బెలూన్ మూవీ రివ్యూ

Friday,July 10,2020 - 08:38 by Z_CLU

నటీనటులు: జై, అంజలి, యోగిబాబు, నాగినీడు, జాయ్‌ మాథ్యూ, రామచంద్రన్‌ దురైరాజ్‌, మాస్టర్ రిషి తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఆర్‌. శరవణన్‌
సౌండ్‌ డిజైన్స్‌: సచిన్‌, సుధాకర్‌
సంగీత దర్శకుడు: యువన్‌ శంకర్‌ రాజా
ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్
ఎడిటర్: రూబన్
నిర్మాత: మహేష్ గోవిందరాజ్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శినీష్
రన్ టైమ్: 2 గంటల 13 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: జులై 10, 2020
ఫ్లాట్ ఫామ్: Zee5

సిల్వర్ స్క్రీన్ పై బోర్ కొట్టని సక్సెస్ ఫార్ములా ఏదైనా ఉందంటే అది లవ్, హారర్ మాత్రమే. ఈ రెండు జానర్స్ లో ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కాకపోతే చెప్పే విధానంలో కొత్తదనం చూపించాలి. మరి ఈరోజు Zee5 ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన
బెలూన్ అనే హారర్ సినిమాలో ఆ కొత్తదనం ఉందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

కిట్టూ అలియాస్ కృష్ణ (జై) దర్శకుడు అవ్వాలనుకుంటాడు. ఓ మంచి కథ రాసుకొని డైరక్షన్ కోసం ట్రై చేస్తుంటాడు. అతడి భార్య జాక్వెలిన్ (అంజలి) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటుంది. ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్న కృష్ణకు ఇంట్లో అవమానాలు ఎదురవుతుంటాయి. అదే టైమ్ లో కృష్ణ రాసిన కథను నిర్మాత రిజెక్ట్ చేస్తాడు, హారర్ సినిమా అయితేనే చేస్తానంటాడు. హీరో కూడా అదే అడుగుతున్నాడని చెబుతాడు.

దెయ్యాలు, దేవుడ్ని నమ్మని క్రిష్ణకు హారర్ కథ రాయడం కష్టంగా మారుతుంది. అరకులో ఓ పాడుబడ్డ ఇంట్లో అనుమానాస్పదంగా జరిగిన హత్యలు అతడ్ని ఎట్రాక్ట్ చేస్తాయి. వాటి వెనక కథ తెలుసుకుంటే తనకు కథావస్తువు దొరుకుందని భావించి.. జాక్వెలిన్, అన్నయ్య కొడుకు పప్పు
(మాస్టర్ రిషి), ఇద్దరు స్నేహితులతో కలిసి అరకు వెళ్తాడు. పాడుబడ్డ ఇంటి పక్కనే గెస్ట్ హౌజ్ తీసుకొని ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాడు.

అయితే కథ కోసం కృష్ణ చేసే ప్రయత్నం అతడి కుటుంబానికే చుట్టుకుంది. పప్పుకు నిజంగానే దెయ్యం పడుతుంది. దాన్ని వదిలించే క్రమంలో మరో ఆత్మను లేపుతాడు క్రిష్ణ. ఈ రెండు ఆత్మలు (పిల్ల ఆత్మ, తల్లి ఆత్మ) కలిసి ఏం చేశాయి.. అసలు కృష్ణ కుటుంబాన్నే ఈ దెయ్యాలు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి.. క్రిష్ణ గత జన్మకు ఈ ఆత్మలకు సంబంధం ఏంటనేది బెలూన్ బ్యాలెన్స్ కథ. అసలు ఈ కథకు బెలూన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

నటీనటుల పనితీరు

రెండు డిఫరెంట్ షేడ్స్ లో జై ఆకట్టుకున్నాడు. దర్శకుడు కావాలనే కుర్రాడిగా, ఫ్లాష్ బ్యాక్ లో అమాయకపు వ్యక్తిగా జై యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్టు మధ్యమధ్యలో వచ్చే నెగెటివ్ షేడ్స్ లో జై లుక్స్, మేనరిజమ్స్ మెప్పిస్తాయి. జై భార్యగా అంజలికి మంచి క్యారెక్టర్ దొరికింది. సినిమాలో జై క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంజలి పోషించిన జాక్వెలిన్ పాత్రకు కూడా అంతే బలం ఉంది. సినిమాకు వీళ్లిద్దరే ప్లస్ పాయింట్.

