'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ

Sunday,January 12,2020 - 01:13 by Z_CLU

నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్
సంగీతం: థమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్
బ్యానర్స్: హారిక-హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: త్రివిక్రమ్
రన్ టైమ్: 165
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: జనవరి 12, 2020

గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటూ లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన బన్నీ, ఆ గ్యాప్ ను భర్తీ చేశాడా? అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

పెద్ద వ్యాపారవేత్త రామచంద్ర (జయరాం) కుటుంబం వద్ద గుమాస్తాగా పనిచేస్తుంటాడు వాల్మీకి (మురళీ శర్మ). నిజానికి రామచంద్ర, వాల్మీకి ఇద్దరూ ఒకే స్థాయి వ్యక్తులు. కానీ తన కష్టంతో రామచంద్ర బిజినెస్ మేన్ అవుతాడు. అది వాల్మీకి భరించలేదు. వాళ్లిద్దరి భార్యలు ఒకేసారి హాస్పిటల్ లో జాయిన్ అయి, మగపిల్లలకు జన్మనిస్తారు. అదే సమయంలో వాల్మీకి కుతంత్రం పన్నుతాడు. బిడ్డల్ని మార్చేస్తాడు.

అలా రామచంద్ర కొడుకు బంటు (అల్లు అర్జున్) వాల్మీకి కొడుకుగా.. వాల్మీకి కొడుకు రాజా మనోహర్ (సుశాంత్) రామచంద్ర కొడుకుగా ఎదుగుతారు. పాతికేళ్ల తర్వాత ఈ రహస్యాన్ని బంటు తెలుసుకుంటాడు. ఇంతకీ బంటూకు ఈ రహస్యం ఎలా తెలిసింది? అప్పుడు అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ మొత్తం వ్యవహారంలో బంటు కుటుంబ సమస్యకు, అతడి ప్రేయసి అమూల్య (పూజా హెగ్డే)కు సంబంధం ఏంటనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

అల్లు అర్జున్ యాక్టింగ్ అదుర్స్. ఎక్కడా ఓవర్ ది బోర్డ్ అనిపించదు. కామెడీ, యాక్షన్, ఫైట్స్, ఎమోషన్.. ఇలా అన్ని యాంగిల్స్ లో బెస్ట్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో బన్నీ యాక్టింగ్ కట్టిపడేస్తుంది. అలాగే ఎప్పట్లానే స్టయిలిష్ గా కూడా కనిపించాడు. పూజా హెగ్డే చాలా గ్లామరస్ గా కనిపించింది.

నటీనటుల్లో మురళీశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వార్థం నిండిన పాత్రలో, డిఫరెంట్ మేనరిజమ్స్ తో మురళీశర్మ చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో అతడికి అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రీఎంట్రీలో టుబు ఆకట్టుకుంది. డైలాగ్స్ తక్కువగానే ఉన్నప్పటికీ ఆమె ఎప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అయింది. సుశాంత్, నవదీప్, సునీల్, రామకృష్ణ, నివేత తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా త్రివిక్రమ్ గురించే చెప్పుకోవాలి. ఈ సినిమా పాత కథను ఎంచుకున్నప్పటికీ దాన్ని చాలా కొత్తగా చెప్పడంతో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. ఎప్పుడూ తనలో రచయితనే ఇష్టపడతానని త్రివిక్రమ్ పదేపదే చెబుతుంటాడు. కానీ ఈసారి రచయితగా కంటే దర్శకుడిగా అతడు ఎక్కువగా ఎలివేట్ అయ్యాడు. ఎంతలా అంటే కొన్ని చోట్ల తన రైటింగ్ ను కూడా వదిలేసి హీరో ఎలివేషన్స్, తనకు పొసగని కొన్ని కామెడీ బ్లాకులపై ఫోకస్ పెట్టాడు. ఉదాహరణకు బోర్డ్ మీటింగ్ సీన్ లో పాటలతో సన్నివేశాలు అల్లే ఎపిసోడ్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించదు.
ఇంతకుముందు హరీష్ శంకర్, అనీల్ రావిపూడి లాంటి దర్శకులు వాడేశారు ఆ కాన్సెప్ట్ ని. మాటల్లో చమక్కులు తగ్గినా, స్క్రీన్ ప్లే-డైరక్షన్ విషయంలో త్రివిక్రమ్ టాలెంట్ చూపించాడు. క్లైమాక్స్ ఫైట్ ను భీభత్సంగా కాకుండా.. ఓ ఫోక్ సాంగ్ తో మిక్స్ చేసి చూపించడం కొత్తగా ఉంది.

ఇక డైరక్టర్ తర్వాత చెప్పుకోదగ్గ టెక్నీషియన్ తమన్. ఈ సినిమాకు రిలీజ్ ముందు నుంచి ఫేస్ వాల్యూగా మారిన తమన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దద్దరిల్లించాడు. సినిమాకు అతడిచ్చిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయింది. సామజవరగమన సాంగ్ ను చూస్తూ ఎంజాయ్ చేసిన ఆడియన్స్.. రాములో రాముల సాంగ్ కు ఈలలు వేస్తూ గోలగోల చేస్తారు. దీనికి తోడు బుట్టబొమ్మ, ఓ మై గాడ్ డాడీ సాంగ్స్ కూడా స్క్రీన్ పై చాలా బాగున్నాయి.

పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ప్రకాష్ ఆర్ట్ వర్క్ టాప్ లెవెల్లో ఉన్నాయి. హారిక-హాసిని, గీతాఆర్ట్స్ సంస్థలు ఏ చిన్న ఫ్రేమ్ లో కూడా కాంప్రమైట్ అవ్వకుండా ఖర్చు చేశారు.

