బంగారు బుల్లోడు రివ్యూ

Saturday,January 23,2021 - 03:48 by Z_CLU

నటీనటులు : అల్లరి నరేష్, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పోసాని, ప్రవీణ్, వెన్నెలకిషోర్ తదితరులు
మాటలు: వెలిగొండ శ్రీనివాస్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కెమెరా: సతీష్ ముత్యాల
సంగీతం: సాయి కార్తీక్
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి
రన్ టైమ్ : 129 నిమిషాలు
సెన్సార్ : U
రిలీజ్ డేట్: జనవరి 23, 2021

కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రమోట్ చేశారు. చాన్నాళ్ల తర్వాత మంచి కామెడీ చేశానని అల్లరి నరేష్ కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈరోజు థియేటర్లలోకి వచ్చిన బంగారు బుల్లోడు ఫుల్ కామెడీ అందించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Bangaru-bullodu-review-in-telugu

కథ

సీతానగరంలో తాత (తనికెళ్ల భరణి), ఇద్దరు అన్నయ్యలు (సత్యం రాజేష్, ప్రభాస్ శీను)తో కలిసి ఉంటుంటాడు భవానీ ప్రసాద్ (అల్లరి నరేష్). అదే ఊరిలో ఉన్న ఓ చిన్న బ్యాంక్ లో పనిచేస్తుంటాడు. పుట్టడంతోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ప్రసాద్ ను తాత పెంచి పెద్ద చేస్తాడు. కానీ ప్రసాద్ అన్నయ్యలు మాత్రం పేకాటకు అలవాటుపడి పనిపాట లేకుండా తిరుగుతుంటారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో
ఎవ్వరూ ఈ ముగ్గురికీ పిల్లనివ్వరు.

సడెన్ గా తన తాత చేసిన ఓ తప్పు తెలుసుకుంటాడు ప్రసాద్. ఆ తప్పును సరిదిద్దే బాధ్యతను తనపై వేసుకుంటాడు. ఈ క్రమంలో కనక మహాలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఇంతకీ ప్రసాద్ తాత చేసిన తప్పేంటి? ఆ తప్పుకు కనక మహాలక్ష్మికి సంబంధం ఏంటి? ఆ సమస్య నుంచి ప్రసాద్ అందర్నీ ఎలా బయట పడేశాడు అనేది స్టోరీ.

 

నటీనటుల పనితీరు

అల్లరోడికి ఇలాంటి పాత్రలు కొత్తకాదు. ఆడుతూపాడుతూ నటించేశాడు. సినిమాలో ఎక్కడా కష్టపడే అవకాశం-ఆస్కారం అతడికి రాలేదు. పూజా ఝవేరి నటించడం కంటే అందంగా కనిపించడానికి చాలా కష్టపడింది. పోసాని, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తమ పాత్రల మేరకు నటించారు.

జంధ్యాల తీసిన అహనా పెళ్లంట సినిమాలో బ్రహ్మానందం చేసిన లాంటి పాత్ర భద్రంకు దక్కింది. ఉన్నంతలో అతడు దాన్ని బాగానే రక్తి కట్టించాడు. రమాప్రభ, శ్యామల లాంటి పాత్రల్ని ఎందుకు తీసుకొచ్చాడో దర్శకుడికే తెలియాలి. కామెడీ కోసమే పెట్టానని ఫీలైతే మాత్రం పెద్ద తప్పు చేసినట్టే.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా దర్శకుడి గురించే మాట్లాడుకోవాలి. చిన్న పాయింట్ తో చక్కగా కథ అల్లుకున్నాడు దర్శకుడు గిరి. స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నాడు. కానీ అల్లరి నరేష్ సినిమాల కోసం వచ్చే ఆడియన్స్ ముందుగా ఏం ఆశిస్తారో, ఆ కామెడీని మాత్రం పూర్తిస్థాయిలో అందించలేకపోయాడు. సినిమాలో అక్కడక్కడ పెదాలు విచ్చుకుంటాయి తప్ప, పొట్టచెక్కలయ్యే కామెడీ మచ్చుకు కూడా కనిపించదు.

అల్లరినరేష్ మార్కెట్ కు తగ్గట్టే బడ్జెట్ పెట్టాడు నిర్మాత అనీల్ సుంకర. సినిమాను గోదావరి పల్లెల్లో తీసిన ఈ ప్రొడ్యూసర్, పనిలోపనిగా పాటల్ని కూడా అక్కడికక్కడే లాగించేశాడు. ‘స్వాతిలో ముత్యమంత’ రీమిక్స్ సాంగ్ లో మాత్రం సెట్ ప్రాపర్టీ కనిపించింది.

