రివ్యూ - 'హిడింబ'

Thursday,July 20,2023 - 01:02 by Z_CLU

నటీ నటులు : అశ్విన్ , నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు

సంగీతం – వికాస్ బాదిసా

కెమెరా – బి రాజశేఖర్

సమర్పణ : ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాణం :  SVK సినిమాస్

నిర్మాత : గంగపట్నం శ్రీధర్

దర్శకత్వం :  అనీల్ కన్నెగంటి

విడుదల : 20 జూలై 2023

రన్ టైమ్ : 135 నిమిషాలు

సెన్సార్ : A

 

టైటిల్ , ట్రైలర్ తో మంచి బజ్ తెచ్చుకున్న ‘హిడింబ’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అశ్విన్ హీరోగా అనీల్ కన్నెగంటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ . 

కథ : 

సిటీలో వరుసగా 16 మంది  అమ్మాయిలు మిస్ అవుతారు. పోలీస్ డిపార్ట్ మెంట్  అలాగే ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా బిందు అనే మరో అమ్మాయి మిస్సింగ్ కేస్ వస్తుంది. దీంతో కేసును స్పెషల్ ఆఫీసర్ ఆధ్య (నందిని రెడ్డి) కి అప్పగిస్తారు. తనకి డిపార్ట్ మెంట్ నుండి సపోర్ట్ గా అభయ్ ( అశ్విన్) ని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు.

అక్కడి నుండి అభయ్ తో కలిసి ఆధ్య మిస్సింగ్ కేసును తనదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీని వెనుక ఉన్న వ్యక్తి ను పట్టుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఈ నేపథ్యంలో రెడ్ కలర్ క్లూ ద్వారా కాలాబండలో ఉండే బోయా అనే సైకో కిల్లర్ ను తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకుంటాడు అభయ్. ఇంతకీ బోయా ఎవరు ? హిడింబ జాతికి మిస్సింగ్ కేసుకి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా ఆధ్య తన ఇన్వెస్టిగేషన్ తో అమ్మాయిల మిస్సింగ్  వెనుక ఉన్న వ్యక్తి ను పట్టుకోగలిగిందా ? లేదా అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు : 

పోలీస్ పాత్రలో అశ్విన్ నటన బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మాస్ హీరోగా మెప్పించాడు. క్లైమాక్స్ లో మంచి నటన కనబరిచాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ తేడా కొట్టింది. కాప్ రోల్ లో నందితా శ్వేత ఆకట్టుకుంది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది.శ్రీనివాస రెడ్డి కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యాడు. ఆ సీన్స్ లో కూడా కామెడీ పండలేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సిజ్జు , డాక్టర్ గా రాజీవ్ కనకాల, పోలీస్ గా సంజయ్ స్వరూప్ పాత్రలకు యాప్ట్ అనిపించుకున్నారు. విలన్ గా రాజీవ్ పిళ్లై మెప్పించాడు. ముఖ్యమంత్రి పాత్రలో శుభలేక సుదాకర్, కన్నింగ్ పోలీస్ పాత్రలో రఘు కుంచె ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ అందింది. ముఖ్యంగా వికాస్ బాదిసా నేపథ్య సంగీతం , సౌండ్ డిజైనింగ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి హైలైట్ గా నిలిచాయి. బి రాజశేఖర్ కెమెరా విజువల్స్ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా గుడ్లగూబ తో వచ్చే షాట్స్ లో అతని పనితనం కనిపించింది. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది. ల్యాగ్ లేకుండా క్రిస్ప్ గా కట్ చేశారు. జాషువా, రియల్ సతీష్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ అడియన్స్ ఆకట్టుకుంటాయి. షర్మిల యలిశెట్ట ఆర్ట్ వర్క్ కథకి తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.  కాస్ట్యూమ్ డిజైనర్ గా మౌనా గుమ్మడి మంచి వర్క్ చూపించారు.

