అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ రివ్యూ

Friday,November 16,2018 - 02:39 by Z_CLU

నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: థమన్ ఎస్.ఎస్
ఛాయాగ్రహణం : విజయ్ సి.దిలీప్
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్, రవి, మోహన్
రచన-దర్శకత్వం : శ్రీనువైట్ల
నిడివి : 153 నిమిషాలు
సెన్సార్ : U/A
విడుదల తేదీ: 16 నవంబర్ 2018

 

శ్రీనువైట్ల కసితో ఉన్నాడు, రవితేజ మంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. సినిమాపై అందరి ఎక్స్ పెక్టేషన్ ఇది. మరి ఈ అంచనాల్ని వీళ్లిద్దరూ అందుకున్నారా..? అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ :

అంజయ్ మిత్ర, ఆనంద్ ప్రసాద్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. న్యూయార్క్‌ లో కలిసి బిజినెస్ చేస్తుంటారు. ఆనంద్ ప్రసాద్ కొడుకు అమర్(రవి తేజ) సంజయ్ కూతురు ఐశ్వర్య(ఇలియానా) చిన్నతనంలోనే ఒకరంటే ఒకరికి ప్రాణంగా మేలుగుతుంటారు. అయితే లాభాల్లో ఉన్ తమ కంపెనీలో పని చేసే నలుగురు ఎంప్లాయిస్ కి కంపెనీలో ఇరవై శాతం షేర్ ఇచ్చి.. వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తారు సంజయ్ , ఆనంద్. కానీ ఆ కంపెనీ మొత్తాన్ని సొంతం చేసుకోవడం కోసం సంజయ్ , ఆనంద్ కుటుంబాలను చంపేస్తారు. అయితే ఆ ప్రమాదం నుండి అమర్ , ఐశ్వర్య బయటపడతారు. అలా చావు నుండి బయటపడిన అమర్,ఐశ్వర్య చిన్నతనంలో అనుకోకుండా దూరం అవుతారు.

పెరిగి పెద్దయిన అమర్ తమ కుటుంబానికి అన్యాయం చేసిన నలుగురికి రిటర్న్ గిఫ్ట్ అంటూ రివెంజ్ తీర్చుకుంటాడు. ఈ క్రమంలో అమర్ అక్బర్ ,ఆంటొనిగా ఎలా మారాడు.. తనలాగే బ్రతికి బయటపడ్డ ఐశ్వర్య ను ఎలా కలుసుకున్నాడు. చివరికి ఆ నలుగురిని ఎలా అంతమొందించాడు.. అనేది అమర్ అక్బర్ ఆంటొని మిగతా కథ…

నటీనటుల పనితీరు :

అమర్ , అక్బర్ , ఆంటొని గా మాస్ మహారాజ్ మెప్పించాడు. గతంలో చేసిన క్యారెక్టర్స్ తో పోలిస్తే కాస్త కొత్తదనం ఉన్న క్యారెక్టర్స్ కావడంతో కొత్తగా కనిపించాడు. ఇలియానా తన గ్లామర్ తో ఆకట్టుకుంది కానీ కమ్ బ్యాక్ కి పెర్ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్ అయితే కాదు. సునీల్ తన మార్క్ కామెడీతో అలరించే ప్రయత్నం చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో సత్య కామెడీ అలరించింది.

విలన్స్ గా తరుణ్ అరోరా , ఆదిత్యా మీనన్ ఆకట్టుకోలేకపోయారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించిన హీరోయిన్ లయకి, ఇది అసలు రీఎంట్రీనే కాదు. ఆమె తెరపైన కనిపించడమే పెద్ద వరం. జయప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లు చాలా మంది ఉన్నప్పటికీ ఎవరూ మెప్పించలేకపోయారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

తమన్ మ్యూజిక్ మేజిక్ చేయలేకపోయింది. ముఖ్యంగా పాటలు ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే. విజయ్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో, పాటల చిత్రీకరణలో అతని పనితనం కనిపిస్తుంది. ఏం.ఆర్.వర్మ ఎడిటింగ్ పరవాలేదు. శ్రీను వైట్ల కథ -కథనం రొటీన్ అనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా తగ్గలేదు ఈ నిర్మాతలు. వారు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ మీద కనిపించింది.