కమెడియన్ పాత్రలో యోగిబాబు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. సినిమా ఆసాంతం యోగిబాబు కనిపిస్తాడు కానీ నవ్వులు పండిన సందర్భాలు మాత్రం కొన్నే. మాస్టర్ రిషి చాలా బాగా చేశాడు. విలన్ పాత్రలో నాగినీడు మెప్పించాడు.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో ఒకరు మ్యూజిక్ డైరక్టర్, ఇంకొకరు సినిమాటోగ్రాఫర్. టెక్నికల్ గా ఈ సినిమా రిచ్ గా ఉందంటే కారణం వీళ్లిద్దరు మాత్రమే. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హారర్ సీన్స్ లో యువన్ ఎక్స్ పీరియన్స్ కనిపిస్తుంది. పాటలతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

ఇక సినిమాటోగ్రాఫర్ శరవణన్ ఈ సినిమాకు మరో ఎస్సెట్. అతడి ఫ్రేమ్స్, లైటింగ్ చాలా బాగుంది. హారర్ సినిమాకు కావాల్సిన ఫీల్ అంతా తీసుకొచ్చాడు. ఈ ఇద్దరికీ ఆర్ట్ డైరక్టర్ శక్తి వెంకట్ రాజ్, ఎడిటర్ రూబన్ నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో బెలూన్ సినిమా సాంకేతికంగా చెప్పుకునే రేంజ్ లో తెరకెక్కింది.

ఇక దర్శకుడి విషయానికొస్తే.. చాలామంది డైరక్టర్స్ లా శినీష్ కూడా హారర్ జానర్ సెలక్ట్ చేసుకున్నాడు. కానీ దానికి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన శినీష్.. స్క్రీన్ ప్లే విభాగంలో మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష

చాలా హారర్ సినిమాల్లానే బెలూన్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఇప్పుడొస్తున్న హారర్ సినిమాల్లో ఈ విధానం లేదు. ప్రేక్షకుడ్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో, బిగి సడలకుండా నడుపుతున్నారు. బెలూన్ లో ఆ ఫార్మాట్ ఫాలో అయి ఉంటే బాగుండేది. కానీ ఒక్కసారి అసలు కథలోకి వెళ్లిన తర్వాత.. దర్శకుడు ప్రేక్షకుడ్ని మెల్లగా తన దారిలోకి తెచ్చుకున్నాడు.

హీరోహీరోయిన్లు, ఇతర పాత్రలు అరకు గెస్ట్ హౌజ్ కు వెళ్లిన తర్వాత ఇక కథ పరుగులు పెడుతుందని అనుకున్నారంతా. కానీ దర్శకుడు అక్కడ కూడా టైమ్ తీసుకున్నాడు. ఓ పాట కూడా పెట్టి టైమ్ వేస్ట్ చేశాడు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు డైరక్టర్.

ఇంటర్వెల్ నుంచి శుభం కార్డు పడేవరకు బెలూన్ లో ఎంచడానికేం కనిపించవు. కథ చకచకా సాగిపోతోంది. స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆల్రెడీ చూసేసిన భావన కలిగించినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ఆ ఫీలింగ్ ను మనసులోంచి తీసేస్తుంది. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో ఇక అక్కడ్నుంచి ప్రేక్షకుడు కళ్లు తిప్పడు.

ఇలా చెప్పుకుంటే బెలూన్ లో పాజిటివ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో, ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ ను తగ్గించే డ్రా బ్యాక్స్ కూడా అన్నే ఉన్నాయి. జై, అంజలి తమ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను నిలబెట్టారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. తమ పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ ను
చూపించడంలో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం ఈ సినిమాకు కాస్త ఇబ్బందికరం. మరీ ముఖ్యంగా విలన్ పాత్ర బలంగా అనిపించదు. కానీ విలన్ పాత్రను ప్రవేశపెట్టిన విధానం, దానికోసం ఎంచుకున్న నేపథ్యం బాగుంది. విలన్ పాత్రధారి నాగినీడుకు ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే ఇంకా బాగుండేది.

ఇక ప్రత్యేక పాత్ర పోషించిన రాజ్ తరుణ్ గురించి ఇక్కడ చెప్పేకంటే, సినిమాలో చూడడమే కరెక్ట్. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ రాజ్ తరుణ్ ఈ సినిమాకు సర్ ప్రైజ్ ఎలిమెంట్.

ప్లస్ పాయింట్స్
– జై, అంజలి నటన
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– సినిమాటోగ్రఫీ
– ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్
– రొటీన్ స్టోరీలైన్
– సాంగ్స్
– ఫ్లాష్ బ్యాక్ లో డెప్త్ లేకపోవడం

ఓవరాల్ గా Zee5లో ఎక్స్ క్లూజివ్ ఓటీటీ మూవీగా రిలీజైన బెలూన్.. హారర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేస్తుంది.

బాటమ్ లైన్: బెలూన్ బాగానే ఎగిరింది
రేటింగ్ : 2.75/5