'అల్లుడు అదుర్స్' మూవీ రివ్యూ

Thursday,January 14,2021 - 07:36 by Z_CLU

నటీనటులు : బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్‌, వెన్నెల కిశోర్‌, స‌త్య తదితరులు.

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె. ప్ర‌సాద్‌

నిర్మాత: సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌

స‌మ‌ర్ప‌ణ‌: ర‌మేష్ కుమార్ గంజి

రచన -దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్

నిడివి : 149 నిమిషాలు

విడుదల : 14 జనవరి 2021

సంక్రాంతి రోజు ‘అల్లుడు అదుర్స్’ అంటూ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ సంక్రాంతి బరిలో ఎలాంటి విజయం అందుకున్నాడు ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

alludu-adhurs-telugu-review-zeecinemalu 1
కథ :

ఛలాకీతనంతో సరదాగా ఉండే శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఒక సందర్భంలో తన మిత్రుడిని కాపాడడం కోసం నిజామాబాద్ ఫ్యాక్షనిస్ట్ జైపాల్ రెడ్డి(ప్రకాష్ రెడ్డి) ఇంటికెళ్లి అక్కడ ఆయన కూతురు కౌముది(నభా నటేష్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు.

అలా కౌముది ప్రేమలో పడిన శ్రీను మరో వైపు తన మొదటి లవర్ వసుంధర(అను ఇమ్మానుయెల్) ని ఇంట్లో పెడతాడు. జైపాల్ రెడ్డిని కన్ఫ్యూజ్ చేసి ఎట్టకేలకు కౌముదిని ప్రేమలో పడేసిన శ్రీనుని చంపేందుకు చేస్తుంటాడు గజ(సోనూ సూద్). ఇంతకీ గజ ఎవరు..? అతను శ్రీనుని ఎందుకు చంపాలనుకుంటాడు ? అనేది మిగతా స్టోరి.

నటీనటుల పనితీరు :

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇది వరకు ఇలాంటి రోల్స్ చేసిన హీరోలని ఫాలో అవుతూ తన స్టైల్ లో చేసుకుంటూ పోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. కౌముది పాత్రలో నభా నటేష్ ఆకట్టుకొని తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. అను ఇమ్మానుయెల్ వసుంధరగా మంచి నటన కనబరిచింది. ప్రకాష్ రాజ్ గతంలో ఎన్నో సార్లు చేసిన పాత్రే కావడంతో మరోసారి ఈజ్ తో జైపాల్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ విలన్ గా సోనూ సూద్ తన క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు.

జయప్రకాష్ రెడ్డి చివరిసారిగా తన నటనతో థియేటర్స్ లో నవ్వించాడు. వెన్నెల కిషోర్ , సత్య, హరితేజ కామెడీ కొంత వరకు వర్కౌట్ అయ్యింది. బ్రహ్మాజీ, వేణు గోపాల్ , శ్రీనివాస్ రెడ్డి, జబర్దస్త్ శ్రీను, మహేష్, హేమంత్, సుదర్శన్, ఇంద్రజ, అనీష్ కురువిల్ల, హర్ష వర్ధన్,సత్య కృష్ణ తదితరులు దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు.

సాంకేతిక వర్గం పనితీరు :

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆశించిన ఉత్సాహం ఇవ్వలేదు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ పరవాలేదు. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ బాగుంది. భారీ సెట్స్ లో అతని పనితనం కనిపించింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న రొటీన్ కథ కి స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

alludu-adhurs-telugu-review-zeecinemalu 1
జీ సినిమాలు సమీక్ష :

యాక్షన్ కామెడీ డ్రామా అంటే నవ్వించే సన్నివేశాలతో పాటు అంతో ఇంతో కొత్తదనం కూడా ఉండాలి. లేదంటే ఈ జానర్ లో కొన్ని వందల సంఖ్యలో సినిమాలు చూసిన ప్రేక్షకులను అలరించడం కష్టం. అల్లుడు అదుర్స్ విషయానికొస్తే సంతోష్ రాసుకున్న కథతో పాటు స్క్రీన్ ప్లే , సన్నివేశాలు కూడా చాలా రొటీన్ అనిపించాయి. సినిమా ఆరంభంలోనే తను చూడబోయేది ఒక రొటీన్ సినిమా అని సగటు ప్రేక్షకుడు ఫీలయ్యే విధంగా సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు.

ఛలాకీగా తిరిగే హీరో… హీరోయిన్ తో ప్రేమ … మధ్యలో విలన్ .. అతన్ని కమెడియన్ ను చేసి ఆడుకుంటూ ఫైనల్ గా హీరోయిన్ ని పెళ్లి చేసుకునే హీరో ఇదే యాక్షన్ కామెడీ ఫార్మేట్. అల్లుడు అదుర్స్ కోసం కూడా సంతోష్ శ్రీనివాస్ ఇదే ఫార్మేట్ ను గుడ్డిగా ఫాలో అయిపోయాడు. కథ పరంగానే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అదే ఫార్మేట్ లో రొటీన్ గా రాసుకొని సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఒక సందర్భంలో దర్శకుడు తన ‘కందిరీగ’ సినిమానే మళ్ళీ అటు ఇటుగా మార్చి ఈ సినిమా తీశాడా ? అనే ప్రశ్న ప్రేక్షకులకు కలగక మానదు.

ప్రకాష్ రాజ్ , సోనూ సూద్ పాత్రలు ఎన్నో సినిమాల్లో చూసినవి గానే అనిపిస్తాయి. మొదటి భాగానికి విసుగు తెప్పించిన దర్శకుడు రెండో భాగంలో ఆ విసుగుని తారాస్థాయికి చేర్చాడు. హారర్ ఎలిమెంట్స్ తో నవ్వించే దర్శకుడి ప్రయత్నం చూసి అతనిపై జాలివేస్తుంది. చిన్న పిల్లలకు మినహా మిగతా వారికి ఆ ఎపిసోడ్ నవ్వు తెప్పించకపోగా చిరాకు తెప్పిస్తుంది. ఇంటర్వెల్ తో విలన్ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసిన దర్శకుడు ఇంటర్వెల్ తర్వాత కామెడీ విలన్ గా మార్చి రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకులకు బొర్ కొడుతూ విసుగు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ లో సోనూ సూద్ పాత్రను ఎంతో ఊహించుకున్న ఆడియన్స్ అతన్ని కామెడీ విలన్ గా చూడలేకపోయారు. ఓవరాల్ గా ‘అల్లుడు అదుర్స్’ ఒక రొటీన్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బోరింగ్ సినిమా.

రేటింగ్ : 2 /5