జీ సినిమాలు సమీక్ష :

ఈ కాలంలో కొత్త కథలు దొరకవు. ఉన్న కథనే ఎంత కొత్తగా చెప్పామనేది ఇంపార్టెంట్. అమర్-అక్బర్-ఆంటోనీ కూడా కొత్త కథ కాదు. కొత్తగా చెప్పాల్సిన కథ. సరిగ్గా ఇక్కడే శ్రీనువైట్ల ఫెయిల్ అయ్యాడు. అప్పుడెప్పుడో కళ్యాణ్ రామ్ చేసి వదిలేసిన అతనొక్కడే సినిమా నుంచి అపరిచితుడు, దూకుడు, వన్-నేనొక్కడినే, గజనీ ఇలా ఎన్నో సినిమాల్ని మిక్స్ చేసి ఒక్కో ఎపిసోడ్ కు అమర్, అక్బర్, ఆంటోనీ అని పేర్లు మార్చాడంతే.

ఈ సింపుల్ రివెంజ్ డ్రామాకు ‘రిటర్న్ గిఫ్ట్’ అనే పేరుపెడితే కొత్తదనం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని వైట్ల ఫీల్ అయినట్టున్నాడు. కానీ సినిమాలో మాత్రం ఆ కొత్తదనం లేదు. సో.. రవితేజ-వైట్ల ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ సినిమా ఓ సింపుల్ రివెంజ్ డ్రామా. చిన్నప్పుడు తన ఫ్యామిలీని చంపిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునే ఫక్తు తెలుగు సినిమా.

ఫస్ట్ టైం తమ కెరీర్ లో ఓ కొత్త జానర్, కొత్త క్యారెక్టర్లు ట్రై చేశామని శ్రీనువైట్ల, రవితేజ ప్రకటించుకున్నారు. నిజమే, వాళ్లకు ఇది కొత్తే. కానీ ప్రేక్షకులకు కాదు. ఇందులో ప్రతి సన్నివేశం ఓ సినిమాను రిప్రజెంట్ చేస్తుంది. చివరికి వైట్ల భరోసా ఇచ్చిన కామెడీ కూడా ఇందులో మిస్ అయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కమెడియన్ క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క పాత్ర కూడా కామెడీ చేసిన పాపాన పోలేదు. పించ్ హిట్టర్ లా వచ్చిన సునీల్ కూడా బేబి సిట్టర్ అంటూ తెగ ప్రయత్నించాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు. సినిమాలో అతడు చేసిన
కామెడీ కంటే వేసిన 2-3 డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే డైలాగ్స్ మరో ఎత్తు. సినిమాలో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు అంతా కొత్త వాళ్లతో పనిచేశాడు శ్రీనువైట్ల. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న రైటర్స్ ను తీసుకున్నట్టున్నాడు. సినిమా మొత్తం ఇంగ్లిష్ డైలాగులే. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇంగ్లిష్ సినిమా తీశాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ అయితే వైట్ల స్టయిల్ లో అలా వచ్చి, అర్థం చేసుకునేలోపే గందరగోళం సృష్టించి వెళ్లిపోతుంటాయి. అది శ్రీనువైట్ల స్టయిల్ అనుకోవాలంతే.

ఉన్నంతలో ఈ సినిమాలో ఆకట్టుకున్న అంశం ఏమైనా ఉందంటే అది ఇలియానా మాత్రమే. చాన్నాళ్ల తర్వాత తెలుగుతెరపై కనిపించిన ఇలియానా, కాస్త బొద్దుగా మారి మరింత ఎట్రాక్టివ్ గా కనిపించింది. మూవీలో ఆమె పోషించిన పాత్రను పక్కనపెడితే, తెరపై ఆమె కనిపించినంతసేపు కనువిందుగా ఉంటుంది. దీంతో పాటు అమెరికా లొకేషన్లు, ‘మైత్రీ’ ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి. ఈసారి తమన్ మార్క్ కనిపించలేదు. లయ రీఎంట్రీ వర్కవుట్ కాలేదు. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత అమర్ ఎవరో, అక్బర్ ఎవరో,
ఆంటోనీ ఎవరో అర్థంకాక ప్రేక్షకుడు తలపట్టుకోవాలి.

బాటమ్ లైన్ – రిటర్న్ గిఫ్ట్ ఆకట్టుకోలేదు

రేటింగ్ – 2/5