'ఆవిరి' మూవీ రివ్యూ

Friday,November 01,2019 - 02:05 by Z_CLU

న‌టీన‌టులు : ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ త‌దిత‌రులు

కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి

మ్యూజిక్ : వైధి

స్క్రీన్‌ప్లే : స‌త్యానంద్‌

ర‌చ‌న‌- నిర్మాత‌- ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు

నిడివి : 112 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 1 నవంబర్ 2019

 

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న రవిబాబు ఈసారి ‘ఆవిరి’ అనే డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దిల్ రాజు సమర్పణలో విడుదలైన ఈ సినిమాతో రవిబాబు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడా .. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీ.ఈ.ఓ గా ఉండే రాజ్ కుమార్(రవి బాబు) తన పెద్ద కూతురు శ్రియ( బేబీ మోక్ష) ఆరోగ్యరిత్యా మరణించడంతో తన భార్య లీల(నేహ చౌహాన్), చిన్న కూతురు మున్ని(బేబీ శ్రీ ముక్త‌) తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు.

అలా కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన రాజ్ కుమార్ కొన్ని సందర్భాల్లో మున్ని మీద కోప్పడుతుంటాడు. ఈ క్రమంలో మున్నిను ఇంటి బయటికి తీసుకెళ్ళడానికి ఆవిరి రూపంలో ఉండే ఆత్మ ప్రయత్నిస్తుంది. చాలా సార్లు ఆత్మ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆ సందర్భంలో తన మిత్రుడు పోలిస్ ఆఫీసర్( ముక్తార్ ఖాన్) సహాయంతో ఇంటికి సెక్యూరిటీ ప్రొటెక్ట్ ఏర్పాటు చేస్తాడు రాజ్ కుమార్.

అయినా వాటన్నిటిని దాటి పాపను వేరే ప్లేస్ లో దాచిపెడుతుంది ఆత్మ. అయితే రాజ్ కుమార్ చిన్న కూతురిని టార్గెట్ చేసిన ఆ ఆత్మ ఎవరిది..? చివరికి ఆవిరి రూపంలో ఉన్న ఆత్మ తన శత్రువుపై ఎలా రివేంజ్ తీర్చుకుంది అనేది ‘ఆవిరి’ కథాంశం.

నటీ నటుల పనితీరు :

ఇప్పటికే ఎన్నో పాత్రలతో నటుడిగా నిరుపించుకున్న రవి బాబు మరో సారి తనకి యాప్ట్ అనిపించే పాత్రలో నటించి పరవాలేదు అనిపించుకున్నాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో రవిబాబులో డైరెక్టర్ నటుడిని డామినేట్ చేసాడు. నేహా చౌహాన్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో మినహా సినిమా అంతా అమ్మ పాత్రలో ఆకట్టుకుంది. డాక్టర్ పాత్రలో భరణి శంకర్ పరవాలేదనిపించాడు. మున్ని క్యారెక్టర్ లో బేబీ శ్రీ ముక్త‌ బాగా నటించింది. అలాగే తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ ప్రియ వడ్లమాని తన నటనతో ప్లస్ అయింది. ఇక ముక్తార్ ఖాన్, కాశి విశ్వనాధ్ , సంధ్య తదితరులు పరవాలేదు అనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

టెక్నికల్ గా సినిమాకు అందరూ సపోర్ట్ అందించారు. ముఖ్యంగా ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నారాయ‌ణ రెడ్డి ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌ ఎడిటింగ్ బాగుంది. వైధి నేపథ్య సంగీతం పరవాలేదు. రవిబాబు కథ, సత్యా నంద్ కథనం ఆకట్టుకోలేకపోయాయి. సన్నివేశాలకు మాటలు  కూడా పేలవంగా అనిపించాయి. కొన్ని సందర్భాల్లో రవి బాబు డైరెక్షన్ కూడా సినిమాకు వీక్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

రవిబాబు సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. అది ఒకప్పటి మాట. ఇప్పుడు రవిబాబు సినిమాలు ప్రేక్షకుల్లో ఆ క్యూరియాసిటీని కలిగించ లేకపోతున్నాయి. రవిబాబు నుండి వస్తున్న వరుస ఫ్లాపు సినిమాలే ఇందుకు కారణం. ఈ మధ్య తన సినిమాలతో ప్రేక్షకులను దారుణంగా నిరుత్సాహ పరిచిన రవిబాబు ‘ఆవిరి’తో కూడా మళ్ళీ అదే రిపీట్ చేసాడు.

నిజానికి తక్కువ బడ్జెట్ లో కొంత మంది నటీనటులతో ఓ క్వాలిటీ సినిమా తీయడంలో దర్శకుడిగా రవిబాబు దిట్ట. అయితే ఇది ఒకప్పుడు. ఇప్పుడు రవిబాబు సినిమాలు వేరు. ఒక లైన్ అనుకొని దానికి ఇంప్రెస్ అయి జస్ట్ కొన్ని గంటల్లోనే కథను రెడీ చేసుకుంటున్నాడు. అదే ఇప్పుడు రవిబాబు సినిమాలకు పెద్ద మైనస్ అవుతుంది. తను ఇంప్రెస్ అయిన కథకు సరైన సన్నివేశాలతో ఆసక్తికరమైన కథాంశం రాసుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు. ‘ఆవిరి’ విషయంలో కూడా అదే జరిగింది. ఒక ఆత్మ ఆవిరి రూపంలో కనిపిస్తూ భయపట్టే అంశం బాగున్నప్పటికీ దాన్ని రొటీన్ హార్రర్ డ్రామాగా తెరకెక్కించి బోల్తా కొట్టాడు. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగించలేకపోయాడు రవిబాబు. సినిమాలో హార్రర్ లేకపోయినా కనీసం సన్నివేశాలతో థ్రిల్ కూడా చేయలేకపోయాడు. దాంతో సినిమా ఆధ్యంతం ప్రేక్షకుల్లో ఓపికను పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఇక సినిమాకు బలంగా నిలవాల్సిన ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలు కూడా తేలిపోయాయి. ముఖ్యంగా నటీ నటులు నటించిన తీరు వల్ల ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సిన చోట కూడా ప్రేక్షకుడికి అది ఫేక్ ఎమోషన్ లా అనిపిస్తుంది. ఏ సినిమాకైనా బలమైన సన్నివేశాలు పడాలి. అప్పుడే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. హార్రర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు అది మరీ ముఖ్యం. అలాంటి సన్నివేశాల వల్లే రవిబాబు తెరకెక్కించిన ‘అనసూయ’,’అవును’ సినిమాలు ప్రేక్షకులను థ్రిల్ చేసి బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. ఇక ఆవిరిలో అలాంటి సన్నివేశాలు లేకపోవడం నేపథ్య సంగీతం కూడా పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఒక్కలైన్ లో సినిమా గురించి చెప్పాలంటే “ఓ ఇల్లు… అందులో చిన్న కుటుంబం… ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, చివరిలో ఆత్మ రివేంజ్” ఇంతే. వీటితో ‘ఆవిరి’ బాక్సాఫీస్ దగ్గర నెట్టుకురావడం కష్టమే.

రేటింగ్ : 1.5/5