాయక్ కి మంచి టెక్నికల్ సపోర్ట్ అందిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించి. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. కొన్ని సీక్వెన్స్ లకు తమన్ అందించిన నేపథ్య సంగీతం రోమాలు నిక్కపొడిచేలా చేశాయి. సినిమాకు సంబంధించి తమన్ తన మ్యూజిక్ తో బ్యాక్ బోన్ లా నిలిచాడు.

తమన్ తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో టెక్నిషియన్ రవి కే చంద్ర. తన విజువల్స్ తో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. సినిమాను పర్ఫెక్ట్ రన్ టైంకి సెట్ చేయడం ప్లస్ పాయింట్. విజయ్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అక్కడక్కడా వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. సాగర్ కె చంద్ర దర్శకుడిగా ఈ రీమేక్ ని పర్ఫెక్ట్ హ్యాండిల్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Pawan-Kalyan-BheemlaNayak-Mania-started-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

రీమేక్ అనేది సేఫ్ గేమ్ పర్ఫెక్ట్ గా డీల్ చేస్తే సక్సెస్ అందుకోవడం సులువే. కానీ కొన్ని స్టోరీ లైన్స్ హ్యాండిల్ చేయడం కష్టం. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. ఏ మాత్రం అటు ఇటు అయినా తేడా కొట్టేస్తుంది. కానీ ఈ రీమేక్ ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు టీం. దర్శకుడు సాగర్ కే చంద్ర కి సపోర్ట్ గా నిలుస్తూ మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే -మాటలు అందించడం ‘భీమ్లా నాయక్’ కి బాగా కలిసొచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులు సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ లాంటి స్టార్ తో ఎలాంటి డైలాగ్స్ చెప్పిస్తే బాగుంటుందో త్రివిక్రమ్ కి బాగా తెలుసు కనుక సంభాషణల పరంగా కూడా సినిమాకు అడ్వాంటేజ్ అయ్యాడు మాటల మాంత్రికుడు.

రాజకీయ నేపథ్యం ఉన్న అహంకారి గల కుర్రాడికి , నిజాయితిగా వృత్తి చేస్తూ ఆత్మాభిమానం ఉన్న పోలీస్ కి మధ్య జరగిన ఓ యుద్ధం తాలూకు కథతో ఇలాంటి సినిమాను తీయడ కష్టం. దీనికి చాలా హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది రీమేక్ కాబట్టి రైటర్ గా త్రివిక్రమ్ కి దర్శకుడిగా సాగర్ కే చంద్ర సగం బరువు తగ్గిందనుకోవాలి. కేవలం రెండు సినిమాలు చేసిన అనుభవంతో ఈ క్రేజీ రీమేక్ ని బాగానే హ్యాండిల్ చేశాడు సాగర్ కే చంద్ర. పవన్ కళ్యాణ్ ని మరింత పవర్ ఫుల్ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ని అలరించాడు. అలాగే పవన్ -రానా మధ్య వచ్చే కొన్ని ఎమోషన్స్ ని ఇంటెన్స్ సీన్లను బాగా తెరకెక్కించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడు సాగర్.

ఇక సినిమా ఆరంభంలో కొంత సేపు నెమ్మదిగా సాగినప్పటికీ పవన్ , రానాలు ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేశారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా పరుగులు పెట్టింది. ఎగ్జైట్ చేసే స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ -నిత్యా మీనన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ లో పవన్ -రానా మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక రిలీజ్ కి ముందు ఒక ఊపు ఊపేసిన టైటిల్ సాంగ్ మాత్రం విజువల్ గా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ సాంగ్ కోసం చాలా మంది డాన్సర్లను దింపారు.. భారీ సెట్ క్రియేట్ చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా సాంగ్ కి కొరియోగ్రఫీ కుదరలేదు. అలాగే పవన్ -నిత్యా మీనన్ మధ్య ఉండే రొమాంటిక్ మెలోడీ సాంగ్ కి కూడా సినిమాలో స్కోప్ లేదనుకున్నారో లేదా నిడివి పెంచడం ఎందుకు అనుకున్నారో ఆ సాంగ్ ని ఎడిటింగ్ రూమ్ కే పరిమితం చేశారు. అది కూడా ప్రేక్షకులకు ఓ చిన్న నిరాశే. ఆ సాంగ్ ఏదో ఒక సందర్భంలో పెట్టి ఉండాల్సిందనిపించింది. ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ చూస్తూ ఈ కథకి ఎండింగ్ ఏంటి ? వీరిద్దరి మధ్య యుద్ధం ఆగేది ఎప్పుడు అనే ప్రేక్షకుడి క్వశ్చన్ కి ప్రాపర్ గా ఎండింగ్ ఇచ్చారు. ఫ్లాష్ బ్యాక్ తాలూకు సన్నివేశాన్ని లీడ్ గా తీసుకొని క్లైమాక్స్ డిజైన్ చేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా చిన్నగానే పెట్టుకున్నారు. ఫైనల్ గా ‘భీమ్లా నాయక్’ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుడిని కూడా మెప్పించాడు.

రేటింగ్ : 3/5