Movie Review - అశోకవనంలో అర్జున కళ్యాణం

Friday,May 06,2022 - 01:55 by Z_CLU

న‌టీన‌టులు : విశ్వక్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్, రితిక నాయక్ , కేదార్ శంకర్, గోపరాజు , సత్య శ్రీనివాస్, కాదంబరి కిరణ్ , రాజ్ కుమార్ త‌దిత‌రులు.

సినిమాటోగ్ర‌ఫీ : ప‌వి కె.ప‌వ‌న్‌

సంగీతం : జై క్రిష్‌

ఎడిట‌ర్‌: విప్ల‌వ్‌

కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా

స‌మ‌ర్ప‌ణ‌ : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

నిర్మాణం : ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌

నిర్మాత‌లు : బాపినీడు, సుధీర్ ఈద‌ర‌

ద‌ర్శ‌క‌త్వం : విద్యాసాగ‌ర్ చింతా

నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 6 మే 2022

ప్రాంక్ ప్రమోషన్ వీడియో వివాదం కారణంగా రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేసిన విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. రవి కిరణ్ షో రన్నర్ గా ఉంటూ విద్యా సాగర్ చింతా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో విశ్వక్ హిట్టు కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 vishwak-sens-reveals-transformed-look-in-upcoming-movie-teaser-001

కథ :

తెలంగాణలో సూర్యాపేట్ కి చెందిన అర్జున కుమార్ అల్లం (విశ్వక్ సేన్) కి ఆంధ్రాలో ఉండే మాధవి(రుక్సర్ ధిల్లాన్) తో పెళ్లి కుదురుతుంది. కుటుంబ సమేతంగా నిశ్చితార్థం కోసమని పెళ్లి కూతురి ఊరికెళతాడు అర్జున్. ముప్పై ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి కాలేదనే భాద నుండి బయటపడి త్వరలోనే పెళ్లి పీటలు  ఎక్కబోతు న్నాననే  ఆనందంతో ఉన్న అర్జున్ కి కొన్ని రోజులకే ఆ ఆనందం దూరమవుతుంది.

 నిశ్చితార్థం కోసమని మాధవి ఇంటికి వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన అర్జున్ కి ఊహించని పరిణామం ఎదురై మాధవితో పెళ్లి క్యాన్సెల్ అవుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమించిన అబ్బాయితో మాధవి వెళ్ళిపోయిందని తెలిసుకున్న అర్జున్ తన పెళ్లి విషయం మళ్ళీ మొదటికి వచ్చిందని లోలోపల కుమిలిపోతుంటాడు. మరి అర్జున్ ఈ భాద నుండి ఎలా బయట పడ్డాడు ? చివరికి అర్జున్ పెళ్లి ఎవరితో జరిగింది ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

అర్జున్ కుమార్ అల్లం కేరెక్టర్ కి విశ్వక్ సేన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పెళ్లి కాని అబ్బాయిలు ఓన్ చేసుకునేలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి కొత్త విశ్వక్ సేన్ ని పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో రుక్సర్ సెకండాఫ్ లో రితిక నాయక్ హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వసుధ పాత్రతో రితిక నాయక్ సినిమాకు ప్లస్ అనిపించుకుంది. ఈ సినిమా ఆమెకి  తెలుగులో  మరిన్ని అవకాశాలు తెచ్చే పెడుతుంది. హీరో తండ్రిగా కేదార్ శంకర్ , హీరోయిన్ తండ్రి గా సత్య శ్రీనివాస్ తమ నటనతో ఆకట్టుకున్నారు. గోపరాజు , కాదంబరి, రాజ్ కుమార్ తమ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేసి నవ్వించారు. వెన్నెల కిషోర్ హిలేరియస్ గా కాకపోయినా కొంత వరకూ నవ్వించాడు.  హీరో సిస్టర్ కేరెక్టర్ లో విద్యా నటన బాగుంది. మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

ఏ సినిమాకయినా టెక్నిషియన్స్ నుండి బెస్ట్ సపోర్ట్ అవసరం. వారి బెస్ట్ అవుట్ పుట్ వస్తే సినిమాకి హెల్ప్ అవుతుంది. ప‌వి కె.ప‌వ‌న్‌ సినిమాటోగ్రఫీ , జై క్రిష్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యాయి. పవన్ తన కెమెరా వర్క్ తో బెస్ట్ విజువల్స్ అందించాడు. జై క్రిష్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో “ఓ ఆడ పిల్లా సాంగ్” హైలైట్ గా నిలిచింది. స్విచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే మిగతా పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలం చేకూర్చి ఆ ఫీల్ తీసుకొచ్చింది.  విప్లవ ఎడిటింగ్ బాగుంది కానీ మిడిల్ లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తూ బోర్ కొట్టించాయి. అవి సరిచేసుకుంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. నిఖిల్ కంపోజ్ చేసిన ఫైట్ రియలిస్టిక్ గా ఉంది.

