'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ

Friday,November 29,2019 - 02:04 by Z_CLU

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్,లావణ్య త్రిపాఠి ,వెన్నెల కిషోర్,పోసాని కృష్ణమురళి,తరుణ్ అరోరా ,సత్య.నాగినీడు.

కెమెరా : సూర్య

సంగీతం : సామ్ సి.ఎస్

స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు

నిర్మాతలు: రాజ్‌కుమార్ అకెళ్ల‌

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: టి.ఎన్. సంతోష్

విడుదల తేది : 29 నవంబర్ 2019

 

కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు థియేటర్స్ లోకొచ్చింది. మరి తమిళ్  ‘కనిథన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

టీవీ 99 ఛానెల్ లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేసే అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) ఎప్పటికైనా BBCలో రిపోర్టర్ గా చేరాలని ద్యేయంగా పెట్టుకొని పనిచేస్తుంటాడు. అదే సమయంలో అతను పనిచేసే ఛానెల్ సీఈఓ కూతురు కావ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. కావ్య కూడా అర్జున్ ని ఇష్టపడుతుంది.

ఇలా సజావుగా సాగుతున్న అర్జున్ అనుకోకుండా సర్టిఫికెట్స్ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అవుతాడు. ఏం జరిగిందో తెలిసుకునే లోపే అతని పేరు వార్తల్లోకెక్కుతుంది. అలా స్టడీ సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో జైలుకెళ్ళిన అర్జున్ బెయిల్ మీద బయటికొచ్చి దీని వెనకున్న వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సర్టిఫికెట్స్ స్కామ్ వెనకున్నది దురై సర్కార్(తరుణ్ అరోరా) అని తెలుసుకుంటాడు. చివరికి దురై చేసిన స్కామ్ ను  అర్జున్ ఎలా బయట పెట్టి గొప్ప జర్నలిస్ట్ అనిపించుకున్నాడు అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

అర్జున్ అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నిఖిల్ బాగా నటించాడు. కొన్ని సందర్భాల్లో యాక్షన్ హీరో ముద్ర కోసం ట్రై చేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కొంత వరకూ మెప్పించాడు. క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండటంతో లావణ్య త్రిపాఠి తన నటనతో ఆకట్టుకుంది. చేసిన పాత్రే కావడంతో తరుణ్ అరోరా విలనిజంతో మంచి మార్కులే అందుకున్నాడు.

సినిమాకు సత్య కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని సందర్భాల్లో అతని డైలాగ్ కామెడీ నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ ట్రాక్ హిలేరియస్ గా లేకపోయినా ఉన్నంతలో కామెడీ పండించాడు. విద్యుల్లేఖా రామ‌న్ -వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. కథలో కీలకమైన పాత్రలో పోసాని కృష్ణమురళి ఆకట్టుకున్నాడు. నాగినీడు , ప్రగతి. కేదార్ శంకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నికల్ గా సినిమాకు అందరూ హెల్ప్ అయ్యారు. ముఖ్యంగా సామ్ సి.ఎస్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ నిలిచింది. ‘కన్నె కన్నె’ పాట బాగుంది. కొన్ని సన్నివేశాలకు నేపథ్యం సంగీతం కూడా చక్కగా కుదిరింది.  కథకు తగ్గట్టుగా తన విజువల్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు సూర్య. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

సంతోష్ ఎంచుకున్న ఫేక్ సర్టిఫికెట్స్ కాన్సెప్ట్ తో పాటు కథనం కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో రీమేక్ సినిమాల సక్సెస్ రేట్ తక్కువే.. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన రీమేక్ సినిమాలు వేళ్ళ మీద లెక్కేయొచ్చు. ఫస్ట్ రీమేక్ తో దెబ్బ తిన్న నిఖిల్ ఈ సారి మాత్రం ‘అర్జున్ సురవరం’ తో పరవాలేదనిపించుకున్నాడు. మూడేళ్ళ కిందట తను తీసిన ‘కనిథన్’ సినిమాను మళ్ళీ తెలుగులో తీసి కొంత వరకూ మెప్పించగలిగాడు దర్శకుడు. తీసిన సన్నివేశాలే కావడంతో చాలా చోట్ల అదే మేజిక్ ని రిపీట్ చేసాడు. ముఖ్యంగా విలన్ ని అతని గ్యాంగ్ ను కాస్టింగ్ లో రిపీట్ చేసి ఒరిజినల్ సినిమా నుండి తను తీసిన కొన్ని షాట్స్ తెలివిగా వాడుకున్నాడు.

కొన్ని సన్నివేశాలు మార్పులు చేర్పులు చేసి కొంత వరకూ ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మిస్ చేసాడు. ఇక సినిమా లిబర్టీస్ తీసుకొని లాజిక్కులు పట్టించుకోకుండా తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. అవన్నీ పక్కన పెడితే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ స్కామ్ మీద అతను రాసుకున్న కథ కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి.  మొదటి భాగం వరకూ పర్ఫెక్ట్ గా సీన్ టు సీన్ దించేసిన దర్శకుడు రెండో భాగంలో మాత్రం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి తడబడ్డాడు. తెలుగుకి వచ్చే సరికి క్యారెక్టర్స్ లో కూడా కొన్ని మార్పులు చేసాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పోసాని చనిపోయిన సీన్  అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. అలాగే స్కూల్ బిల్డింగ్ కూలిపోయే సన్నివేశం మరీ సిల్లీగా అనిపించడం వల్ల ఆ సన్నివేశానికి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయారు. రెండో భాగంలో హీరో -విలన్ ఒకరినొకరు పట్టుకోవాలని చూసే సన్నివేశాలు అంత థ్రిల్ చేయవు. ఆ సన్నివేశాలను మరింత వేగంగా ఎంగేజ్ చేసేలా తీసుకుంటే బాగుండేది.

యంగ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఆకట్టుకున్నా కొన్ని సందర్భాల్లో కథను మోయలేకపోయిన హీరోలా కనిపించాడు. ఒరిజినల్ లో అధర్వ ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం నిఖిల్ రైట్ ఛాయిస్ అనిపిస్తుంది. కానీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చూసినప్పుడు మాత్రం నిఖిల్ ఆనడు. ఓవరాల్ గా క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ పరవాలేదపిస్తుంది.

 

రేటింగ్ : 2.75 /5