అంతరిక్షం మూవీ రివ్యూ

Friday,December 21,2018 - 02:39 by Z_CLU

న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, అదితిరావ్, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల
ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా)
ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: రామ‌కృష్ణ సబ్బ‌ని, మోనిక నిగొత్రే స‌బ్బ‌ని
సంగీతం: ప‌్ర‌శాంత్ విహారి
సిజి: రాజీవ్ రాజ‌శేఖ‌రన్

 

హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే జనాలకు స్పేస్ కాన్సెప్ట్ కొత్తకాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. కోలీవుడ్ లో కూడా ఈమధ్య ఈ తరహా సినిమా ఒకటి వచ్చింది. కానీ తెలుగులో మాత్రం ఫస్ట్ టైం అంతరిక్షం వచ్చింది. మరి ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలతో పోల్చవచ్చా.. తెలుగులో స్పేస్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ
భారతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తుంటాడు దేవ్. రష్యాలో ఆస్ట్రోనాట్ గా శిక్షణ కూడా తీసుకుంటాడు. అయితే అతడు లాంఛ్ చేసిన విబ్రియాన్ అనే శాటిలైట్ ప్రయోగం ఫెయిల్ అవుతుంది. ఆ క్రమంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ను కూడా కోల్పయి, ఇస్రోకు దూరంగా ఉంటాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇస్రో గతంలో ప్రయోగించిన మిహిర అనే మరో శాటిలైట్ ఫెయిల్ అవుతుంది. దానికి వర్క్ చేసిన సైంటిస్టుల్లో దేవ్ కూడా ఒకడు. ఆ శాటిలైట్ ను డీకోడ్ చేసేందుకు ముగ్గురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్తాడు దేవ్. ఈ క్రమంలో మిహిర శాటిలైట్ ను సరిచేయడంతో పాటు.. గతంలో ఇస్రో కంట్రోల్ నుంచి దూరంగా వెళ్లిపోయిన విబ్రియాన్ శాటిలైట్ ను కూడా తిరిగి పనిచేసేలా చేస్తాడు.

నటీనటుల పనితీరు
ఇలాంటి స్టోరీలైన్ ను యాక్సెప్ట్ చేసిన వరుణ్ తేజ్ ను ముందుగా అభినందించాలి. కథ కొత్తగా ఉండా లేదా అని మాత్రమే చూసే ఈ హీరో… దేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ అతడి క్యారెక్టరైజేషన్ పై ఇంకాస్త వర్కవుట్ చేసి ఉంటే బాగుండేది. కాసేపు ఆస్ట్రోనాట్ గా, ఇంకాసేపు టెక్నీషియన్ గా దేవ్ ను చూపించడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్పడం మినహా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు మాత్రం చూపించలేదు.

హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, అదితిరావు చక్కగా నటించారు. ముందు నుంచే చెబుతున్నట్టు లావణ్య త్రిపాఠి పాత్ర చాలా చిన్నది. అదితిరావుకు మాత్రం మంచి క్యారెక్టర్ దక్కింది. తను ఆస్ట్రోనాట్ క్యారెక్టర్ చేశానని గర్వంగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ అవసరాల, సత్యదేవ్ తన పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు
తక్కువ టైమ్ లో క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చిన గ్రాఫిక్స్ టీమ్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. అలాఅని అంతరిక్షంలో గ్రాఫిక్స్ మరీ హాలీవుడ్ రేంజ్ లో ఉండవు. మంచి గ్రాఫిక్స్ ఇచ్చాడనుకునేలోపే, చెత్త విజువల్ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది. కాకపోతే చాలా తక్కువ టైమ్ లో ఈ రేంజ్ అవుట్ పుట్ ను మెచ్చుకోవాల్సిందే. జ్ఞానశేఖర్ విజువల్స్ బాగున్నాయి. స్పేస్ థీమ్ ఎలివేట్ అయ్యేలా మంచి ఫ్రేమ్స్, లైటింగ్స్ వాడారు. రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. స్పేస్ షిప్, స్పేస్ సెంటర్ సెట్స్ ను చాలా నేచురల్ గా చూపించింది ఈ జంట. సినిమా మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, కెమెరామెన్ టాలెంట్ కనిపిస్తుంది.

