అర్జున్ రెడ్డి రివ్యూ

Friday,August 25,2017 - 12:34 by Z_CLU

నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే , జియా శర్మ, రాహుల్ రామకృష్ణ, కమల్ కమరాజు, ప్రియదర్శి సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న తదితరులు

సినిమాటోగ్రఫీ : రాజ్ తోట‌

మ్యూజిక్ : ర‌ధ‌న్‌

నిర్మాణం : భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్

నిర్మాత : ప్ర‌ణ‌య్ వంగా

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సందీప్‌రెడ్డి వంగా

రిలీజ్ డేట్ : 25 ఆగస్టు 2017

ఒకే ఒక్క టీజర్ తో రిలీజ్ కి ముందే భారీ హైప్ తెచ్చుకుంది అర్జున్ రెడ్డి సినిమా. తర్వాత విడుదలైన ట్రయిలర్ తో ఆ అంచనాల్ని రెట్టింపు చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. పెద్ద బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి అర్జున్ రెడ్డి ఎలా ఉంది..? విజయ్ దేవరకొండ లుక్ ఎందుకలా ఉంది..? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందా..? హేవే లుక్

కథ :

మంగుళూరులో ఓ మెడికల్ కాలేజ్ లో ఎం.బి.బి.ఎస్ ఫైనల్ ఇయర్ చదివే అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) తన కాలేజ్ లో జూనియర్ గా జాయిన్ అయిన ప్రీతి(షాలిని పాండే)ని తొలిచూపులోనే చూసి ప్రేమలోపడతాడు. టాప్ ర్యాంక్ తో మెడికల్ స్టూడెంట్ గా  అతిగా కోప్పడే లక్షణంతో ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేసే అర్జున్ రెడ్డి చివరికి తను ప్రాణంగా ప్రేమించే ప్రీతీని పెళ్లి చేసుకున్నాడా… అర్జున్ రెడ్డి ప్రీతిల ప్రేమకథ ఎలా మలుపు తిరిగింది ??? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ గా విజయ్ దేవర కొండ ఇరగదీశాడు. ముఖ్యంగా ప్రతీ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని కోపాన్ని వ్యక్తపరిచే యువకుడిగా తన నటనతో మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమాతో విజయ్ కి నటుడిగా గొప్పగా చెప్పుకొనే రోల్ దొరికింది.  థియేటర్ ఆర్టిస్ట్ అయిన శాలిని పాండే  తన సహజమైన నటనతో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోహీరోయిన్ల తర్వాత బాగా ఎట్రాక్ట్ చేసిన వ్యక్తి రాహుల్ రామకృష్ణ. విజయ్ ఫ్రెండ్ గా చక్కగా నటించాడు. జియా శర్మ, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న తో పాటు మిగతా నటులంతా తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రధన్ గురించే.. రిలీజ్ కి ముందే ‘ఏమిటేమిటో’,’తెలుసా నీ కైనా’ పాటలతో ఆకట్టుకున్న రధన్ సినిమాకు అదిరిపోయే బాగ్రౌండ్ స్కోర్ అందించి మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ను తన ఆర్.ఆర్ తో బాగా ఎలివేట్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అనంత్ శ్రీరాం , రాంబాబు అందించిన సాహిత్యం బాగుంది. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ బాగుంది. మంగుళూరు లోకేషన్స్ ను తన కెమెరా వర్క్ తో మరింత అందంగా చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు సందీప్‌ వంగా తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేశాడు. కొన్ని సందర్భాలలో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసిన భద్రకాళి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘పెళ్లి చూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన ‘ద్వారక’ సినిమాతో ప్రేక్షకులను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్  చేయలేకపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ గా ఈసారి మాత్రం ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసి మరో హిట్ దిశగా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డిగా విజయ్ చూపించిన ఎక్స్ ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్.

ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమాకు సరైన స్క్రిప్ట్ ను ఎంచుకున్నాడు. ముఖ్యంగా యూత్ భావోద్వేగాలను స్క్రీన్ పై పెర్ ఫెక్ట్ గా ఎలివేట్ చేశాడు. తనకు దగ్గరగా ఉండే  కొందరు వ్యక్తుల జీవితాల నుంచి ఘటనల్ని తీసుకొని సందీప్ ఈ కథను రాసుకున్నట్టుగా అనిపించింది. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ  గతంలో చేసిన ఫిలిం మేకింగ్ కోర్స్, రెండు సినిమాల అనుభవం సందీప్ కి బాగా కలిసొచ్చాయి. ఎంచుకున్న కంటెంట్ ని ఏమాత్రం తడబడకుండా దర్శకుడిగా స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఎంటర్టైన్ చేశాడు.

అర్జున్ రెడ్డిలో మొదటి భాగం ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తుంది. డైరెక్టర్ గా తను చెప్పాలనుకున్న పాయింట్ ను బోల్డ్ గా చెప్తూనే లవ్ స్టొరీతో ఎంటర్టైన్ చేశాడు సందీప్.

అర్జున్ రెడ్డి క్యారెక్టర్, విజయ్ దేవరకొండ అల్టి మేట్ పెర్ఫార్మెన్స్, రొమాంటిక్ సీన్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్, లవ్ ట్రాక్ , మ్యూజిక్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ లో సాగతీతలా అనిపించే సీన్స్ , ఎక్కువ నిడివి సినిమాకు మైనస్.

ఫైనల్ గా ఎమోషనల్ లవ్ స్టొరీ తో అర్జున్ రెడ్డి యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు.

 

రేటింగ్3/5