Movie Review - అక్షర

Friday,February 26,2021 - 02:45 by Z_CLU

నటీనటులు – సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన – దర్శకత్వం : బి.చిన్నికృష్ణ
నిడివి: 2 గంటల 16 నిమిషాలు
సెన్సార్ : U
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 26, 2021

దర్శకుడు చిన్నికృష్ణ సినిమాల్లో ఫన్ ఉంటుంది.. నందిత శ్వేత సినిమాల్లో కాన్సెప్ట్ ఉంటుంది.. మరి వీళ్లిద్దరూ కలిసి చేసిన అక్షర ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Akshara Movie release on February 26 nandita swetha

కథ

అక్షర తెలివైన అమ్మాయి. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి MSc-Physcis చదవి ఓ కాలేజ్ లో లెక్చరర్ గా చేరుతుంది. అదే కాలేజీకి డైరక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్న శ్రీతేజ్, అక్షర అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు.

సేమ్ టైమ్ అక్షర దిగిన కాలనీలో కూడా ముగ్గురు అబ్బాయిలు (సత్య, షకలక శంకర్, మధునందన్) ఆమెను ప్రేమిస్తుంటారు. ఎలాగైనా అక్షరను ఆకర్షించాలని తెగ ప్రయత్నిస్తుంటారు.

ఓరోజు శ్రీతేజ్, అక్షరకు ప్రపోజ్ చేస్తాడు. సేమ్ టైమ్.. అక్షర బ్యాగ్ నుంచి గన్ తీస్తుంది. శ్రీతేజను చంపేస్తుంది. ఆ సీన్ ను కాలనీకి చెందిన ముగ్గురు అబ్బాయిలు చూస్తారు. సాఫ్ట్ గా కనిపించే అక్షర ఒక్కసారిగా ఎందుకు వయొలెంట్ గా మారింది? శ్రేతేజను ఆమె చంపాల్సిన అవసరం ఏంటి? అక్షర
అసలు టార్గెట్ ఏంటి? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు

నందిత శ్వేత మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది. సినిమాను (మరీ ముఖ్యంగా సెకండాఫ్) ఒంటి చేత్తో నడిపించింది. సాఫ్ట్ గా, యాంగ్రీ యంగ్ ఉమెన్ గా.. ఇలా రెండు డిఫరెంట్ షేడ్స్ ను ఆమె బాగా పండించింది. నందిత శ్వేత తర్వాత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ హర్షవర్థన్, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడి పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక కార్పొరేట్ స్కూల్ బాస్ గా తొలిసారి నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన సంజయ్ స్వరూప్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. కాలనీ అబ్బాయిలుగా సత్య, షకలక శంకర్, మధునందన్.. కాలనీ ప్రెసిడెంట్ గా అజయ్ ఘోష్ తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

కెమెరామెన్ నగేష్ పనితీరు బాగుంది. సురేష్ బొబ్బిలి అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. సత్య ఎడిటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో కొన్ని కత్తెర్లు పడాల్సింది. ఆల్రెడీ రన్ టైమ్ తక్కువగా ఉండడంతో, చూసీచూడనట్టు వదిలేసినట్టుంది. సినిమాహాల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతలు సురేష్, అహితేజ కథకు తగ్గట్టు ఎంత ఖర్చుపెట్టాలో అంత ఖర్చుచేశారు.

Akshara Movie release on February 26 nandita swetha

జీ సినిమాలు రివ్యూ

మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మెసేజ్ మాత్రమే ఇవ్వాలి. వినోదం అందించాలనుకుంటే వినోదం మాత్రమే పండించాలి. రెండూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీసే రోజులు పోయాయి. చెప్పాల్సిన విషయం సూటిగా, సుత్తిలేకుండా చెప్పేయడమే. అది ఇప్పుడు ట్రెండ్. అందుకే నాంది లాంటి కథలు కూడా కనెక్ట్ అయ్యాయి. ఈ విషయంలో అక్షర నిరాశపరుస్తుంది. సెకండాఫ్ మొదలైతే తప్ప అసలు కథలోకి
తీసుకెళ్లని అక్షర.. ఫస్టాఫ్ లో మన సహనానికి ఎగ్జామ్ పెడుతుంది.

ఈ సినిమాకు మంచి పాయింట్ అనుకున్నాడు దర్శకుడు చిన్ని కృష్ణ. కార్పొరేట్ విద్యా వ్యవస్థను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాతో చిన్నికృష్ణ పెద్ద ధైర్యమే చేశాడు. ఈ మూవీ కోసం అతడు బాగా రీసెర్చ్ చేశాడనే విషయం కూడా సినిమాలో కనిపిస్తుంది. కానీ సీరియస్ గా చెప్పాల్సిన పాయింట్ కు షుగర్ కోటింగ్ ఇవ్వాలని చూశాడు డైరక్టర్. దీనికోసం మధునందన్, సత్య, షకలక శంకర్, అజయ్ ఘోష్
లాంటి నటుల్ని నమ్ముకున్నాడు.

మంచి సీన్స్ పడితే రక్తి కట్టించగలిగే సత్తా ఉన్న నటులే వీళ్లంతా. కానీ ఫస్టాఫ్ లో వీళ్ల టాలెంట్ ను ఎలివేట్ చేసే సీన్లు పెద్దగా పడలేదు. ఉన్నంతలో సత్య ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తప్ప షకలక శంకర్, మధునందన్ ను పెద్దగా వాడుకున్నట్టు కనిపించదు. అటు అజయ్ ఘోష్ తో చేసిన కామెడీ ప్రయత్నం కూడా సగం మార్కులే రాబట్టుకుంటుంది. నందిత శ్వేత తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. శ్రేతేజ తన పాత్రకు బాగా సూట్ అయ్యాడు. విలన్ గా నటించిన సంజయ్ స్వరూప్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.

సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి నందిత శ్వేతను సంప్రదాయబద్ధంగా, పవిత్రంగా చూపించినప్పుడే  ఆడియన్స్ కు అనుమానం వస్తుంది. ఆమె నుంచి ఏదో పెద్ద ట్విస్ట్ ఉంటుందని ఊహిస్తారు. ఆ ఊహలకు తగ్గట్టుగానే నందిత శ్వేత పాత్రతో ఇంటర్వెల్ బ్యాంగ్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ నుంచి కథ పరుగులు పెడుతుంది. ప్రీ-క్లైమాక్స్ నుంచి సందేశం వైపు టర్న్ తీసుకుంటుంది సినిమా. ఆ తర్వాత ఓ ఎమోషనల్ సాంగ్ తో సినిమాకు శుభం కార్డు వేస్తాడు దర్శకుడు.

ఓవరాల్ గా అక్షర సినిమా సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తుంది. ఫస్టాఫ్ కాస్త భరించగలిగితే, సెకండాఫ్ నుంచి సినిమా ఎక్కుతుంది. కొత్త కథల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాను ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటాడనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

రేటింగ్2.5/5