'యాక్షన్' మూవీ రివ్యూ

Friday,November 15,2019 - 01:56 by Z_CLU

నటీనటులు: విశాల్‌, తమన్నా, రాంకీ, యోగిబాబు, ఆకాంక్ష, ఐశ్వర్యలక్ష్మి, భరత్, కబీర్ సింగ్ తదితరులు

సంగీతం: హిప్‌హాప్‌ తమిళ

సినిమాటోగ్రఫీ: డుడ్లీ

ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌

నిర్మాత : శ్రీనివాస్‌ ఆడెపు

దర్శకత్వం: సుందర్‌ సి.

బ్యానర్: శ్రీ కార్తికేయ సినిమాస్

సెన్సార్: U/A

రన్ టైమ్: 2 గంటల 37 నిమిషాలు

రిలీజ్ డేట్: నవంబర్ 15, 2019

 

ఓన్లీ యాక్షన్.. విశాల్ కొత్త సినిమా ట్యాగ్ లైన్ ఇదే. టైటిల్ కూడా ఇదే. ఇలా పూర్తిగా యాక్షన్ నే నమ్ముకొని ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కు సక్సెస్ అందించిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

సుభాష్ (విశాల్) ఆర్మీలో పనిచేస్తుంటాడు. దేశం అంటే అతడికి ఇష్టం. అందుకే తండ్రి ముఖ్యమంత్రి అయినా, అన్న కాబోయే ముఖ్యమంత్రి అయినప్పటికీ పొలిటికల్ కెరీర్ వదులుకొని ఆర్మీలో వర్క్ చేస్తుంటాడు. అయితే అనుకోని విధంగా విశాల్ కుటుంబంపై దాడి జరుగుతుంది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రధాని అభ్యర్థిని చంపేస్తారు కొంతమంది దుండగులు. అది కూడా విశాల్ అన్నయ్య (రాంకీ) కళ్లముందే జరుగుతోంది. దీంతో ఆ హత్య కేసు రాంకీకి చుట్టుకుంటుంది. అదే సమయంలో రాంకీ కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. అంతకంటే ముందే తను ప్రేమించిన మరదలు మీరా (ఐశ్వర్య లక్ష్మి)ను బాంబ్ బ్లాస్ట్ లో కోల్పోతాడు విశాల్.

ఇలా ఊహించని విధంగా తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు విశాల్. ఇంతకీ విశాల్ కుటుంబాన్ని నాశనం చేసింది ఎవరు? ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని, ప్రధాని అభ్యర్థిని చంపారు? పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న మాలిక్ (కబీర్ సింగ్)కు ఈ హత్యలకు ఏంటి సంబంధం అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు

విశాల్ యాక్షన్ ఆడియన్స్ కు కొత్తకాదు. ఎన్నో సినిమాలతో మెప్పించాడు. అయితే ఈ సినిమా అంతకుమించి అన్నట్టు ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, ఛేజింగ్స్ ఇందులో ఉన్నాయి. విశాల్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్. ఇతడికి తోడుగా నిలిచే క్యారెక్టర్ లో తమన్న ఆకట్టుకుంది.

విశాల్ అన్నగా నటించిన రాంకీ ఉన్న కొద్దిసేపు ఆకట్టుకున్నాడు. విశాల్ ప్రేయసిగా నటించిన ఐశ్వర్యలక్ష్మి, ప్రొఫెషనల్ కిల్లర్ గా నటించిన ఆకాంక్ష, హ్యాకర్ గా నటించిన యోగిబాబు, విశాల్ బావగా నటించిన శివ షారా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

సుందర్ సి ఇప్పటివరకు ట్రై చేయని జానర్ ఇది. తన శక్తి మేరకు కాస్త కొత్తగా యాక్షన్ ఎలిమెంట్స్ చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆల్రెడీ ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు కోలీవుడ్-టాలీవుడ్ స్క్రీన్స్ పైకి వచ్చేశాయి. సుందర్ కు ఇవి కొత్తేమో కానీ ప్రేక్షకులకు కాదు. ఉన్నంతలో విశాల్ ఇలాంటి స్టంట్స్ చేయడం కొత్త. మరో మిస్టేక్ ఏంటంటే.. పూర్తిగా యాక్షన్ పైనే దృష్టిపెట్టడంతో కథ-స్క్రీన్ ప్లేను లైట్ తీసుకున్నట్టున్నాడు సుందర్.

