'అమ్మమ్మగారిల్లు' మూవీ రివ్యూ

Friday,May 25,2018 - 04:39 by Z_CLU

నటీనటులు : నాగ శౌర్య, షామిలి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్

సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌

నేపధ్య సంగీతం: సాయి కార్తిక్

ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్

నిర్మాత‌: రాజేష్‌

క‌థ‌- క‌థ‌నం-మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్ సూర్య‌

విడుదల తేది : 25 మే 2018

సెన్సార్ : ‘U’

నిడివి : 156 నిమిషాలు

 

కథ కనెక్ట్ అయితే తప్ప సినిమా చేయడు నాగశౌర్య. అంత నమ్మకంగా చేశాడు కాబట్టే ఛలో సూపర్ హిట్ అయింది. మరి అదే నమ్మకంతో చేసిన అమ్మమ్మగారిల్లు రిజల్ట్ ఏంటి..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ :

ఆస్తి తగాదాల కారణంగా ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం విడిపోతుంది. ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు.. పిఠాపురంలో తల్లిని ఒంటరిగా వదిలేసి ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. వాళ్లంతా తిరిగి వస్తారని 20 ఏళ్లుగా ఎదురుచూసిన ఆ తల్లి, ఇక లాభం లేదని గ్రహించి ఆస్తిని అందరికీ సమానంగా పంచేయాలని నిర్ణయించుకుంటుంది. ఆస్తి పంపకం అనేసరికి అంతా ఇంటికి వస్తారు. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మతో కలిసి ఆడుకున్న సంతోష్ (నాగశౌర్య) కూడా వస్తాడు. కానీ అమ్మమ్మను విడిచి ఉండలేకపోతాడు. ఎలాగైనా కుటుంబాన్ని కలపాలనుకుంటాడు. ఇందులో భాగంగా సంతోష్ చేసే పనులకు ఎప్పటికప్పుడు అడ్డుతగులుతుంటుంది మామయ్య కూతురు సీత (షామిలి). ఎందుకో చిన్నప్పట్నుంచి సంతోష్ అంటే సీతకు పడదు. అందుకే అతడ్ని ఎప్పటికప్పుడు ఆటపట్టిస్తుంది. మరోవైపు సంతోష్ మాత్రం కుటుంబాన్నంతా కలపడం కోసం భూమి రిజిస్ట్రేషన్ ను ఓ 10 రోజులు వాయిదా వేయిస్తాడు.అలా 10 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉన్న వాళ్లంతా తిరిగి కలిశారా లేదా..? వాళ్లను కలపడం కోసం సంతోష్ ఏం చేశాడు..? బావకు తనపై ఉన్న ప్రేను సీత ఎలా గ్రహించింది..? మధ్యలో ఓ యాక్షన్ ఎపిసోడ్. ఇది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

సినిమాలో హీరో నాగశౌర్య, హీరోయిన్ షామిలి కంటే ముందు చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించే. చేసింది నెగెటివ్ పాత్ర అయినా సినిమా మొత్తం క్లిక్ అయిన క్యారెక్టర్ ఇది. ఇంతకుముందు రావు రమేష్ ఇలాంటి పాత్రలు చేశాడు. అయితే అలాంటి రొటీన్ పాత్రలో కూడా కొత్తదనం తీసుకురాగలిగాడు. సీనియారిటీ అంటే ఇదే. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. కుటుంబాన్ని కలపాలనుకునే మనవడిగా, మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాగశౌర్యను చక్కగా చూపించారు. రీఎంట్రీ ఇచ్చిన షామిలి, నాగశౌర్య జంట చూడముచ్చటగా ఉంది.ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. ఏ ఫ్రేమ్ లో చూసినా సీనియారిటీ ఉన్న నటులు కనిపిస్తారు. రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా.. ఇలా చాలామంది ఉన్నారు. సినిమాకు ఇది కూడా ఓ ప్లస్ పాయింట్.

 

టెక్నీషియన్స్ పనితీరు

నటీనటుల్లో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. దర్శకుడు కొత్త అవ్వడంతో చాలా చోట్ల ఆ లోపాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా సన్నివేశాలు రాసుకోవడంలో డైరక్టర్ సుందర్ సూర్య తడబడ్డాడు. డైలాగ్స్ పై పెట్టినంత ఫోకస్, సన్నివేశాల కల్పనపై పెట్టి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే లో కూడా అనుభవరాహిత్యం కనిపించింది. ఇక సినిమాను కలర్ ఫుల్ గా చూపించడంలో సీనియర్ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ సాంగ్ తో మ్యూజిక్ డైరక్టర్ కల్యాణి రమణ ఆకట్టుకున్నాడు. ఒకే ఇంట్లో, ఒకే గ్రామంలో తీసిన సినిమా కావడంతో, స్వాజిత్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బయటపడలేదు. బట్.. ఉన్నంతలో ఓకే.

జీ సినిమాలు సమీక్ష

‘శతమానంభవతి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తలో దారి చూసుకున్న చుట్టాళ్లను హీరో అందులో కలుపుతాడు. ఆ సినిమాకు అమ్మమ్మగారింటికి పెద్ద తేడా లేదు. కాన్ ఫ్లిక్ మారినా క్లయిమాక్స్ అదే. కుటుంబ కథా చిత్రాల్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఆశించలేం. కాకపోతే కాస్త ఫ్రెష్ నెస్ ను ఆశించడంలో తప్పులేదు. ఆ లోటు ఇందులో స్పష్టంగా కనిపించింది.

సన్నివేశాల్ని మరింత ఫ్రెష్ గా రాసుకుని ఉంటే బాగుండేది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ఎమోషన్ ను కూడా ఇంకాస్త డెప్త్ లో చూపించాల్సింది. హీరో క్యారెక్టర్ ను అలా పాసివ్ గా ఉంచేయడం సినిమాలో మరో వెలితి. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఎమోషన్స్ పెద్దగా పండలేదు. ఇక్కడ కూడా కారణం సన్నివేశాల్లో బలం లేకపోవడమే. ఓవరాల్ గా సినిమా మొత్తం కొత్తదనం మిస్ అయింది. మొత్తమ్మీద ఈ అమ్మమ్మగారిల్లు సినిమా నెమ్మదిగా సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబకథా చిత్రాల్ని ఎక్కువగా ఇష్టపడేవారికి, ఈ సమ్మర్ లో సకుటుంబ సమేతంగా ఏదైనా సినిమాకు వెళ్లాలనుకునేవాళ్లకు అమ్మమ్మగారిల్లు ఓ మంచి ఆప్షన్.

బాటమ్ లైన్ – అమ్మమ్మ గారింట్లో ఒక్కసారి అడుగుపెట్టొచ్చు

రేటింగ్ – 2.5/5