 కళ్యాణ చక్రవర్తి డైలాగ్స్ మైనస్ అనిపించాయి. అనీల్ కన్నెగంటి ఎంచుకున్న హిడింబ పాయింట్ బాగుంది. దర్శకుడిగా కొన్ని సందర్భాలలో తన ప్రతిభ చూపించాడు.

జీ సినిమాలు సమీక్ష : 

ప్రేక్షకుల్లో సినిమా చూసే విధానం మారింది. కోవిడ్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు , భారీ తనం నిండిన సినిమాలకే ఆడియన్స్ ఓట్ వేస్తున్నారు. అందుకే యంగ్ ఫిలిమ్ మేకర్స్ అంతా కొత్త కథలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దర్శకుడు అనీల్ కన్నెగంటి కూడా ఓ డిఫరెంట్ కథ , థ్రిల్ చేసే కాన్సెప్ట్ తో హిడింబ తీశాడు. తను చెప్పాలనుకున్న డిఫరెంట్ థ్రిల్లర్ ను అంతే డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అమ్మాయిల మిస్సింగ్ కేసు , పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటూ రొటీన్ థ్రిల్లర్ లానే సినిమాను మొదలు పెట్టి ‘హిడింబ’ జాతి ద్వారా కొత్త కథ చూపించాడు. కానీ ఈ ప్రయత్నంలో దర్శకుడిగా పూర్తిగా మెప్పించలేకపోయాడు. ప్రయత్నం కొత్తగా ఉన్నప్పుడు , రైటింగ్ మీద , అలాగే మేకింగ్ మీద అంతే దృష్టి పెట్టాలి. దర్శకుడు కొన్ని సందర్భాలలో తన వర్క్ తో మెస్మరైజ్ చేశాడు. అలాగే కొన్ని సందర్భాలలో రొటీన్ సన్నివేశాలతో నిరాశ పరిచాడు.

చాలా థ్రిల్లర్ సినిమాళ్లో లానే క్రైమ్ , ఇన్వెస్టిగేషన్ తో మొదలు పెట్టినప్పటికీ అటవీ ప్రాంతంలో ఉండే హిడింబ అనే జాతితో కొత్త సినిమా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనీల్. అందుకు అనీల్ ను మెచ్చుకోవాలి. కాకపోతే రెండు జానర్స్ ను మిక్స్ చేసే తరుణంలో అలాగే ఈ తరహా కథలను అంతకు ముందు డీల్ చేసిన అనుభవం లేకపోవడంతో పూర్తి మార్కులు స్కోర్ చేయలేకపోయాడు. లవ్ ట్రాక్ కూడా ఇంప్రెస్ చేసేలా లేదు. దర్శకుడు హిడింబ పాయింట్ మీదే ఎక్కువ శ్రద్ద పెట్టడంతో లవ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ తేలిపోయాయి.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. మొదటి భాగంలో కాలా బండ యాక్షన్ ఎపిసోడ్ బాగా డిజైన్ చేశారు. ఆ ఎపిసోడ్ లో ఫైట్ మాస్టర్ కష్టం కనిపిస్తుంది. అలాగే కేరళలో వచ్చే మరో యాక్షన్ ఎపిసోడ్ కూడా హైలైట్ గా నిలిచింది. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, హిడింబ జాతి గురించి చెప్పే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సర్ప్రయిజింగ్ గా ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకుడు తీసుకునే విధానంలోనే రిజల్ట్ ఆధారపడి ఉంది.

 ఇక థ్రిల్లర్ సినిమాళ్లో ఉండే సస్పెన్స్ ఇందులో అంతగా కనిపించలేదు. దీంతో ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఊహించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ కొందరికీ షాక్ ఇస్తుంది. ఓవరాల్ గా అశ్విన్ నటన , నేపథ్య సంగీతం , సౌండ్ డిజైనింగ్ , కెమెరా విజువల్స్ , ఫైట్స్ , క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.డిఫరెంట్ కథతో వచ్చిన ఇలాంటి కథలని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 

రేటింగ్ : 2 .5 /5