'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ

Friday,December 06,2019 - 12:20 by Z_CLU

నటీ నటులు : శ్రీనివాస్ రెడ్డి , శకలక శంకర్ , సత్య, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్,నవీన్ నేని తదితరులు

సంగీతం : సాకేత్ కొమదూరి

ఛాయాగ్రహణం : భరణి కె ధరణి

కథ – మాటలు -స్క్రీన్ ప్లే : పరం సుర్యాన్షు

నిర్మాత‌ – దర్శకత్వం -నిర్మాత : శ్రీనివాస్ రెడ్డి

విడుదల తేది : 6 డిసెంబర్ 2019

 

ఎన్నో కామెడీ పాత్రలతో ఎంటర్టైన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా మారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా తీశాడు. కమెడియన్స్ అందరూ కలిసి నటించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది ? శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

ఎప్పటికైనా గొప్ప నటుడు అవ్వాలనుకునే శ్రీను (శ్రీనివాస్ రెడ్డి) తన మిత్రులు జోజో(సత్య),పీటర్ (శకలక శంకర్) లతో కలిసి షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉంటాడు. అలా యూ ట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే శ్రీనుకి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు కూడా ఉంటుంది. అలా కొన్న టికెట్ తో 2 కోట్లు విలువ చేసే లాటరీ గెలుచుకుంటాడు శ్రీను. కానీ ఆ సమయానికి రెండు కోట్ల విలువగల టికెట్ మిస్ అవుతుంది. మిస్ అయిన ఆ టికెట్ కోసం వెతికే క్రమంలో జర్నలిస్ట్ కోకిల ఈ వీరి జీవితంలోకి వస్తుంది. మరో వైపు డ్రగ్స్ సప్లై చేసే కోబ్రా(చిత్రం శ్రీను) అండ్ టీం జర్నలిస్ట్ కోకిలను వెతుకుతూ ఉంటుంది. చివరికి ఈ చిక్కు ముడులన్నీ విప్పి పోలీస్ గా స్వతంత్ర కుమార్ (వెన్నెల కిషోర్) ఎలా డ్రగ్ మాఫియాను పట్టుకున్నాడనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

శ్రీనివాస్ రెడ్డి , శకలక శంకర్ , సత్య ఎప్పటిలాగే తమ పాత్రలకు న్యాయం చేసారు. కాకపోతే క్యారెక్టర్స్  లో ఎక్కువ ఫన్ లేకపోవడం, కామెడీ సన్నివేశాలు పేలవంగా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బ్రతుకు ఎడ్ల బండి ఎపిసోడ్ లో శకలక శంకర్ , రసగుల్లా తిని అవస్థలు పడే సన్నివేశంలో సత్య ఓ మోస్తరుగా నవ్వించారు. ఇక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిషోర్ స్వతంత్ర కుమార్ పాత్రకు పూర్తి న్యాయం చేసారు. రఘు బాబు తన పాత్రతో కొంత వరకూ నవ్వించే ప్రయత్నం చేసారు. ‘ఝాన్సీ, ప్రవీణ్ పరవాలేదనిపించుకున్నాడు.

చిత్రం శ్రీను పాత్ర అటు సీరియస్ గా లేక ఇటు కామెడీ గా లేక అటు ఇటు కాకుండా ఉంది. సుమన్ శెట్టి , సత్యం రాజేష్ పాత్రలు కామెడీ పండించకపోగా విసుగు తెప్పించాయి. గెటప్ శ్రీను తదితరులు కేవలం గెస్ట్ రోల్స్ లో కనిపించి నవ్వించలేకపోయారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

భరణి కె ధరణి సినిమాటోగ్రఫీ పరవాలేదు.సినిమాలో వచ్చే సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో సాకేత్ కొమదూరి సంగీతం ఆకట్టుకోలేదు. పరం సుర్యాన్షు అందించిన కథ-కథనం రొటీన్ అనిపించాయి. అందువల్ల సినిమా పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. ఇక దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందించలేకపోయాడు. ఆర్టిస్టుల నుండి బెస్ట్ రాబట్టుకోవడంలోనూ వారిని సరిగ్గా వాడుకోవడంలోనూ విఫలం అయ్యాడు. మిగతా వారందరూ తమ వర్క్ తో జస్ట్ పరవాలేదనిపించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ అనిపించాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

