అంధగాడు రివ్యూ

Friday,June 02,2017 - 11:04 by Z_CLU

నటీ నటులు : రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌

కెమెరా : బి.రాజ‌శేఖ‌ర్‌

సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌

స‌హ నిర్మాత : అజ‌య్ సుంక‌ర‌

నిర్మాత : రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-దర్శ‌క‌త్వం: వెలిగొండ శ్రీనివాస్‌

రిలీజ్ డేట్ : 2 June 2017

 

‘కుమారి 21 ఎఫ్‌’, ‘ఈడోరకం-ఆడోర‌కం’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అంధ‌గాడు’ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసింది..రచయిత వెలిగొండ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా.. తెలుసుకుందాం.

కథ :

చిన్నతనం నుంచి అంధుడైన గౌతమ్ విశాఖపట్నం లో ఓ రేడియో స్టేషన్ లో ఆర్.జె గా కాలాన్ని గడుపుతుంటాడు. అలా అంధత్వాన్ని పట్టించుకోకుండా ఆనందంగా జీవితాన్ని గడిపే గౌతమ్ తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన కళ్ల డాక్టర్  నేత్రతో ప్రేమలో పడతాడు.. అలా తాను ప్రేమిస్తున్న నేత్ర ద్వారా కళ్ళు పొందిన గౌతమ్ జీవితంలోకి సడెన్ గా ఎంట్రీ ఇస్తాడు కులకర్ణి(రాజేంద్ర ప్రసాద్)… అసలు కులకర్ణి ఎవరు..? గౌతమ్ కి ఎలా పరిచయం అయ్యాడు.. ఇక ఎన్నో ఏళ్ళ నుంచి కళ్ల కోసం ఎదురుచూస్తున్న గౌతమ్ కళ్ళు రాగానే ఏం చేశాడు.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

 

నటీనటుల పనితీరు :

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ యంగ్ హీరో రాజ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి గౌతమ్ అనే అంధుడి క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేశాడు. హెబ్బా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. పంతం బాబ్జీ అనే క్యారెక్టర్ తో మెయిన్ విలన్ గా తన లుక్, నటనతో ఆకట్టుకున్నాడు రాజా రవీంద్ర. అలాగే కులకర్ణి అనే క్యారెక్టర్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేసి సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు రాజేంద్ర ప్రసాద్. సత్య-సుదర్శన్ తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక పరుచూరి వెంకటేశ్వరావు ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, ఫిష్ వెంకట్ తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేసి ఎంటర్టైన్ చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది శేఖర్ చంద్ర గురించే తన ట్రెండీ మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు శేఖర్ చంద్ర. ముఖ్యంగా ‘దెబ్బకి పోయే పోయే’, కనుల ముందరే’,’అందగాడు ఆటకొచ్చాడే’ పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల అందించిన సాహిత్యం పాటలను ఎలివేట్ చేశాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో వచ్చే కామెడీ డైలాగ్స్ ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వెలిగొండ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగున్నాయి. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఒక రైటర్ దర్శకుడిగా మారుతుంటే ఆ సినిమా పై కాస్త అంచనాలు నెలకొనడం సహజమే. అందులోకి ‘ఢమరుకం’,’ ‘పండగ చేస్కో’,’బలుపు’ వంటి సినిమాలతో పాటు కొన్ని కామెడీ సినిమాలకు రచయితగా పనిచేసిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా ‘అంధగాడు’ అనే సినిమా చేస్తున్నాడనగానే అందులో రాజ్ తరుణ్ అంధుడిగా నటిస్తున్నాడనగానే సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచడంతో ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని టాక్ అందుకుంది. అయితే రచయిత నుంచి దర్శకుడిగా మారితే ప్లస్ ఎంతో మైనస్ కూడా అంతే అని చెప్పాలి. జనరల్ గా రైటర్ డైరెక్టర్ గా మారి ఓ సినిమా తీసాడంటే ఆ సినిమా పై మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కు వెళ్తారు ఆడియన్స్.  ‘అంధగాడు’ సినిమాకు కూడా ఇలాంటి అంచనాలతో  థియేటర్స్ కు వెళ్తారు. ఇక దర్శకుడి విషయానికొస్తే అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకోవడం కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక మంచి కాన్సప్ట్ తో సినిమాను స్టార్ట్ చేసి ఇంటర్వెల్ వరకూ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించి ఎంటర్టైన్ చేసిన వెలిగొండ శ్రీనివాస్ సెకండ్ హాఫ్ లో కాస్త తడబడి రొటీన్ సీన్స్ తో బోర్ కొట్టించాడు. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్, రాజా రవీంద్ర క్యారెక్టర్, కామెడీ సీన్స్, అంధులపై వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్,  క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్, కొన్ని సందర్బాల్లో రొటీన్ అనిపించే స్క్రీన్ ప్లే, లాజిక్స్ లేని సీన్స్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా లాజిక్స్ పట్టించుకోకుండా డీసెంట్ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ‘అంధగాడు’ మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

 

రేటింగ్ : 2.75 /5