'అ!' మూవీ రివ్యూ

Friday,February 16,2018 - 06:13 by Z_CLU

నటీనటులు: కాజల్, నిత్య మీనన్, శ్రీనివాస్ అవసరాల, ఇషా రెబ్బ, ప్రియదర్శి,, రెజినా, మురళి శర్మ.

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

సంగీతం: మార్క్ కె.రాబిన్

నిర్మాణం : వాల్ పోస్టర్ సినిమా

నిర్మాతలు : ప్రశాంతి తిపిర్నేని , నాని

కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

రిలీజ్ డేట్ : 16 ఫిబ్రవరి 2018

నాని నిర్మాణంలో ప్రశాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అ!’ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిత్యామీనన్, శ్రీనివాస్ అవసరాల, ఇషా రెబ్బ, కాజల్, రెజీనా నటీనటులుగా ఓ కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైనర్ చేసిందో తెలుసుకుందాం.


కథ :

ఎలాగైనా మోసం చేసి చెఫ్ గా ఉద్యోగం సంపాదించాలనుకునే నల్ల(ప్రియదర్శి), మగాళ్ళ వల్ల తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల చిన్నతనం నుండే మగాళ్ళపై అసహ్యం పెంచుకున్న కృష్ణ(నిత్యామీనన్)ని పెళ్లి చేసుకోవాలనుకునే ఒక టీనేజ్ అమ్మాయి రాధ(ఈశా రెబ్బ), డ్రగ్స్ కు అలవాటు పడి డబ్బు కోసం ఏమైనా చేస్తూ ఓ కాఫీ షాపులో పనిచేసే మీరా(రెజీనా), ఇగోతో రగిలిపోతూ తనే గ్రేట్ అనుకునే మెజీషియన్ యోగి(మురళి శర్మ)… ఇంతకీ వీళ్ళందరూ ఎవరు.. ఆత్మహత్య చేసుకొని తన  అవయవాలు దానం చేయాలనుకునే కాళి(కాజల్)కి వీళ్ళకి కనెక్షన్ ఏంటనేదే అ!.

నటీనటుల పనితీరు:

సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ నటనతో వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కాజల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక నిత్య, రెజినా, ఈషా, అవసరాల, మురళి శర్మ, ప్రియదర్శి ఇలా అందరూ ఇప్పటివరకూ చేయని పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రియదర్శి, మురళి శర్మ తమ కామెడితో ఎంటర్ టైన్ చేశారు. రోహిణి, సి.వి.ఎల్.నరసింహ రావు, శేషు, దేవదర్శిని, కైట్లిన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పనితీరు:

టెక్నికల్ గా ఈ సినిమాకు అందరూ ప్లస్సే.. సినిమాటోగ్రాఫర్ గా తన విజన్ తో మెస్మరైజ్ చేశాడు కార్తీక్ ఘట్టమనేని. సినిమాకు పర్ఫెక్ట్ బాగ్రౌండ్ స్కోర్ అందించాడు మార్క్ కె.రాబిన్. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ప్రశాంత్ వర్మ కొత్త కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే బాగుంది. వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఇప్పటి వరకూ రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో నాని ఓ సినిమా నిర్మించాడనగానే ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. కాజల్, రెజినా, నిత్య మీనన్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా, మురళి శర్మ, ప్రియదర్శి వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాకు అ! అనే డిఫరెంట్ టైటిల్ పెట్టడం, టీజర్, ట్రైలర్ అందరినీ మెస్మరైజ్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక సినిమా విషయానికొస్తే కథ వినగానే నాని ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యాడంటే ఈ కాన్సెప్ట్ ఎలాంటిదో ఊహించొచ్చు. నాని మొదటి నుంచి చెప్తున్నట్టు ఇది ఇప్పటి వరకూ ప్రేక్షకులు చూడని ఓ కొత్త కాన్సెప్ట్ సినిమా. కేవలం కొన్ని క్యారెక్టర్స్ తో ఇలాంటి కాన్సెప్ట్ సినిమా తెరకెక్కించడం పెద్ద సాహసమే. మొదటి సినిమాతో దర్శకుడిగా ఇలాంటి సాహసం చేసిన ప్రశాంత్ ని అభినందించాలి. ఇలాంటి కొత్త కథను మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశ్యంతో సినిమాను నిర్మించిన నిర్మాత నానిని కూడా అభినందించాల్సిందే. కథే హీరో అంటూ ముందు నుంచి చెప్పినట్టు నిజంగా ఇది హీరోలాంటి కథే. కాజల్, రెజినా, నిత్య మీనన్, ఈషా రెబ్బ, అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ, ఇలా సినిమాలో నటించిన అందరూ కేవలం కథలో క్యారెక్టర్స్ లా మాత్రమే కనిపించారు. నిజానికి ఇలాంటి క్యారెక్టర్స్ బేస్డ్ సినిమాలు తెలుగులో ఇదివరకే వచ్చినప్పటికీ ఈ సినిమాలో మరింత కొత్తదనం చూపిస్తూ చివరికి క్లైమాక్స్ ద్వారా తను చెప్పాలనుకున్నది తెలియజేశాడు దర్శకుడు. కాకపోతే ఈ కొత్త కాన్సెప్ట్ ని అందరికీ అర్ధం అయ్యేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. తన కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కన్ఫూజ్ చేసి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నిజానికి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్ గాని లేకపోతే అస్సలు వర్కౌట్ కాదనే విషయం తెలిసిందే. అందుకే  పాపులర్ స్టార్స్ ని తీసుకుని ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని భావించాడు నాని. అది బాగానే వర్కవుట్ అయింది.

కొత్తగా అనిపించే కథ, థ్రిల్ చేసే క్యారెక్టర్స్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, రవితేజ-నాని వాయిస్ ఓవర్, కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు అవాక్కయ్యి అ! అనిపించే సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా, ఎక్కువగా కన్ఫ్యూజన్ చేయడం, రెజీనా, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్స్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేకపోవడం, సామాన్య ప్రేక్షకుడికి కాన్సెప్ట్ అర్ధం కాకుండా ఉండటం సినిమాకు మైనస్.

ఫైనల్ గా రొటీన్ సినిమాలు చూస్తూ మన తెలుగులో కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావా..? మన దర్శకులు – నిర్మాతలు అలాంటి సినిమాలు తీయలేరా..? అనుకునే వాళ్ళకి మాత్రం అ! ఓ కొత్త అనుభూతి కలిగిస్తుంది.

 

రేటింగ్ : 2.75 / 5