అభిమన్యుడు మూవీ రివ్యూ

Friday,June 01,2018 - 11:59 by Z_CLU

నటీనటులు: విశాల్‌, సమంత, అర్జున్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌
మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి
దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్
నిర్మాత: జి.హరి
విడుదల తేది : 1 జూన్ 2018

ఆసక్తికరమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న హీరో విశాల్ డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలపై ‘అభిమన్యుడు’ లా బాణం ఎక్కుపెట్టాడు. మరి తమిళ్ లో సూపర్ హిట్ సాదించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకూ ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ:
ఆర్మీ ఆఫీసర్ అయిన కరుణాకర్(విశాల్) తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి . కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఓర్చుకోలేని తత్వంతో ఓసారి ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్ ను చావబాదుతాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేసి సైక్రియాట్రిస్ట్ డాక్టర్ లతాదేవి(సమంతా)దగ్గరకు 6 వారాల పాటు ట్రీట్ మెంట్ కోసం పంపిస్తారు. అలా డాక్టర్ గా పరిచయమైన లతా దేవితో ప్రేమలో పడతాడు కరుణాకర్. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వచ్చిన కరుణాకర్ ను తిరిగి తన తండ్రి(ఢిల్లీ గణేష్), చెల్లెలు దగ్గరకు పంపుతుంది లత.

అలా సొంత ఊరు వెళ్ళిన కరుణాకర్ తన చెల్లెలు పెళ్లి కోసం ఓ ఏజెంట్ సహాయంతో 6 లక్షలు లోన్ తీసుకుంటాడు. పొలం అమ్మగా వచ్చిన మరో 4 లక్షలతో కలిపి మొత్తం 10 లక్షల్ని తండ్రి అకౌంట్ లో వేస్తాడు కరుణాకర్.. అయితే ఉన్న డబ్బంతా కొన్ని గంటల్లోనే మాయమవుతుంది. అకౌంట్ లో నుండి డబ్బు మాయమైపోవడంతో షాక్ తిన్న కరుణాకర్ తన డబ్బు మాయం చేసిన వారి కోసం వెతికే క్రమంలో ఈ సైబర్ క్రైమ్ వెనుక వైట్ డెవిల్(అర్జున్) అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంతకీ వైట్ డెవిల్ ఎవరు? సైబర్ క్రైమ్స్ చేస్తూ అమాయకుల నుండి డబ్బు దొంగలిస్తున్న వైట్ డెవిల్ ను కరుణాకర్ ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:
విశాల్ ఎప్పట్లానే బాగా నటించాడు. సినిమా మొత్తానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఇతడే. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తిగా విశాల్ నటన బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ పండిస్తున్నప్పుడు కూడా తన సీనియారిటీ చూపించాడు. విశాల్ తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి అర్జున్. సినిమాకు విశాల్ ఎంత కీలకమో, అర్జున్ కూడా అంతే. నిజానికి అర్జున్ లేకపోతే అభిమన్యుడు సినిమా లేదు. మరో నటుడ్ని ఈ పాత్రలో ఊహించుకోలేం. అంత బాగా వైట్ డెవిల్ పాత్రను రక్తికట్టించాడు అర్జున్.

ఇక హీరోయిన్ సమంత ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాలో నటించడానికి ఆమెకు పెద్దగా స్కోప్ దక్కలేదు. పైగా పాటలు కూడా లేకపోవడంతో సమంత పార్ట్ తగ్గిపోయింది. అతికష్టమ్మీద సెకెండాఫ్ లో ఓ డ్యూయట్ ఇరికించారు. మిగతా నటీనటులందరికీ చిన్నచిన్న పాత్రలే దక్కాయి.

టెక్సీషియన్స్ పనితీరు:
సైబర్ క్రైమ్ కాన్సెప్ట్ అంటే ఆ ఫీల్ తీసుకురావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఉమేష్ కుమార్ తన టాలెంట్ చూపించాడు. ఆర్ట్ డైరక్టర్ గా ఉమేష్ కు ఈ సినిమాతో మంచి మార్కులు పడతాయి. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. టెక్నికల్ గా ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్స్ వీళ్లే.

యువన్ శంకర్ రాజాలో మునుపటి స్పార్క్ తగ్గింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. ఉన్న రెండు పాటలు తమిళ్ లో హిట్ అయ్యాయి కానీ డబ్బింగ్ కారణంగా తెలుగులో ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పెర్ ఫెక్ట్ గా ఉంది. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ అదిరిపోయాయి. సబ్ వే లో తీసిన ఫైట్ తో పాటు, క్లైయిమాక్స్ లో విశాల్-అర్జున్ మధ్య వచ్చిన ఫైట్ సూపర్.

దర్శకుడిగా మిత్రన్ మరోసారి సక్సెస్ అయ్యాడు. కాస్త క్లిష్టమైన ఆన్ లైన్ మోసం అనే సబ్జెక్ట్ ను సి-సెంటర్ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చెప్పి శభాష్ అనిపించుకున్నాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ:
సైబర్ క్రైమ్స్, ఆన్ లైన్ మోసాలు… బడా బడా వ్యాపారస్తుల నుంచి కామన్ మేన్ వరకు అందరికీ విస్తరించింది. ఎప్పుడు ఎవరి ఎకౌంట్ నుంచి డబ్బు మాయమౌతుందో తెలీదు. ప్రతి రోజు న్యూస్ పేపర్స్, టీవీల్లో ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకొని అందరికీ కనెక్ట్ అయిపోయాడు విశాల్. ఈ సినిమా విజయానికి ఫస్ట్ రీజన్ ఇదే.

హీరోయిజానికి ఫస్ట్ సీట్ ఇవ్వకుండా.. కంటెంట్ ను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. సైబర్ క్రైమ్ లాంటి కొందరికే అర్థమయ్యే సబ్జెక్ట్ ను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పారు. దానికి కాస్త ఎమోషనల్ యాంగిల్ జోడించారు. అభిమన్యుడు విజయానికి రెండో రీజన్ ఇది.

సినిమా స్టార్ట్ అయినప్పుడు కాస్త బోర్ కొట్టిస్తుంది. మొదటి అర్థగంట సినిమా చూస్తే ‘నా పేరు సూర్య’ సినిమానే మళ్లీ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ్నుంచి మెల్లగా కథలోకి ప్రేక్షకుడ్ని లాక్కెళ్లిన విధానం బాగుంది. నిజానికి ఇలాంటి కథను ఇలానే స్ట్రయిట్ నెరేషన్ లో చెప్పాలి. లేదంటే స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ అయి మొదటికే మోసం. ఆధార్ దుర్వినియోగం, బ్యాంక్ లోన్లపై పడిన డైలాగ్స్, చూపించిన సీన్లు బాగా క్లిక్ అయ్యాయి.

ఓవరాల్ గా ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ కొత్త కంటెంట్ తో తెరకెక్కిన అభిమన్యుడు సినిమా అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు, సైబర్ క్రైమ్స్ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చాటిచెప్పింది ఈ సినిమా.

రేటింగ్2.75/5