అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

Thursday,December 12,2019 - 02:47 by Z_CLU

నటీనటులు: చంద్రనాయక్, అజ్మల్, ధన్ రాజ్, మహేష్ కత్తి, బ్రహ్మానందం, అలీ తదితరులు
సమర్పణ: టి.అంజయ్య
బ్యానర్ : టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్
దర్శకత్వం: సిద్దార్థ తాతోలు
నిర్మాత: అజయ్ మైసూర్, టి.నరేష్ కుమార్, శ్రీధర్
సహనిర్మాతలు: నట్టికుమార్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
సంగీతం: రవిశంకర్
రచన, మాటలు: రామ్ గోపాల్ వర్మ, కరుణ వెంకట్
సెన్సార్: U/A
రన్ టైమ్: 2 గంటల 12 నిమిషాలు
రిలీడ్ డేట్: డిసెంబర్ 12, 2019

రిలీజ్ అవుతుందా అవ్వదా అనే ఉత్కంఠ మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చింది అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఇంతకుముందు ఈ సినిమాకు ఏ పేరు పెట్టారో అందరికీ తెలిసిందే. సెన్సార్ నిబంధనలు, వివాదాల కారణంగా టైటిల్ తో పాటు కంటెంట్ లో కూడా మార్పుచేర్పులతో వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు RCP పార్టీ అధ్యక్షుడు జగన్నాధ రెడ్డి. ఈ ఊహించని విజయాన్ని భరించలేకపోతాడు వెలుగుదేశం పార్టీ (VDP) అధినేత బాబుగారు. కొడుకు చినబాబును ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న బాబుగారు ఆ కల నెరవేరకపోవడంతో ఎలాగైనా జగన్నాధరెడ్డిని పదవి నుంచి దించేయాలని చూస్తాడు.

చినబాబును సీఎం ను చేసేందుకు బాబు గారి కుడిభుజమైన దయనేని రమామహేశ్వర రావు ఓ కుట్ర పన్నుతాడు. తమ పార్టీ ఎమ్మెల్యేనే హత్యచేసి, ఆ మర్డర్ ను జగన్నాధరెడ్డిపై వేయాలని చూస్తాడు. అయితే ఊహించని విధంగా దయనేని రమానే హత్యకు గురవుతాడు.

ఆ హత్య కేసు ముఖ్యమంత్రి జగన్నాధరెడ్డిపై పడుతుంది. కేంద్రం ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. దీంతో తప్పనిససరి పరిస్థితుల మధ్య రాజీనామా చేస్తాడు జగన్నాధరెడ్డి. మధ్యంతర ఎన్నికల్లో తిరిగి అతడు విజయం సాధించాడా లేదా? సీఎం అవ్వాలన్న చినబాబు కల నెరవేరిందా లేదా? ఈ హత్యలకు పీపీ జాన్, ప్రణవ్ కల్యాణ్ పార్టీలకు సంబంధం ఏంటనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న నేతల్ని పోలిన వ్యక్తుల్ని ఏరుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. వీళ్లలో చాలామంది పేర్లు కూడా తెలియవు. అయితే జగన్నాధరెడ్డి పాత్ర పోషించిన అజ్మల్, బాబుగారి క్యారెక్టర్ పోషించిన చంద్రనాయక్ బాగా సూట్ అయ్యారు. ఇక చినబాబు రోల్ ప్లే చేసిన నటుడు కూడా బాగా చేశాడు.

వీళ్లతో పాటు సీనియర్లయిన అలీ, బ్రహ్మానందం, ధనరాజ్, కత్తిమహేష్ ఈ సినిమాలో ఉన్నారు. బాబుగారు డ్రైవర్ రాంబాబు పాత్రలో బ్రహ్మానందం హావభావాలతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే “అది నేనే” అనే డైలాగ్ మినహాయిస్తే.. సినిమా మొత్తం బ్రహ్మానందానికి డైలాగ్ లేదు.

ఇక పమ్మినేని రామ్ రామ్ పాత్రలో స్పీకర్ గా అలీ బాగా నవ్వించాడు. రౌడీ షీటర్ భవానీ పాత్రలో ధనరాజ్, సీబీఐ ఆఫీసర్ గా కత్తి మహేష్, సిట్ ఆఫీసర్ గా స్వప్న తమ పరిథి మేరకు నటించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో టెక్నీషియన్స్ కు పెద్దగా పని ఉండదు. అతడు చెప్పింది వీళ్లు ఇస్తారు. వీళ్లు ఇచ్చిన ఆప్షన్స్ లోంచి ఒకటి అతడు సెలక్ట్ చేసుకుంటాడు. ఇలా సాగుతుంది వ్యవహారం. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కూడా టెక్నికల్ గా అలానే ఉంది. రవిశంకర్ సంగీతం రోత పుట్టించింది. అదృష్టం కొద్దీ 2 పాటలు కట్ చేయడంతో ప్రేక్షకులు బతికిపోయారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ బాగుంది. ఇతడు అవసరం లేకపోయినా ఎక్కువ వాయించేస్తున్నాడు అనే ఫీలింగ్ జనాలకు కలిగింది.

