'అశ్వథ్థామ' మూవీ రివ్యూ

Friday,January 31,2020 - 01:33 by Z_CLU

న‌టీన‌టులు : నాగశౌర్య, మెహరీన్, జిషు సేన్ గుప్తా, పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్ తదితరులు

సంగీతం : శ్రీ‌చ‌ర‌ణ్‌

కెమెరా : మ‌నోజ్‌రెడ్డి

కథ : నాగ‌శౌర్య‌

స్క్రీన్ ప్లే : ర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌బిక్కిన‌

మాటలు : పరశురాం

నిర్మాణం : ఐరా క్రియేషన్స్

నిర్మాత : ఉషాముల్పూరి

దర్శకత్వం : ర‌మ‌ణ్‌తేజ‌

నిడివి : 133 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 31 జనవరి 2020

హీరో నాగ శౌర్య రచయితగా మారి సొంత కథతో రమణ తేజ డైరెక్షన్ లో ‘అశ్వథ్థామ’  సినిమా చేసాడు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది. మరి నాగ శౌర్య కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…? ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

అమెరికాలో ఉండే గణ(నాగ శౌర్య) తన చెల్లి ప్రియ పెళ్లి కోసం విశాఖపట్నం వస్తాడు. పెళ్ళికి ముందు ప్రియ ఆత్మ హత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించడం గణని షాక్ కి గురిచేస్తుంది. అసలు విషయం తెలుసుకొని ఆ అడ్డంకులన్నీ దాటించి చెల్లెలికి నిశ్చితార్థం అయిన వ్యక్తి (ప్రిన్స్) తో పెళ్లి చేస్తాడు.

అలా చెల్లి పెళ్ళయ్యాక విశాఖ పట్నంలో అమ్మాయిల కిడ్నాప్ లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైం వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు గణ. ఓ గ్యాంగ్ తో అమ్మాయిలను కిడ్నాప్ చేయించే అసలు సూత్రదారి గురించి తెలుసుకునే ప్రయత్నంలో గణకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. చివరికి ఆడ పిల్లలని టార్గెట్ చేసి వారి జీవితాలతో ఆడుకునే డాక్టర్ మనోజ్ కుమార్(జిషు సేన్ గుప్తా) ను గణ ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయడం మొదసారి అయినా నాగ శౌర్య తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ హీరోగా ఆకట్టుకున్నాడు. మెహ్రీన్ ను రెండు పాటలకి, కొన్ని సన్నివేశాల కోసమే తీసుకున్నట్టు ఉంది. పెద్దగా స్కోప్ లేకపోవడంతో  జస్ట్ పరవాలేదనిపించుకుంది.  నాగ శౌర్య చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి నటన బాగుంది. ఆ పాత్రకు ఆమె న్యాయం చేసింది.

ఇప్పటికే 98 సినిమాల్లో నటించిన అనుభవంతో జిషు సేన్ గుప్తా స్టైలిష్ విలన్ గా ఎట్రాక్ట్ చేసాడు.  జయ ప్రకాష్ , పవిత్ర లోకేష్ , సత్య తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

థ్రిల్లర్ సినిమాకు నేపథ్య సంగీతం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. థ్రిల్ చేసే సన్నివేశాలకు అలాంటి స్కోర్ పడకపోతే ఆ సీన్స్ పండవు. సరిగ్గా సినిమాకు అలాంటి నేపథ్య సంగీతాన్ని అందించి థ్రిల్ కలిగించాడు జిబ్రాన్. కొన్ని థ్రిల్లర్ సినిమాలకు పనిచేసిన అనుభవంతో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. శ్రీచరణ్ పాకాల అందించిన రెండు పాటలు పరవాలేదనిపించాయి. గారీ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేసి సరైన రన్ టైం లాక్ చేయడం కలిసొచ్చింది. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా విలన్ హౌజ్ సెటప్ లో అతని వర్క్ తెలుస్తుంది.