ఇక మ్యూజీషియన్ హిపాప్ తమీజా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతడి వర్క్ వినిపిస్తుంది. పాటల విషయంలో మాత్రం ఇతడు ఫెయిల్. ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. డుడ్లీ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ ఎడిటింగ్ బాగాలేదు. ఇతడు కూడా యాక్షన్ సన్నివేశాల వరకు మాత్రమే వర్క్ చేసినట్టున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ

ఏ జానర్ లో సినిమా చేసినా అందులో తన మార్క్ యాక్షన్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడుతుంటాడు విశాల్. ఈ హీరో ఫ్యాన్స్ ఎక్కువమంది కోరుకునేది కూడా ఇదే. అందుకే కుటుంబకథాచిత్రం చేసినా కూడా అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఇరికిస్తుంటాడు ఈ హీరో. అలాంటిది ఈసారి ఏకంగా యాక్షన్ అనే టైటిల్ పెట్టి, కంప్లీట్ యాక్షన్ మూవీ చేశాడు. విశాల్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది సినిమా, కానీ సగటు ఆడియన్ కు మాత్రం సగమే కనెక్ట్ అవుతుంది.

ఎందుకంటే, ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే ఉంది. థ్రిల్ అస్సల్లేదు. పైపెచ్చు ఇలాంటి సినిమాలకు కీలకమైన స్క్రీన్ ప్లే కూడా మిస్ అయింది. స్టార్టింగ్ లోనే బోర్ కొట్టించిన దర్శకుడు.. ఇంటర్వెల్ బ్యాంగ్ కు వచ్చేసరికి బాగానే సినిమాను రక్తికట్టించాడు. అయితే ఆ తర్వాత కూడా గాడితప్పి ఎప్పట్లానే మళ్లీ బోర్ కొట్టించాడు. మధ్యమధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఈ “యాక్షన్” సినిమాను ఆదుకునే ఎలిమెంట్.

సగటు సినిమా ఫ్రేమింగ్ (టెంప్లేట్ ఫార్ములా) నుంచి ఎందుకో చాలామంది దర్శకులు బయటకు రాలేకపోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ ఎంచుకున్నప్పటికీ అందులో కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, మంచి పాటల్లాంటివి పెట్టాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటివేం లేకుండానే పక్కా స్క్రీన్ ప్లే, పెర్ ఫెక్ట్ ఎడిటింగ్ తో హిట్ అయిన సినిమాలు తెలుగు-తమిళ భాషల్లో చాలా ఉన్నాయి.

దర్శకుడు సి.సుందర్ మాత్రం ఇంకా ఆ పాత పద్ధతి నుంచి బయటకు రాలేదనిపిస్తోంది. తెరపై చూపించేది యాక్షన్ మూవీ అయినప్పటికీ, మధ్యమధ్యలో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎలిమెంట్స్ కూడా అందించాలని తాపత్రయపడ్డాడు. అక్కడే “యాక్షన్” బెడిసికొట్టింది. సైడ్ ఎలిమెంట్స్ కోసం చూడకుండా పూర్తిగా కథపై ఫోకస్ పెట్టి, పక్కాగా సన్నివేశాలు రాసుకొని, ఇవే యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడించి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.

ఉన్నంతలో ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ విశాల్ మాత్రమే. విశాల్ మరోసారి తన సత్తా చాటాడు. యాక్షన్ సీక్వెన్సెస్ ఎంతో కష్టపడి చేశాడు. అతడి ఫైట్ సీక్వెన్సెస్ కోసం సినిమాను ఓసారి చూడొచ్చు. అతడికి తోడుగా నిలిచిన తమన్న కూడా లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంది. టెక్నికల్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గురించే చెప్పుకోవాలి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ బాగా వర్క్ చేశారు.

ప్లస్ పాయింట్స్
– యాక్షన్ సన్నివేశాలు
– విశాల్ యాక్టింగ్
– ఛేజింగ్ సీన్స్
– ఇంటర్వెల్ బ్యాంగ్
– ప్రీ క్లయిమాక్స్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్
– స్క్రీన్ ప్లే
– బోర్ కొట్టించే సన్నివేశాలు
– ట్విస్టులు లేకపోవడం
– పాటలు
– లాజిక్ మిస్ అవ్వడం

ఓవరాల్ గా యాక్షన్ సినిమా విశాల్ అభిమానులకు, యాక్షన్ లవర్స్ కు బాగా నచ్చుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

రేటింగ్2.5/5