అజిత్ 'వివేకం' రివ్యూ

Thursday,August 24,2017 - 02:25 by Z_CLU

నటీ నటులు : అజిత్ , కాజల్ అగర్వాల్ , అక్షర హాసన్ , వివేక్ ఒబెరాయ్

సినిమాటోగ్రఫీ : వెట్రి

మ్యూజిక్ : అనిరుధ్

కథ : శివ – ఆది నారాయణ

నిర్మాణం : వంశ‌ధార క్రియేష‌న్స్

నిర్మాత : న‌వీన్‌ శొంఠినేని

మాటలు -స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శివ

రిలీజ్ డేట్ : 24 ఆగస్ట్ 2017

వరుసగా అజిత్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు దర్శకుడు శివ. ‘వేదాలమ్’ తీశాడు సూపర్ హిట్ కొట్టాడు. అంతకంటే ముందు ‘వీరమ్’ తీశాడు. అది కూడా హిట్టే. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘వివేకం’ తీశాడు. మరి ఈ సినిమాతో శివ హ్యాట్రిక్ కొట్టాడా..? చూద్దాం..

 

కథ

ప్రపంచలోనే ది బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అజిత్. ఎవరికీ దొరకని శత్రువుల్ని పట్టుకోవడంఎవరి వల్ల కాని పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయడంలో ఎక్స్ పర్ట్. అలాంటి అజిత్ కు ఓ కీలకమైన ఆపరేషన్ అప్పగిస్తారు. కృత్రిమంగా భూకంపాలు సృష్టించే అణుబాంబుల్ని నిర్వీర్యం చేసే పని అది. ఇందులో భాగంగా సగం పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశాడు అజిత్. కానీ మిగతా సగం పూర్తిచేయకుండా ప్రాణస్నేహితులే వెన్నుపోటు పొడుస్తారు. అలా నమ్మక ద్రోహానికి గురైన అజిత్.. తనను మోసం చేసిన వాళ్లను ఎలా చంపాడు… అతిపెద్ద ప్రమాదం నుంచి దేశాన్ని ఎలా కాపాడుతాడు.. ఈ క్రమంలో తన భార్యను ఎలా రక్షించుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

అజిత్ ఇండస్ట్రీకొచ్చి పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదలైన చిత్రమిది. అందుకే తమిళనాట ఈ మూవీని వెరీ వెరీ స్పెషల్ గా చూస్తున్నారు. ఈ సినిమా కోసం 10 రోజుల ముందు నుంచి అక్కడ మిగతా సినిమాల రిలీజ్ లు ఆపేశారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఆ క్రేజ్ కు తగ్గట్టే అజిత్ కనిపించాడు. సినిమాలో వన్ మేన్ షో చూపించాడు. అజిత్ రిస్కీ స్టంట్స్యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. 46 ఏళ్ల వయసులో కూడా అజిత్ ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేశాడంటే అతడ్ని మెచ్చుకోవాల్సిందే.

ఇక అజిత్ తర్వాత కీలక పాత్ర పోషించిన వ్యక్తి వివేక్ ఒబరాయ్. ఫస్టాఫ్ లో ఫ్రెండ్ గాసెకెండాఫ్ లో శత్రువుగా కనిపించి బాగానే ఆకట్టుకున్నాడు. ఇప్పటికే విలన్ గా నటించిన అనుభవం వివేక్ కు పనికొచ్చింది. ఇక హీరోయిన్ కాజల్మరో కీలక పాత్ర పోషించిన అక్షరహాసన్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాజల్ ఈసారి కాస్త బరువైన పాత్ర పోషించి ఓకే అనిపించుకుంది. ఇక అక్షర హాసన్ చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నటన తన బ్లడ్ లోనే ఉందని ప్రూవ్ చేసుకుంది. మిగతా పాత్రలు పోషించిన నటులంతా తమతమ రేంజ్ కు తగ్గట్టు నటించారు.

 

టెక్నీషియన్ల పనితీరు

వివేకం సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ టీం మొత్తాన్ని మెచ్చుకోవాల్సిందే. యూరోప్ దేశాల్లో యూనిట్ పడిన కష్టం సినిమాలో కనిపించింది. మరీ ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ వెట్రి బ్రహ్మాండమైన అవుట్ పుట్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అనిరుధ్ అందించిన రీరికార్డింగ్ పార్టులు పార్టులుగా బాగుంది. పాటల విషయంలో మాత్రం ఈ కుర్రాడు ఫెయిల్. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. 30 ఏళ్లకు పైగా పరిశ్రమలో ఉన్న సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చింది. వివేకం మూవీకి మాత్రం ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు.

 

జీ సినిమాలు సమీక్ష

ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ కు నిజంగా పండగే. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హీరో ఇంట్రడక్షన్ అనిపించేలా సీన్లు వస్తాయి. హీరోగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చేసిన సినిమా కాబట్టిఫ్యాన్స్ కు ఏం కావాలో అదే అందించాడు శివ. సినిమా మొత్తాన్ని అజిత్ చుట్టూనే తిప్పాడు. అజిత్ లాంటి హీరోను పెట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా చేయాలనుకోవడం తప్పులేదు. కానీ అలాంటి ఇంటర్నేషనల్ సినిమా కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా అదే రేంజ్ లో లేకపోతే చూడ్డానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉదాహరణకు క్లైమాక్స్ లో కాజల్ తో పాట పాడించే సీన్. కాజల్ పాట పాడుతుంటే అజిత్ ఫైట్ చేయడం చూసిన ప్రేక్షకులు నవ్వుకున్నారు. తమిళ్ లో ఈ ఎత్తుగడ క్లిక్ అవ్వొచ్చుకానీ తెలుగులో అస్సలు వర్కవుట్ కాదు. దానికి తోడు ఈ ఎపిసోడ్ లో కాజల్ ఓవరాక్షన్ భరించడం కాస్త కష్టమే.

మిషన్ ఇంపాజిబుల్జేమ్స్ బాండ్ట్రిపుల్ ఎక్స్ లాంటి కథలకు తమిళ వాసనలు అద్దితే ఎలా ఉంటుందో వివేకం అలానే ఉంటుంది. సినిమాలో అజిత్ ను తప్పుపట్టలేం. తప్పంతా దర్శకుడు శివలోనే ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా చేస్తున్నప్పుడుఅలాంటి కథను ఎన్నుకున్నప్పుడు ఆ ప్రమాణాలే పాటించాలి. ఆ పాత్రలు ఎలా రియాక్ట్ అవుతాయో వాటిని అలానే చూపించాలి. ఈ విషయంలో శివ ఫెయిల్ అయ్యాడు.

ఫైనల్ గా చెప్పాలంటే వివేకం సినిమా అజిత్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటిది. వివేకం అంటే అజిత్. అజిత్ అంటే వివేకం. అంతకుమించి సినిమాలో ఏమీ కనిపించదు. ఇంతకుమించి ఆశించొద్దు.

 

రేటింగ్ – 2.5 /5