ఎన్నో పాత్రలు చేసిన ఓ నటుడు మెగా ఫోన్ పట్టబోతున్నాడంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ చేసాడనగానే ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ మీద కూడా ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. కానీ ఓ సాదా సీదా కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చి దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్స్ అందరి సపోర్ట్ తో సినిమాను తెరకెక్కించిన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళల్లో ఎవరినీ సరిగ్గా వాడుకోలేకపోయాడు. సత్య , శకలక శంకర్ పాత్రల ద్వారా వచ్చే కామెడీ మాత్రమే సినిమాకు అంతో ఇంతో బలం చేకూర్చాయి. కామెడీ సినిమాలకు క్యారెక్టర్స్ , సన్నివేశాలు చాలా బలంగా ఉండాలి. అప్పుడే కథలో కామెడీ పుట్టి ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. జంధ్యాల , ఈ.వి.వి లు సక్సెస్ అయింది కూడా అలాగే. కానీ శ్రీనివాస్ రెడ్డి అండ్ టీం అవేవి దృష్టిలో పెట్టుకోకుండా ఓ రొటీన్ స్టోరీకి ఎగ్జైట్ అయ్యి సినిమా చేసినట్టుంది.

నిజానికి పరం సుర్యాన్షు అందించిన రొటీన్ స్టోరీ – స్క్రీన్ ప్లే తీసుకొని ఈ సినిమా చేయడమే శ్రీనివాస్ రెడ్డి చేసిన అతి పెద్ద మిస్టేక్. ఇలా కాకుండా ఓ సరదా కామెడీతో కథ రాసుకొని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో సినిమా చేసి ఉంటే బాగుండేది. సినిమా ప్రారంభం నుండే శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ కూడా వీక్ అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా షార్ట్ ఫిలింస్ ను గుర్తుచేస్తాయి. సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రేక్షకులకు ఎక్కడా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించదు. అందువల్ల చాలా సందర్భాలో సినిమా మేకింగ్ షార్ట్ ఫిలిం మేకింగ్ ను తలపిస్తుంది.

సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకూ ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా రాసుకున్న సన్నివేశాలు మరీ సిల్లీ గా అనిపిస్తాయి. పోనీ లాజిక్స్ పట్టించుకోకుండా హిలేరియస్ గా నవ్వించి మేజిక్ చేసే ప్రయత్నం కూడా జరగలేదు. అక్కడే సినిమా తేడా కొట్టింది. అసలు లాటరీ టికెట్ కోట్ లో పెట్టడం అనేదే మరీ సిల్లిగా అనిపిస్తుంది. ఎంతో ఆసక్తిగా కొన్న లాటరీ టికెట్ ను శ్రీనివాస్ రెడ్డి నెగ్లెట్ చేయడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. ఇక సినిమా కోసం అందరూ కమెడియన్స్ ను తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి అందులో సత్య , వెన్నెల కిషోర్ ,శకల శంకర్ లను తప్ప మిగతా ఎవర్నీ సరిగ్గా వాడుకోలేకపోయాడు. క్యారెక్టర్స్ లో దమ్ము లేకపోవడం, హిలేరియస్ గా నవ్వించే కామెడీ సన్నివేశాలు లేకపోవడంతో కమెడియన్స్ అందరూ గెస్ట్ రోల్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో వైరల్ అయినా వీడియోస్ మీద డైలాగ్ కామెడీ ట్రై చేసారు కానీ అవి కూడా అంతలా అలరించలేదు.

ఫైనల్ గా ‘భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు’ ఓ సాదా సీదా కామెడీ ఎంటర్టైనర్ ను తలపిస్తుంది.

రేటింగ్ : 2/5