ఇక సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటికి తన టాలెంట్ చూపించాల్సిన అవసరం రాలేదు. అన్నీ వర్మ మార్క్ ఫ్రేమ్స్ కనిపించాయి. ఎడిటర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎడిటర్ కంటే ఎక్కువగా ఈ సినిమాకు సెన్సార్ అధికారులు ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది.
రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకుంటే.. ప్రస్తుతం రాజకీయాల నేపథ్యంలో వర్మ ఎంచుకున్న పాయింట్ బాగుంది. దానికి అతడిచ్చిన ఫిక్షన్ టచప్ కూడా బాగుంది. కానీ కేవలం సెటైర్లకే పరిమితమైపోయి, పాత్రల గెటప్పులపైనే ఎక్కువ దృష్టిపెట్టి, నెరేషన్ ను పూర్తిగా గాలికొదిలేశాడు. వర్మ చెప్పినట్టు తీయడానికి మాత్రమే దర్శకుడు సిద్దార్థ్ తాతోలు ఇంట్రెస్ట్ చూపించినట్టున్నాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొస్తే, నిర్మాతలు ఖర్చు పెడతామన్నా కూడా వర్మ వారించినట్టున్నాడు.

జీ సినిమాలు రివ్యూ

ఇప్పటి రాజకీయ నాయకుల్ని పోలిన గెటప్పులు… వాళ్ల గొంతుల్ని పోలిన మిమిక్రీ.. దీనికితోడు 6 నెలల కిందటే జరిగిన ఏపీ రాజకీయ ఘట్టాలు.. ఇవన్నీ జనాలకు బాగా కనెక్ట్ అయిన అంశాలు కావడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు ముందు బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే ఎప్పట్లానే వర్మ మరోసారి ప్రేక్షకుల్ని ఛీట్ చేశాడు.

ట్రయిలర్ లో చూపించింది తప్ప, సినిమాలో ఇంకేం లేదు. ఇంత మంచి సెటప్ పెట్టుకున్న వర్మ… ఫిక్షన్ లో కాస్త ఫ్రీడమ్ తీసుకొని తన మార్క్ ట్విస్టులు చూపిస్తే బాగుండేది. అలాంటి ప్రయత్నం చేయకుండా కేవలం పొలిటికల్ పంచ్ లు, ఇప్పటి రాజకీయ నాయకుల మిమిక్రీలకే పరిమితమైపోయాడు. ఈసారి కూడా ఆర్జీవీకి సంబంధించి పాత లైన్ నే రిపీట్ చేయాల్సి వస్తోంది. అతడు కథ, స్క్రీన్ ప్లే పై సీరియస్ గా దృష్టిపెడితే బాగుండేది.

కేవలం హైప్, ప్రమోషన్, కాంట్రవర్సీ లాంటి ఎలిమెంట్స్ ను నమ్ముకొని సినిమా తీశాడు వర్మ. తన సినిమా ఫస్ట్ వీకెండ్ ఆడితే చాలు అనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఈ దర్శకుడు. అతడి ఆలోచనకు తగ్గట్టే సినిమా రిజల్ట్ కూడా ఉంది. దీనికి తోడు సెన్సారోళ్లు ఈ సినిమాపై కాస్త గట్టిగానే కత్తెర్లు వాడినట్టు కనిపించింది. ఫస్టాఫ్ అయితే పూర్తిగా అతుకుల బొంతలా మారింది. ఎందుకు సీన్ వస్తుందో, ఎందుకు పాట వస్తుందో అర్థం కాని పరిస్థితి.

ఉన్నంతలో జనాలు ఎదురుచూసిన పాత్రలు, నిత్యం న్యూస్ ఛానెల్స్ లో చూసిన సన్నివేశాలు-డైలాగ్స్ కావడంతో ప్రేక్షకులు మాత్రం కొన్ని పంచ్ లు ఎంజాయ్ చేస్తారు. దీనికి తోడు ఈ సినిమాలో వర్మ తనమీద తానే పంచ్ లు వేసుకున్నాడు. అవి కూడా ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పంచ్ డైలాగ్ లు తప్ప సినిమాలో ఇంకేం లేదు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, కేఏ పాల్ ను పోలిన పాత్రల్ని ఎందుకు పెట్టాడో వర్మకే తెలియాలి. సినిమా అంతా ఒకవైపు, ఈ రెండు క్యారెక్టర్లు మరోవైపు నడుస్తుంటాయి. సినిమాకు వీటికి అస్సలు సంబంధం ఉండదు. బహుశా వర్మ కోరుకున్నది కూడా ఇదేనేమో.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు నటీనటులంతా పొలిటికల్ లీడర్స్ ను ఇమిటేట్ చేయడానికే ఎక్కువ తాపత్రయపడ్డారు. గెటప్, డైలాగ్స్ లో వాళ్లను గుర్తుచేసే ప్రయత్నం చేశారు. బాగా పేలుతుందనుకున్న బ్రహ్మి
ఎపిసోడ్ తుస్సుమనగా, ఉన్నంతలో అలీ తన ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించాడు. ఇలా నటీనటుల పెర్ఫార్మెన్స్ తో పాటు టెక్నీషియన్స్ ను కూడా వర్మ తన కనుసన్నల్లో పెట్టుకోవడంతో అతడి గత సినిమాల్లానే క్వాలిటీ ఉంది.

ఓవరాల్ గా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా కంటెంట్ పరంగా మరోసారి వర్మ గత సినిమాల్ని గుర్తుచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లు మాత్రం ఇందులోని పొలిటికల్ సెటైర్లు, పంచ్ ల్ని ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా ఓ సెక్షన్ పొలిటికల్ వర్గానికి మాత్రమే ఈ సినిమా పరిమితం.

రేటింగ్2/5