జీ సినిమాలు రివ్యూ

ఏ జానర్ కథైనా సీరియస్ గానే ఉంటుంది. దాన్ని ఎంత ఎంటర్ టైనింగ్ గా చెప్పామనేది ముఖ్యం. అల వైకుంఠపురములో కథ కూడా చాలా పెద్దది. పైగా బరువైనది కూడా. అలాంటి కథను చాలా తేలికపరిచి… మెత్తగా, సరదాగా అందరికీ అర్థమయ్యేలా అద్భుతంగా వివరించాడు దర్శకుడు త్రివిక్రమ్. 1980ల నాటి ఈ కథను 2020లో చెప్పాలంటే కత్తిమీద సామే. కానీ త్రివిక్రమ్ తన మాటలతో కత్తిని కూడా పూలపాన్పుగా మార్చేశాడు. ఎలాంటి సాము చేయకుండా స్క్రీన్ ప్లేను నల్లేరు మీద నడకలా మార్చాడు. దీనికి బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం యాడ్ అయింది. సో.. రిజల్ట్ హిట్.

పుట్టినప్పుడే బిడ్డలు మారిపోవడం అనే కాన్సెప్ట్ రాజనాల కాలం నుంచి చూస్తున్నాం. ఇంటర్వ్యూల్లో బన్నీ-త్రివిక్రమ్ చెప్పినట్టు ఇది సరదా సరదా కథ కాదు. అసలు ఇలాంటి కథను ఈ కాలంలో భుజానికెత్తుకోవడమే పెద్ద రిస్క్. కానీ బన్నీ, త్రివిక్రమ్ ను నమ్మాడు. త్రివిక్రమ్ తన నెరేషన్ ను నమ్మాడు. ఆ నమ్మకం ఈ సంక్రాంతికి నిజమైంది. సినిమా స్టార్ట్ అవ్వడమే పెద్ద మెలోడ్రామాతో మొదలవుతుంది. ఇక ఇలానే సాగుతుందేమో అనే భయాన్ని పటాపంచలు చేస్తూ బన్నీ ఎంటర్ అవుతాడు. పాతికేళ్ల తర్వాత అనే ట్యాగ్ లైన్ తో ఈ కాలానికి కథను షిఫ్ట్ చేయడంతో పాటు బన్నీని కూల్ గా, పక్కింటి కుర్రాడిలా చూపించి త్రివిక్రమ్ చాలా మంచి పని చేశాడు.

బన్నీ ఎంటరైనప్పట్నుంచే కథ పరుగులు పెడుతుంది. ఓవైపు బన్నీ ఎనర్జిటిక్ యాక్షన్, మరోవైపు త్రివిక్రమ్ మాటలు మన కళ్లను, చెవుల్ని కట్టిపడేస్తాయి. కథ పక్కదారి పడుతోందేంటి.. అసలు సంబంధం లేని ఈ కథలోకి విలన్ ఎందుకొచ్చాడు.. రాహుల్ రామకృష్ణతో అంత డిస్కషన్ ఎందుకు.. లాంటి అనుమానాలకు తావులేకుండా ‘అతడి’ మాటలు, ‘ఇతడి’ యాక్టింగ్ మనల్ని ఇంటర్వెల్ వరకు తీసుకెళ్లిపోతాయి.

ఇంటర్వెల్ కే హీరోకు అసలు విషయం తెలిసిపోతుంది. మరి ఇంటర్వెల్ తర్వాత హీరో ఏం చేయాలి. సరిగ్గా ఇక్కడే త్రివిక్రమ్ “వైకుంఠపురం”కి ఓ కష్టాన్ని సృష్టించాడు. దీన్ని హడావుడిగా పెడితే ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి సినిమా స్టార్టింగ్ నుంచే మెల్లగా విలనిజాన్ని పరిచయం చేయడం స్టార్ట్ చేశాడు. ఇక “వైకుంఠపురం”లోకి అడుగుపెట్టిన తర్వాత హీరో ఏం చేయాలి. కాస్త ఆలోచిస్తే అత్తారింటికి దారేది గుర్తుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రేక్షకుడికి ఆ ఆలోచన తట్టకుండా భారీ స్టార్ కాస్ట్ తో మేజిక్ చేశారు. అప్పటికే దశలవారీగా పరిచయమైన టబు, సచిన్ ఖేడ్కర్, సునీల్, సుశాంత్, జయరాం, నివేత లాంటి వాళ్లంతా స్క్రీన్ ను రంగులమయం చేశారు. మధ్యమధ్యలో వచ్చిపోతూ రాజేంద్రప్రసాద్ కూడా తన మార్క్ కామెడీ పండించాడు. ఎప్పట్లానే బన్నీ-త్రివిక్రమ్ బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అంతా సాఫీగా “సాగి”పోతూ.. కథ క్లైమాక్స్ కు చేరిపోతుంది.

క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం త్రివిక్రమ్ ఫ్రంట్ సీట్లోకి వచ్చేశాడు. పెన్ నిండా ఇంక్ నింపుకొని తన పవర్ చూపించాడు. అసలు విషయం చెబితే మూవీపై ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి చెప్పడం లేదు కానీ, త్రివిక్రమ్ మాత్రం క్లైయిమాక్స్ ను ఒంటిచేత్తో నడిపించాడు. ఫ్రేమ్స్ చూస్తే అత్తారింటికి దారేది క్లైమాక్స్ ను గుర్తుకుతెచ్చినా, పూర్తిగా కొత్త ట్రీట్ మెంట్ ఇచ్చి తన పనితనం చాటుకున్నాడు.

ఓవరాల్ గా అల వైకుంఠపురములో సినిమా ఈ సంక్రాంతికి సిసలైన హిట్ బొమ్మ అనిపించుకుంది.

రేటింగ్3.25/5