ఇక దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మరోసారి సక్సెస్ అయ్యాడు. ఘాజీ సినిమా టైమ్ లో ఎంత రీసెర్చ్ చేశాడో, దాదాపు అంతే రీసెర్చ్ ఇక్కడ కూడా కనిపించింది. కానీ ఈసారి అతడు తను రాసుకున్న కాన్సెప్ట్ ను 2 గంటల సినిమాగా మలచలేకపోయాడు. ఫస్టాఫ్ బాగా బోర్ కొట్టించాడు. సెకెండాఫ్ నుంచి మాత్రం సంకల్ప్ కనిపిస్తాడు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.


జీ సినిమాలు రివ్యూ
సీన్స్ పక్కాగా రాసుకోవాలి. అవి వర్కవుట్ అవుతాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. సీన్-బై-సీన్ ఫ్లో పక్కాగా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఇది చెక్ చేసుకుంటే చాలు కమర్షియల్ ఫార్ములాను మరిచిపోవచ్చు. 6 పాటలు, 4 ఫైట్లు, ఐటెంసాంగ్స్ లాంటి చెత్తను తీసేయొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అంతరిక్షం కూడా అదే పనిచేసింది.

జానర్ తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ పక్కాగా ఉండి, ఎమోషనల్ గా ప్రేక్షకుడ్ని కనెక్ట్ చేస్తే చాలనే ప్రాధమిక సూత్రాన్ని అంతరిక్షం తూచ తప్పకుండా ఫాలో అయింది. ఈ సినిమా విజయానికి ఇదే మెయిన్ పిల్లర్ గా నిలిచింది. బి, సి సెంటర్ ఆడియన్స్ కు అస్సలు పట్టని అంతరిక్షం కాన్సెప్ట్ తో కళ్లుతిప్పుకోనివ్వకుండా కూర్చోబెట్టగలిగాడు దర్శకుడు సంకల్ప్. దీనికి అతడు సెట్స్ పైకి వెళ్లకముందే రాసుకున్న రైటింగ్ కారణం. అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా ఎమోషన్ విషయంలో సంకల్ప్ లెక్క తప్పలేదు.

ఘాజిలో ఏదైతే అతడికి ప్లస్ అయిందో, ఇక్కడ కూడా అదే ఎమోషన్ ఇతడికి కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో సీన్స్ పెర్ ఫెక్ట్ గా ఉన్నాయి. ఫైట్స్, కామెడీ, సాంగ్స్ కాదు.. ఓ స్పేస్ షిప్ తో కూడా ఆడియన్ కనెక్ట్ అయ్యాడంటే అది కచ్చితంగా దర్శకుడి గొప్పదనమే.

ఇన్ని ప్లస్ లు ఉన్నప్పటికీ ఈ సినిమాను వెనక్కిలాగే పాయింట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ ఈ సినిమాను కాస్త భరించాల్సి వస్తుంది. మధ్యమధ్యలో వచ్చిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. దీనికి తోడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ అవ్వలేదు. ఇలా స్లోగా సాగే నెరేషన్ నుంచి సెకెండాఫ్ లోకి ఎంటరై, అక్కడ్నుంచి సినిమా ఊపందుకుంటుంది.

సెకెండాఫ్ లో సన్నివేశాల్ని పెర్ ఫెక్ట్ గా రాసుకున్న దర్శకుడు.. ఇక అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. క్లైమాక్స్ వరకు సినిమాను జర్క్ లు లేకుండా తీసుకెళ్తాడు. అక్కడక్కడ సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్న
దర్శకుడు.. లాజిక్స్ మిస్ అయ్యాడనే విషయం తెలుస్తున్నప్పటికీ డిఫరెంట్ జానర్ అవ్వడం వల్ల ప్రేక్షకుడు ఈజీగా లీనమైపోతాడు.

ఓవరాల్ గా తెలుగులో చేసిన మొట్టమొదటి స్పేస్ మూవీగా, ఓ సక్సెస్ ఫుల్ ప్రయత్నంగా అంతరిక్షం ఎట్రాక్ట్ చేస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు దీన్ని సూపర్ హిట్ మూవీగా చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

రేటింగ్2.75/5