రవి కిరణ్ కోలా అందించిన స్టోరీ లైన్ సింపుల్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు బాగున్నాయి. షో రన్నర్ గా రవి కిరణ్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. దర్శకుడు విద్యా సాగర్ చింతా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నీట్ గా హ్యాండిల్ చేసి తన టాలెంట్ చూపించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 AshokaVanamloArjunaKalyanam-cast-crew-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష : 

మాస్ క్యారెక్టర్స్ తో యంగ్ హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ని అర్జున్ కుమార్ అల్లం అనే క్లాస్ పాత్రలో ప్రెజెంట్ చేసి టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. విశ్వక్ ఈ తరహా పాత్ర చేయడం కొత్తే అయినప్పటికీ నటుడిగా ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ఇంప్రెస్ చేసే స్క్రీన్ ప్లే, ప్లెజెంట్ మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్, క్యూట్ లవ్ ట్రాక్, మనసుని తాకే మాటలు ఇలా కొన్ని ప్లాన్ చేసుకుంటే ఈ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడం సులువే. ఇవన్నీ ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’కు చక్కగా కుదిరాయి. స్టోరీలైన్ సింపుల్ గా అనిపించినప్పటికీ  ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రవి కిరణ్. కాకపోతే  కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా రాసుకుంటే బెటర్ గా ఉండేది.

లాక్ డౌన్ లో పెళ్లికొడుకు ఇంట్లో చిక్కుకుపోయిన బంధువుల ఇన్సిడెంట్ తో ఈ కథ రాసుకొని దాన్నిపెళ్లి కాని ఓ కుర్రాడి కథగా మార్చుకున్నారు. ఇక లాక్ డౌన్ టైంలో జనాలు ఎదుర్కున్న ఇబ్బందులను కూడా కొన్ని సినిమాలో చూపించారు.  అందులో భాగంగా నిశ్చితార్థం కోసం వచ్చి తిరిగి వెళ్ళలేక పెళ్లి వారి ఇంట్లోనే ఉంటూ ఇబ్బందులు పడే మగపెళ్లి వారి కష్టాలు చూపించారు. అలాగే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ యాస-భాషకు అద్దం పట్టేలా వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. ఆ సన్నివేశాల్లో గోపరాజు నటన ప్రేక్షకులను అలరిస్తుంది. ఆడపిల్ల మీద సమాజం చూపిస్తున్న వివక్షతను చెప్తూ మంచి మాటలతో వచ్చే సన్నివేశం కూడా ఆకట్టుకుంది. ఆడ పిల్లలు వద్దనుకునే తల్లి దండ్రులకు ఆ సన్నివేశంతో చిన్న పాటి సందేశం ఇచ్చారు. ఆ సీన్ కి ఆడియన్స్ నుండి క్లాప్స్ పడతాయి.

ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయంతో, లైట్ కామెడీతో సరదాగా నడిపించి ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ పెట్టి సెకండాఫ్ పై ఆసక్తి పెంచారు. కాకపోతే సెకండాఫ్ స్టార్టయిన కాసేపటికే క్లైమాక్స్ ఏంటో తెలిసిపోతుంది.  ఆ టైంలో హీరోయిన్ చెల్లిలి పాత్రకు మొదటి భాగంలో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తాయి. ఇక క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే కాస్టింగ్ ని సెలెక్ట్ చేసుకోవడం సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని చెప్పాలి. ప్రతీ పాత్ర ఆ నటుల కోసమే క్రియేట్ చేసినట్టుంది. స్లో నరేషన్ , అక్కడక్కడా సాగినట్టుండే కొన్ని సీన్స్, వీక్ స్టోరీ లైన్ సినిమాకు మైనస్ కాగా, విశ్వక్ సేన్ నటన , రితిక కేరెక్టర్ , కామెడీ , ఫ్యామిలీ సీన్స్ , లవ్ ట్రాక్ , మ్యూజిక్ , విజువల్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్  సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ఓవరాల్ గా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫీల్ గుడ్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా.

రేటింగ్ : 2.75 /5

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics