'అరవింద సమేత' మూవీ రివ్యూ

Thursday,October 11,2018 - 02:29 by Z_CLU

నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే, జగపతి బాబు, సుప్రియా పాఠక్, సునీల్ తదితరులు

సంగీతం : ఎస్.ఎస్.థమన్

నిర్మాణం : హారిక & హాసినీ క్రియేషన్స్

నిర్మాత : ఎస్.రాథాకృష్ణ (చిన బాబు)

రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిడివి : 167 నిమిషాలు

విడుదల తేది : 11 అక్టోబర్ 2018

 

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానుల కోరిక ఎట్టకేలకు తీరిపోయింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ భారీ అంచనాల నడుమ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమాతో తారక్ -త్రివిక్రమ్ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా… ‘అరవింద సమేత’ హైలైట్స్ ఏంటి … జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.

అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

 

నటీనటుల పనితీరు:

ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఎంటర్ టైన్ చేసిన తారక్…ఈసారి వీర రాఘవ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేసాడు. ఎమోషనల్ సీన్స్, ఫైట్స్, డాన్సుల్లో తన మేజిక్ రిపీట్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా తారక్ సీమ యాసలో చెప్పిన డైలాగ్స్, ఓపెనింగ్ లో సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకున్నాయి.

అరవింద అనే గ్లామర్ రోల్ తో పూజా హెగ్డే ఎట్రాక్ట్ చేసింది. ఈషా రెబ్బ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదు కానీ పరవాలేదనిపించుకుంది. సినిమాలో పాత్రలన్నీ ఒకెత్తు బసిరెడ్డి పాత్ర మరో ఎత్తు.. తన విలనిజంతో సినిమాకు స్పెషల్ లుక్ తీసుకొచ్చాడు జగపతి బాబు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో జగపతి బాబు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులంతా ఫిదా అయిపోతారు. నానమ్మ రోల్ లో సుప్రియా పాఠక్ ఆకట్టుకుంది. సునీల్ పాత్రలో పంచ్ లు లేవు, కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం కనిపించాడు. నవీన్ చంద్ర, నరేష్, శ్రీనివాసరెడ్డి, ఈశ్వరి రావు, శత్రు, బ్రహ్మాజీ తదితరులు వారి పరిధిలో నటించి సినిమాకు ప్లస్ అయ్యారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాడు సినిమాటోగ్రఫర్ పి.ఎస్ వినోద్. రాయలసీమ వాతావరణాన్ని తన కెమెరా వర్క్ తో బాగా చూపించాడు… తమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశాడు. ‘పెనిమిటి’, ‘అనగనగనగా’, ‘ఏడ పోయినాడో’ పాటలు ఆకట్టుకున్నాయి. పెనిమిటి సాంగ్ పిక్చరైజేషన్, ప్లేస్ మెంట్ కుదరలేదు. ‘రెడ్డి ఇక్కడ సూడు’ పాటకు కొరియోగ్రఫీ బాగుంది.

రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంట్రో ఫైట్ పీక్స్. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. రాయలసీమ యాసతో కూడిన త్రివిక్రమ్ డైలాగ్స్ అలరించాయి. ముఖ్యంగా ‘ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం అది కత్తి మీ నాయిన ఎత్తినాడంటే అది వారసత్వం,అది కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం ,ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమయితందా….’ లాంటి ఎమోషనల్ డైలాగ్స్ త్రివిక్రమ్ లోని గొప్ప రచయితను మళ్ళీ పరిచయం చేసినట్టుగా అనిపించింది. స్క్రీన్ ప్లే – డైరెక్షన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఫ్యాక్షనిజం అనేది టాలీవుడ్ ఓల్డ్ ఫార్ములా. అలాంటి ఫార్ములాని టచ్ చేయాలని ఎన్టీఆర్ లాంటి స్టార్ అనుకోడు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కోరుకోడు. మరి వీళ్లిద్దరూ కలిసి అరవింద సమేతను ఎందుకు ఎంచుకున్నారు. ఇందులో కాస్త కొత్తదనం, ఇంకెంతో సందేశం ఉంది కాబట్టి. అరవింద సినిమాలో త్రివిక్రమ్ మేజిక్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ నటవిశ్వరూపం కనిపిస్తుంది. టైటిల్ లో అరవింద ఉన్నప్పటికీ సినిమా మొత్తం వీరరాఘవుడిదే.

ఫ్యాక్షనిజం, రాయలసీమ బ్యాక్ డ్రాప్ మనకు కొత్తకాదు. కానీ అదే ఫ్యాక్షనిజాన్ని, అదే సీమ యాసను పీక్స్ లో చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అరవింద సమేత అలానే ఉంటుంది. త్రివిక్రమ్ రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది. సీమ వాతావరణాన్ని, ఆ యాసను పెర్ ఫెక్ట్ గా వాడుకున్న సినిమా ఇది.

సినిమా విడుదలకు ముందు వరకు ఇది ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇది ఎన్టీఆర్-జగపతిబాబు సినిమాగా మారింది. అంతలా వీళ్లిద్దరూ తమ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. ఎమోషనల్ కంటెంట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తారక్ కి అపోజిట్ గా జగపతి బాబుని ఎంచుకోవడం సినిమాకి పెద్ద ప్లస్. సినిమా చూసాక ప్రేక్షకులకు ఎన్టీఆర్-జగపతి బాబు పాత్రలే ఎక్కువగా గుర్తుంటాయి.

సినిమా ప్రారంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకలితో ఉన్న మాస్ ఆడియన్స్ కి బిర్యాని పెట్టినట్టుగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ లో తన విశ్వరూపం చూపించాడు తారక్. ఆ తర్వాత స్క్రీన్ ప్లే కాస్త స్లో అనిపించినా మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ సీన్ తో సినిమా వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో నవీన్ చంద్రతో ఒప్పందం చేసుకునే సీన్ , కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.

ఇక నెగెటివ్ ఎలిమెంట్స్ విషయానికొస్తే సగటు ప్రేక్షకుడి దృష్టిలో రెండంటే రెండే కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంటర్ టైన్ మెంట్. పూర్తిగా కథను నమ్మి తీసిన ఈ సినిమాలో వినోదం కనిపించదు. నరేష్ పండించాలని ట్రై చేసిన కామెడీ కూడా పెద్దగా పండలేదు. ఇక ఎన్టీఆర్ నుంచి ఆశించిన మాస్ నంబర్ సినిమాలో ఒకటే ఉంది. అది కూడా కావాలని పెట్టినట్టే అనిపిస్తుంది.

ఈ రెండు నెగెటివ్స్ మినహా సినిమా అంతా పాజిటివ్ ఎలిమెంట్సే. త్రివిక్రమ్ డైరక్షన్-మాటలు, తమన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్, ఎన్టీఆర్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, పూజా హెగ్డే గ్లామర్, భయంపుట్టించే జగపతిబాబు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఇలా సినిమాలో అన్నీ ఉన్నాయి.

బాటమ్ లైన్ – తారక సమేత త్రివిక్రమ్

రేటింగ్ 3.25/5