అన్బు అరివు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను అలరించేలా ఉన్నాయి. నాగ శౌర్య రాసుకున్న కథ బాగున్నప్పటికీ కథనం పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఎవరికీ తెలియకుండా కిడ్నాపులు చేసే ఓ సైకో విలన్, అతన్ని పట్టుకోవాలని చూసే హీరో, ఆసక్తిగా సాగే స్క్రీన్ ప్లే… ఈ ఫార్మేట్ లో తమిళ్ లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అవి తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలుగా రిలీజ్ అయ్యాయి. సరిగ్గా అలాంటి కథ – కథనంతోనే తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా చేసాడు నాగ శౌర్య. రచయితగా మారి తను ఎగ్జైట్ అయిన పాయింట్ ను డెవలప్ చేసి ఓ కథగా  రాసుకున్నాడు. అయితే శౌర్య కథ కొత్తగా లేకపోయినా ఎగ్జైట్ చేసేలా ఉంది. కానీ కథనం విషయంలోనే ఎక్కడో తేడా కొట్టింది.

ద్రౌపతి వస్త్రాభరణం జరిగిన సమయంలో అందరూ కళ్ళప్పగించి చూస్తుంటే ఒక్క అశ్వథ్థామ మాత్రమే ప్రశ్నించాడు..ప్రతి ఘటించాడు అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ తో టైటిల్ కి హీరో క్యారెక్టరైజేషణ్ కి జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత ఓ గ్యాంగ్ అమ్మాయిను కిడ్నాప్ చేసే సన్నివేశం నుండి ఓ సీరియస్ క్రైం థ్రిల్లర్ గా సినిమాను ప్రారంభించి ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ , ఆ వెంటనే ఫ్యామిలీ సన్నివేశాలు, లవ్ ట్రాక్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత మరొకటి పేర్చుకుంటూ వెళ్ళాడు. ముఖ్యంగా అనవసరం అనిపించేట్టుగా వచ్చే ఓ రెండు పాటలు ఆదిలోనే కథకు అడ్డు తగిలినట్టు అనిపిస్తాయి. నిజానికి అక్కడ హీరోకి అతని చెల్లికి ఉండే గొప్ప బాండింగ్ ను ఇంకా హైలైట్ చేసే ఎమోషనల్ సన్నివేశాలు పడాలి. ఆ ప్రయత్నం జరగలేదు. కానీ సూసైడ్ సన్నివేశం మాత్రం కొంత వరకూ ప్రేక్షకుల్లో ఫీల్ కలిగించింది. అవన్నీ పక్కన పెడితే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి వేగవంతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను పరిగెత్తించాడు దర్శకుడు.

తనను ఎగ్జైట్ చేసిన ఓ కథకు తమిళ్ లో వచ్చిన కొన్ని థ్రిల్లర్ సినిమాల తరహా స్క్రీన్ ప్లే రాయించుకొని ఈ సినిమా చేసాడు శౌర్య. అందువల్ల సినిమా చూస్తున్నంత సేపు గతంలో వచ్చిన కొన్ని తమిళ థ్రిల్లర్ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కిడ్నాప్ సన్నివేశాలు , నేపథ్య సంగీతం ‘రాక్షసన్’ సినిమాను పోలి ఉన్నట్టు అనిపిస్తాయి. అయితే విలన్ అమ్మాయిలను కిడ్నాప్ చేయించి ఆ తర్వాత హాస్పిటల్ లో జాయిన్ చేయడం అనేది కొత్తగా ఉంది. మధ్యలో డ్రగ్ అనే ఎలిమెంట్ ను వాడటం బాగుంది. కానీ అది కూడా కథను స్ట్రాంగ్ చేయలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిక్యూషన్ సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను సాదా సీదాగా తేల్చేసారు. అలా కాకుండా హీరో క్లైమాక్స్ లో విలన్ ను చేరుకునే ట్రాక్ ను ఇంకాస్త ఆసక్తిగా రాసుకుంటే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు బాగుంది. ఫైనల్ గా ‘అశ్వథ్థామ’ సైకో థ్రిల్లర్ గా పరవాలేదనిపిస్తుంది.

 

రేటింగ్ : 2 .75 /5