ఇక మిగతా టెక్నీషియన్స్ విషయానికొస్తే.. కథకు తగ్గట్టే సతీష్ ముత్యాల కెమెరా వర్క్ ఉంది. వర్మ ఎడిటింగ్ బాగుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఆకట్టుకోలేకపోయాడు.

Bangaru-bullodu-review-in-telugu

జీ సినిమాలు సమీక్ష

ఇంటర్వ్యూల్లో అల్లరినరేష్ చెప్పింది నిజమే. మంచి కథ దొరికితే, అందులో కామెడీ సెట్ అవ్వడం లేదు. పోనీ కామెడీ బేస్ చేసుకొని తీద్దామంటే కథ కుదరడం లేదు. బంగారు బుల్లోడు విషయంలో కూడా అదే రిపీటైంది. కథ-స్క్రీన్ ప్లే బాగా కుదిరిన ఈ సినిమాకు కామెడీ కలిసిరాలేదు.

అల్లరి నరేష్ సినిమాల నుంచి బేసిగ్గా కోరుకునేది కామెడీ. బంగారుబుల్లోడు సినిమాను కూడా మాంఛి కామెడీ సినిమాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఫస్టాఫ్ అయిన తర్వాత వెనక్కితిరిగి చూస్తే మనం ఎక్కడా నవ్వినట్టు గుర్తుకురాదు. పోనీ సెకండాఫ్ లో సంచుల కొద్దీ పంచ్ లు దాచారేమో అని కాస్త ఓపిక తెచ్చుకుని ఎదురుచూస్తే.. సినిమా అయిపోతుంది. శుభం కార్డు కూడా పడిపోతుంది. మెట్లు దిగి కిందకొస్తుంటే ఏదో వెలితి. సినిమాలో బాగా నవ్విన సన్నివేశం గుర్తుకురాక మనసులో ఏదో ఇబ్బంది.

తప్పనిసరి పరిస్థితుల మధ్య తాత చేసిన ఓ తప్పును సరిదిద్దే బాధ్యతను బాధ్యతను మనవడు అల్లరినరేష్ భుజానికెత్తుకుంటాడు. ఈ సీరియస్ సబ్జెక్ట్ ను ఫుల్ కామెడీగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఆ మేరకు బ్యాంక్ సెటప్, హీరోయిన్ తండ్రి, సెకండాఫ్ లో జబర్దస్త్ గ్యాంగ్ ను బాగానే సెట్ చేసుకున్నాడు. కానీ ఎవ్వర్నీ పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు.

కథ-స్క్రీన్ ప్లేపై పూర్తిగా దృష్టిపెట్టిన దర్శకుడు.. కామెడీ కోసం మంచి సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. చివరికి హీరోకి అన్నయ్యలుగా మరో ఇద్దరు కమెడియన్లను పెట్టి వాళ్లతో కూడా కామెడీ పండించలేకపోయాడు. దీనికితోడు తాత-మనవడు మధ్య ఎమోషన్, హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా పైపైన మాత్రమే సాగింది.

ఈ సంగతి పక్కనపెడితే కథ-స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మంచి పనితనం చూపించాడు. చిన్న పాయింట్ ను చక్కగా అల్లుకున్నాడు. సినిమాలో లాక్స్ కూడా బాగానే బిగించాడు. క్లైమాక్స్ లో వాటిని చాకచక్యంగా తెరిచాడు కూడా. ఈ విషయంలో దర్శకుడ్ని మెచ్చుకోవాల్సిందే. ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతోనే డైరక్టర్ గిరి టాలెంట్ ఆడియన్స్ కు తెలిసొచ్చింది. ఈ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు.

దశాబ్ద కాలంగా ఇలాంటి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అల్లరినరేష్.. బంగారు బుల్లోడిగా అలవోకగా నటించేశాడు. హీరోయిన్ పూజా ఝవేరిలో అందంతో పాటు యాక్టింగ్ కూడా తక్కువే. పోసాని, పృధ్వి, ప్రవీణ్ లాంటి నటుల్ని పాత్రల కోసం తీసుకున్నట్టుంది తప్ప, కామెడీ కోసం తీసుకున్నట్టు లేదు. వెన్నెల కిషోర్ పాత్ర-కామెడీని ఇరికించడానికి చేసిన ప్రయత్నం జస్ట్ పాస్ మార్కులు వేయించుకుంటుంది. ఈ తరహా పాత్రలతో వెన్నెల కిషోర్ నటన రొటీన్ అయిపోతోంది.

ఓవరాల్ గా బంగారు బుల్లోడు సినిమా టైమ్ పాస్ అందిస్తుంది కానీ, కామెడీని మాత్రం పండించలేకపోయింది.

రేటింగ్ – 2.25/5